ఎమ్బీయస్‌: పోసాని ఏమీ అనటం లేదేం?

నందీ ఎవార్డులపై విమర్శల సందర్భంగా లోకేశ్‌ ఆంధ్రలో ఆధార్‌ కార్డులు లేనివారెలా విమర్శిస్తారని ప్రశ్నించినపుడు పోసాని విరుచుకుపడ్డారు. లోకేశ్‌ వాదనను తూర్పాబడుతూ పనిలో పనిగా కెసియార్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణలో ఆంధ్రమూలాలున్నవారిపై ఎలాటి వివక్షత…

నందీ ఎవార్డులపై విమర్శల సందర్భంగా లోకేశ్‌ ఆంధ్రలో ఆధార్‌ కార్డులు లేనివారెలా విమర్శిస్తారని ప్రశ్నించినపుడు పోసాని విరుచుకుపడ్డారు. లోకేశ్‌ వాదనను తూర్పాబడుతూ పనిలో పనిగా కెసియార్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణలో ఆంధ్రమూలాలున్నవారిపై ఎలాటి వివక్షత చూపటం లేదని, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, లోకేశ్‌, ఆయన తండ్రి కెసియార్‌ చూసి నేర్చుకోవాలని విరుచుకుపడ్డారు. కాళ్లు కడగాలని కూడా అన్నట్టు గుర్తు.

లోకేశ్‌ను తప్పుపట్టడం వరకు ఒప్పయినా, కెసియార్‌ను అంత ఎత్తేయాలా అని అప్పుడే అనుకున్నాను. అంతలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు వచ్చాయి. ఎన్టీయార్‌తో సహా ఆంధ్రమూలాలున్న తెలుగు మహానుభావులెందరికో తగిన గౌరవం యివ్వలేదని విమర్శలు వచ్చాయి. సాటి తెలుగు ముఖ్యమంత్రిని కూడా పిలవలేదు. దానిపై పోసాని స్పందిస్తారని ఎదురు చూశాను. ఇప్పటిదాకా ఆయన ఆ పని చేసినట్లు కనబడలేదు. 

తెలుగు మహాసభలకు ఎవర్ని ఎందుకు పిలిచారో, ఎందుకు పిలవలేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర మూలాల వారందరినీ పక్కన పెట్టారా అంటే సినిమా రంగం విషయంలో ఆ పట్టింపు పెట్టుకున్నట్లు లేదు. సభ గ్లామరస్‌గా కనబడాలంటే అలాటి శంకలు పెట్టుకోకూడదనుకున్నారా? లేక సినీ పరిశ్రమ ఆంధ్రకు తరలిపోకుండా నిలిచినందుకు సత్కరించ దలచారా? తెలియలేదు.

ఇక కవులు, రచయితలు, పండితులు యిత్యాదుల్లో ఎవరు ఆంధ్రులో, ఎవరు ఆంధ్రమూలాల వారో, ఎవరు తెలంగాణ వారో ఆ వివరాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఆ కోణంలో ఎవరు రికార్డులు మేన్‌టేన్‌ చేస్తారు?   కథారచయితల విషయంలో డైరక్టరీలున్నాయి. వాటిలో రచయిత పుట్టిన ఊరు నమోదై ఉంటుంది. ఆ ప్రకారం ఆంధ్రులందరినీ తీసిపారేశారా? ఎవరైనా హైదరాబాదులో పుట్టినట్లు ఉన్నా, 'వీడి తండ్రి నూరేళ్ల క్రితం ఆంధ్ర నుంచి తరలి వచ్చాడు కాబట్టి, వీణ్ని పిలవకూడదు' అని పేర్లు కొట్టేస్తూ వచ్చారా? ప్రతి రచయిత గురించి దస్తావేజులు ఉంటాయా? అబ్బే.

అతని రాత బట్టో, యాస బట్టో లెక్కలేశారా? రాత బట్టి కనుక్కోవడం కష్టం. ఎందుకంటే ఇంచుమించు అందరూ ఒకలాటి భాషలోనే రాస్తారు. ఇక యాస తెలియాలంటే అతనితో ప్రత్యక్ష పరిచయం ఉండి తీరాలి. అప్పుడైనా అతని యాసను అంచనా వేయగల శక్తి, ఒకవేళ యాస లేకుండా మాట్లాడితే ఊహించే శక్తి అవతలివాళ్లకు ఉండాలి.

