అజ్ఞాతవాసికి ఇలా ఫ్లాప్ టాక్ వచ్చిందో లేదో అలా ప్లాన్-బి అమలు చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. విడుదల టైమ్ లో తొలిగించిన వెంకటేష్ సీన్లను వెంటనే యాడ్ చేశాడు. కానీ త్రివిక్రమ్ ప్లాన్ పనిచేయలేదు. ప్లాన్-బి కూడా పారలేదు. వెంకీ సన్నివేశాలు జతచేశారని తెలిసినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు.
నిజానికి సంక్రాంతి నుంచి వెంకీ సన్నివేశాల్ని యాడ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ వసూళ్లు రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో.. భోగి నుంచే వెంకీని సినిమాలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ అజ్ఞాతవాసి పతనం ఆగలేదు. కలెక్షన్లు మెరుగుపడలేదు.
నిజానికి అజ్ఞాతవాసి విడుదలైన రెండో వారానికి వెంకటేశ్ నటించిన సన్నివేశాల్ని జతచేయాలనుకున్నారు. ఇలా చేయడం వల్ల రిపీట్ ఆడియన్స్ పెరిగి, కలెక్షన్లు మరింత పెరుగుతాయనేది మేకర్స్ ఫీలింగ్. కానీ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆఘమేఘాల మీద విడుదలైన 4రోజులకే వెంకీ నటించిన 7నిమిషాల సన్నివేశాలు జతచేశారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. కాసులు కురిపించే సంక్రాంతి సీజన్ లో కూడా అజ్ఞాతవాసి వెలవెలబోతోంది.
వెంకీ, పవన్ కాంబినేషన్ లో సన్నివేశాలు యాడ్ చేయడం వల్ల అజ్ఞాతవాసికి ఆడియన్స్ పెరగలేదు. ఆది, సోమవారాలు ఈ సినిమా వసూళ్లలో, ఆక్యుపెన్సీలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సినిమానే బాగాలేనప్పడు వెంకీ సీన్లు జతచేయడం వల్ల జనాలు వచ్చేస్తారని భావించడం యూనిట్ అవివేకం.
నిజానికి మొదటి రోజు నుంచే సినిమాలో వెంకీ కనిపించి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది. ఇలా ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత యాడ్ చేయడం వల్ల ఆడియన్స్ ఇగో దెబ్బతీసినట్టయింది. చివరికి ఇప్పుడీ సినిమాను అటు పవన్ ఫ్యాన్స్, ఇటు దగ్గుబాటి అభిమానులు కూడా పట్టించుకోవడం మానేశారు. పండగ సీజన్ ముగిసిన వెంటనే అజ్ఞాతవాసి నష్టాల లెక్కలు బయటకురాబోతున్నాయి.