పరాజయం అన్నది చిన్న విషయం కాదు. ఎంతటి వారినైనా కిందకు లాగేస్తుంది. అలాంటిది విజయాల బాటలో అప్రతిహతంగా సాగిపోతున్న వారికి, దెబ్బ మరీ గట్టిగా తగుల్తుంది. ఇప్పటిదాకా ఎరుగని రుచి అయినపుడు మొహాన ఫీలింగ్ లు మరీ ఎక్కువగా వుంటాయి.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిస్థితి అదే. ఇప్పటి వరకు తనేంటో, తన లోకమేంటో అన్నట్లు వుంటూ వచ్చారు. తనకెవరితో సంబంధాలు అవసరం లేదు. తన సినిమాలు, తన బ్యానర్, తన ఇష్టం అన్నట్లుగా ముందుకు వెళ్తూ వచ్చారు. గట్టిగా ఓ అరడజను నుంచి డజను మందితో అది కూడా తన పనికి సంబంధించి త్రివిక్రమ్ మాటలు కలుపుతూ వచ్చి వుంటారు. అంతకు మించి అంటే మహా అయితే ముగ్గురు నలుగురు వుంటారేమో?
మామూలుగానే ఇలా ఏకాంతవాసిలా వుండే తివిక్రమ్ ఇప్పుడు, అజ్ఞాతవాసి ఘోర పరాజయం తరువాత పూర్తిగా ఏకాంతవాసిగా మారిపోయారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఆయన ఇల్లు, హయాత్ హోటల్, హారిక ఆఫీసు, తన సెంటిమెంట్ అయిన పంజగుట్ట దగ్గరి పాత అద్దె ఇల్లు. ఇక్కడ తప్ప ఇంకెక్కడా కనిపించింది లేదు.
ఇప్పుడు అయితే ఏకంగా తన ఇంటికే పరిమితమై పోయారని తెలుస్తోంది. అత్యంత సన్నిహితులతో కూడా ఇటీవల మాట్లాడలేదని వినికిడి. వచ్చేనెల 14తరువాత ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేస్తారు. అప్పుడు మరి మళ్లీ సినీ జన జీవన స్రవంతిలోకి అడుగుపెడతారేమో చూడాలి.
పవన్ డిటో.. డిటో
ఇక హీరో పవన్ కళ్యాణ్ సంగతి చెప్పేదేముంది. సినిమాలు వుంటే ఒకె. లేదూ అంటే ఫాంహౌస్ లో ఏకాంతంగా వుండిపోతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంట్లోనే వుంటున్నారని, కానీ ఎవర్నీ కలవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఖరికి ఆయన వ్యక్తిగత వ్యవహారాలు, అవసరాలు చూసే, ఒకరిద్దరిని కూడా కలవడం లేదని టాక్ వినిపిస్తోంది.
నిజానికి, అజ్ఞాతవాసి విడుదల తరువాత పవన్ తన రాజకీయ కార్యకలాపాలపై బిజీ అవుతారని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఆయన దగ్గర నిర్మాతల అడ్వాన్స్ లు ఇంకా రెండు మూడు వున్నాయి. మరి వాటి సంగతేమిటో? ఆ సినిమాలు చేస్తారో? ఆపేస్తారో? చూడాలి.
అజ్ఞాతవాసి సినిమాను తన ఫ్యాన్స్ కూడా పూర్తిగా చూడలేదని అంచనాలు అందుతుండడం, ఫ్యామిలీలు, చాలావర్గాలు సినిమాకు దూరంగా వుండిపోయాయని వార్తలు రావడం పవన్ ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా ఏకాంత వాసానికి పరిమితం అయిపోయినట్లున్నారు.