ఒకవేళ యిలాగే జరిగి ఉండి వుంటే యిది కొందరు వ్యక్తుల సమూహం కూర్చుని ఎవరు తమవారో, ఎవరు పెఱవారో ఏరివేత కార్యక్రమం చేపట్టి ఉండాలి. వీరికి అందరు సాహితీకారులతో ప్రత్యక్ష పరిచయాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కవిరచయితలందరూ సంఘాల్లో చేరరు, సమావేశాల్లో పాల్గొనరు. అందువలన వీరు ఊహాపోహలతోనే ఆహ్వానితుల జాబితా తయారుచేశారని అనుకోవాలి. 

నిజానికి తెలుగు మహాసభలు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క కళాకారుణ్నీ, రచయితనూ పిలవడం అసాధ్యం. వారిలో అప్పటికే ప్రభుత్వం తరఫు నుండి అవార్డులు, పురస్కారాలు అందినవారినైనా పిలవాలి. కేంద్ర, రాష్ట్ర సాహిత్య ఎకాడమీ అవార్డు గ్రహీతలున్నారు, స్థానిక యూనివర్శిటీలు సత్కరించి పురస్కారాలు యిచ్చిన వారున్నారు. వారినైనా ఆహ్వానించక పోతే ఎలా? అక్కడ మళ్లీ వివక్షత చూపించారు. విభజన తర్వాత ఆంధ్రలో యిస్తున్న అనేక ప్రభుత్వ, ప్రయివేటు పురస్కారాల్లో యిలాటి వివక్షత కనబరచటం లేదు.

అనేకమంది తెలంగాణవారిని పిలిచి సత్కరిస్తున్నారు. తెలంగాణలో ఉంటూ కూడా ఆంధ్రమూలాలున్నవారు వివక్షతకు గురవుతున్నారు. వీళ్లు 'తెలుగు రోహింగ్యా'లగా పోసానికి తోచలేదా? తనతో బాటు కొందరు సినిమావాళ్లను సభలకు పిలిస్తే యావదాంధ్రులను, తెలంగాణలోని ఆంధ్రమూలాల వారిని సత్కరించినట్లు అనుకున్నారా?

అన్నిటి కన్న ఘోరం, సాటి తెలుగు ముఖ్యమంత్రిని పిలవకపోవడం. చాలామందిని ఆఖరి నిమిషందాకా పిలవలేదట. బాబును కూడా చివరి రోజు ఫంక్షన్‌కు అలాగే పిలుస్తారని ఊహాగానాలు సాగాయి. చివరకు ఆ మర్యాద కూడా పాటించలేదు. ఆంధ్రులను రాక్షసజాతి అని తిట్టి, దరిమిలా కూడా దానికి క్షమాపణ చెప్పని, సవరణ చేయని కెసియార్‌ను అమరావతి శంకుస్థాపనకు పిలిచి ఆయన పేరు శిలాస్తంభంపై చెక్కించినందుకు యిదా ప్రతిఫలం? కెసియార్‌ ఆంధ్రలో వ్యక్తిగతమైన ఫంక్షన్లకు హాజరైనా అక్కడ తోరణాలు కడుతున్నారే, తెలుగు మహాసభల్లో కొందరు ఆంధ్ర కవులను పిలిచి శాలువా కప్పితే తెలంగాణ పరువు పోతుందా? సినిమావాళ్లు కాకుండా, వెతికి చూస్తే సన్మానితుల్లో ఎవరో కొందరు ఆంధ్రమూలాల వారుండవచ్చు.

వారిని పిలవడానికి వేరే కారణాలు ఉండవచ్చు. గద్దర్‌, విమలక్క వంటి వారిని పిలవకపోవడానికి రాజకీయ కారణాలు ఉండవచ్చు. కానీ, బై అండ్‌ లార్జ్‌, యీ మహాసభల్లో ఆంధ్రమూలాల వారిని పక్కన పెట్టేశారు. ప్రపంచ మహాసభలన్నపుడు ఆంధ్ర వేరే ప్రపంచానికి చెందినది కాదుగా! కెసియార్‌కు అనేక పద్యాలు నోటికి వచ్చు కానీ 'చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ' అన్నట్లు ఆ పద్యాలు నేర్పే సంస్కారం ఆయనకు వంటబట్టలేదని యీ సభలు నిరూపించాయి. నిష్కల్మషంగా, నిష్పక్షపాతంగా మాట్లాడే పోసాని దీన్ని ఖండిస్తారని ఆశించి ఆశాభంగం చెందడం చేతనే యిది రాయవలసి వచ్చింది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]