ఒకేసారి టాలీవుడ్ లోని పది బడా నిర్మాణ సంస్థలపై ఆదాయపన్ను శాఖ సిబ్బంది చెకింగ్ లు చేసారు. దీంతో ఆదాయపన్ను దాడులు జరిగాయంటా వార్తలు గుప్పమన్నాయి.
ముందుగా ఈ వార్తలు కేవలం నిర్మాత సి కళ్యాణ్ ఆఫీసు మీద అని బయటకు వచ్చాయి. దాంతో సి కళ్యాణ్ లేటెస్ట్ గా జై సింహా నిర్మించారు. ఆ సినిమా హిట్ అని టాక్ వచ్చింది. అందుకే రైడ్స్ జరిగి వుంటాయి అని అనుకున్నారు.
అయితే ఈ రైడ్స్ కేవలం సి కళ్యాణ్ ఆఫీసు మీద కాదు అని, మరో పది ఆఫీసుల వరకు జరిగాయని తెలుస్తోంది. డివివి దానయ్య, సి కళ్యాణ్, హారిక హాసిని, సురేష్ మూవీస్, భవ్య క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తదితర నిర్మాతల సంస్థల కార్యాలయాలకు ఆదాయపన్నుశాఖ సిబ్బంది వచ్చినట్లు తెలిసింది.
వివిధ చెల్లింపులకు సంబంధించి టీడీఎస్ లు సక్రమంగా కట్ చేస్తున్నారా? అలా కట్ చేసిన టీడీఎస్ లు ఆదాయపన్ను శాఖకు సక్రమంగా జమ చేస్తున్నారా? లేదా అన్నదానిపై ఎక్కువగా దృష్టి పెట్టి, ప్రశ్నించి, రికార్డులు పరిశీలించారని వినికిడి.
అయితే సిన్మాలు విడుదలైన, నిర్మాణంలో వున్న సంస్థల దగ్గర, వాటి బడ్జెట్, రికవరీ వంటి వాటి గురించి కూడా వాకబు చేసారని తెలుస్తోంది. సాయంత్రం అయిదింటి వరకు ఈ కార్యక్రమాలు సాగాయి. జై సింహా, ఇంటిలిజెంట్, అజ్ఞాతవాసి సినిమాల విషయమై జస్ట్ వాకబు చేసారు తప్ప, వాటికి సంబంధించిన సోదాలు కాదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.