త్రివిక్రమ్‌.. ఇలా ఎన్నిరోజులు…?

అవతల కొత్తతరం దర్శకులు, రచయితలు వస్తున్నారు.. వీళ్లు కాపీ కేటుగాళ్లు కాదు.. కొత్తగా చేసి చూపిస్తున్నారు. తమ కథల్లో, సినిమాలతో ఫ్రెష్‌నెస్‌ను చూపిస్తున్నారు. అలాంటి సినిమాలను ప్రేక్షకులు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. తీసినవాడు స్టార్‌…

అవతల కొత్తతరం దర్శకులు, రచయితలు వస్తున్నారు.. వీళ్లు కాపీ కేటుగాళ్లు కాదు.. కొత్తగా చేసి చూపిస్తున్నారు. తమ కథల్లో, సినిమాలతో ఫ్రెష్‌నెస్‌ను చూపిస్తున్నారు. అలాంటి సినిమాలను ప్రేక్షకులు కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. తీసినవాడు స్టార్‌ డైరెక్టరా, కొత్తవాడా.. అనే అంశాలను ప్రేక్షకులు పట్టించుకోవడంలేదు. ఎలాంటి సినిమాను తీశాడు, ఎంతలా ఆకట్టుకున్నాడు.. అనేదే క్రైటీరియా.

ప్రేక్షకులను అలా అలరించేవాడే స్టార్‌ డైరెక్టర్‌. అంతకుమించి ఇంకేంలేదు. ఈ విషయాన్ని స్టార్‌ దర్శకులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైనట్టుంది. స్టార్లుగా చలామణి అయిపోతూ.. తమను తాము అన్నింటికీ అతీతులం, మేధావులం అని కలరింగ్‌ ఇస్తూ.. తీసే సినిమాలు మాత్రం మరీ నాసిరకంగా ఉంటే..  చివరికి మిగేలేది ఏమిటో సదరు స్టార్‌ డైరెక్టర్లే అర్థం చేసుకోవాలి.

నిస్సందేహంగా త్రివిక్రమ్‌ ఒక ట్రెండ్‌సెట్టర్‌. ప్రత్యేకించి డైలాగ్‌ రైటింగ్‌లో, ఒక సీన్‌ను ఆకట్టుకునేలా రాయడంలో త్రివిక్రమ్‌ ప్రతిభ గురించి వేరే చెప్పనక్కర్లేదు. అతడి సినిమాలే అందుకు సాక్ష్యం. నవ్వించే సీన్లను హ్యూమరస్‌గా, బాధపెట్టే సినిమాలను గుండెకు టెచ్‌ చేసేలా,  ప్రేమను వ్యక్తపరిచే సీన్లను టీజింగ్‌గా, కోపం వ్యక్తం చేసే సీన్లను క్రియేటివ్‌గా రాసే ప్రతిభావంతుడు త్రివిక్రమ్‌. అయితే.. రాను రానూ పదును తగ్గుతోంది. సినిమా సినిమాకూ ఆ వేడి తగ్గుతోంది.

మొదటి నుంచి కాపీకొట్టి, ఇన్‌స్పైర్‌ అయ్యి సీన్లను రాసుకొంటూ వస్తున్న త్రివిక్రమ్‌లోని రచయిత.. వాటిని తన కథకు అనుగుణంగా మాడిఫై చేయడంలో అపారమైన ప్రతిభను చూపించాడు. లైఫ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌ వంటి హైఎమోషన్‌ సినిమాలోని లవ్‌ సీన్లను చిరునవ్వుతో వంటి సరదా సినిమాలోకి దించేయడంలో త్రివిక్రమ్‌ టాలెంట్‌ను మెచ్చుకోవాలి. కాపీకొట్టాడు అని అక్కడ ఫిర్యాదు చేయడం కన్నా.. చాలాచక్కగా ఆ సీన్లను అనువదించాడు.. అని ప్రశంసించాలి.

కానీ ఇప్పుడు పరిస్థితి ఎక్కడకు వచ్చిందంటే.. నిజంగా కాపీకొట్టి కూడా త్రివిక్రమ్‌ మంచి సినిమాలను అందించలేకపోతున్నాడు. ఎలాంటి సినిమా తీయాలి? అనేది చాలామంది దర్శకులకు ఒక ఫజిల్‌. ఎలాంటి కాన్సెప్ట్‌ను ఎంచుకోవాలి? అనేది అంత ఈజీకాదు. ఆ కాన్సెప్ట్‌తో ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకోగలం? అనేది జడ్జ్‌ చేసుకోవడమే ఒక మూవీ మేకర్‌ సామర్థ్యానికి నిదర్శనం. దానికోసం నెలలు, సంవత్సరాలు కూడా తలలు బద్ధలు కొట్టుకోవాల్సి రావొచ్చు. ఒక్కో సినిమా కాన్సెప్ట్‌ను ఎంచుకోవడానికి, అందులోని క్యారెక్టరైజేషన్స్‌ను డిజైన్‌ చేసుకోవడానికే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే త్రివిక్రమ్‌కు అలాంటి కష్టాలులేవు!

చాలా ఈజీగా విదేశీ సినిమాల నుంచినో, లేక పాత సినిమాల నుంచినో కాన్సెప్ట్స్‌ను తయారు చేసుకుంటాడు. ఈ విషయంలో మరోమాట లేదు. చాలా సామాన్యమైన సినీ ప్రేక్షకుడు కూడా.. త్రివిక్రమ్‌ ఈ సినిమా కాన్సెప్ట్‌ను ఫలానా సినిమా నుంచి కాపీ చేశాడు, దాన్ని బేస్‌ చేసుకుని తీశాడనే విషయాన్ని గ్రహించేస్తాడు. కాబట్టి.. సినిమా క్రియేషన్‌లో అత్యంత కీలకమైన ఘట్టాన్ని చాలా ఈజీగా పూర్తి అయిపోయినట్టే.

విదేశీ సినిమాలు, పాత నవలలు.. ఇవేవీ.. త్రివిక్రమ్‌కు మినహాయింపుకాదు. ఒక నవలలోని కథను యథాతథంగా తీసేయడం అంతకష్టం కాదు.. అందులోనూ త్రివిక్రమ్‌ లాంటి ఉద్ధండపిండానికి! 'అ..ఆ' వంటి సినిమాకు త్రివిక్రమ్‌ రాసుకున్న స్క్రిప్ట్‌ ఏమీలేదు. యథాతథంగా 'మీనా' నవలను ఫాలో అయిపోయాడు. బహుశా ఎవ్వరూ కనుక్కోలేడని అనుకున్నాడో ఏమోకానీ.. యద్ధనపూడి వంటి తన అభిమాన రచయిత పేరును వేయడకుండా తన స్థాయిని తనే తగ్గించేసుకున్నాడు.

యద్ధనపూడి సులోచనరాణి తన అభిమాన రచయిత అని త్రివిక్రమ్‌ చాలాసార్లు చెప్పాడు. ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి 'సాక్షి' వాళ్లతో కలిసి ఒకసారి యద్ధనపూడి వద్దకు కూడా వెళ్లాడీయన.  ఇంటర్వ్యూ వీలుకాలేదని చెప్పి.. యద్ధనపూడి గురించి తన అభిమానాన్ని, ఆరాధనను అందంగా చెప్పాడు కూడా. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. ఆ మహా రచయిత్రి పేరును వేయకుండా ఆమె నవలను సినిమాగా తీసేసుకోవడం అంటే.. అది ఏ రకంగా చూసినా అభినందించదగిన చర్యకాదు కదా?

ఇక ఇన్నాళ్లూ మూల కథలను తీసుకుని.. వాటికి రకరకాల రిపేర్లు చేస్తూ.. త్రివిక్రమ్‌ ఎంతోకొంత ఆకట్టుకున్నాడు. అయితే ఈసారి అలా చేయడంలో కూడా ఈ దర్శకరచయిత దాదాపు ఫెయిల్‌ అయ్యాడు. ఈసారి 'లార్గోవించ్‌'ను తీసుకొచ్చి.. 'అజ్ఞాతవాసి'ని చేయబోయి.. బొక్కబోర్లా పడ్డాడు త్రివిక్రమ్‌. మూలకథను తీసుకుని దాన్ని మాడిఫై చేయడంలో అయినా సక్సెస్‌ అయ్యే త్రివిక్రమ్‌లోని రచయిత.. ఈసారి కూడా తన పాతదారిలోనే వెళ్లి ఆకట్టుకోలేకపోయాడు. ఈసారి కామెడీ ఏమిటంటే.. త్రివిక్రమ్‌ ఎక్కడో ఫ్రెంచి సినిమా నుంచి మూలకథను కాపీ కొట్టుకు వచ్చాడు. ఇక సీన్ల విషయంలో కూడా చాలా తెలుగు సినిమా జాడలు అగుపించడం గమనార్హం.

వెన్నెల కిషోర్‌ పాత్రను పవన్‌ కల్యాణ్‌ పాత్ర ట్రాప్‌ చేసి.. అతడి పేరుతో, అతడి ప్రొఫైల్‌తో ఆఫీసులోకి ఎంటర్‌ అయ్యే.. సీన్‌ను చాలా తెలుగు సినిమాల్లో చూశాం. 'కింగ్‌' సినిమాలో నాగార్జున 'సునీల్‌'ను వాడుకుంటాడు. తన అసలు కథను దాచి నాగార్జున పాత్ర సునీల్‌ పేరుతో, అతడి ప్రొఫైల్‌తో పెళ్లి సంబంధాలు చూస్తుంది. కింగ్‌ కన్నా ముందు వచ్చిన అల్లరి నరేష్‌ సినిమా 'బ్లేడ్‌ బాబ్జీ'లో శ్రీనివాస్‌ రెడ్డి పాత్రను కట్టిపడేసి.. అల్లరి నరేష్‌ పోలీసాఫీసర్‌గా ఎంటర్‌ అవుతాడు. అల్లరి నరేష్‌ గ్యాంగ్‌ శ్రీనివాస రెడ్డిని కట్టిపడేస్తే.. అతడు తప్పించుకుని రావడం.. పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. అసలు విషయాన్ని తిరిగి అల్లరినరేష్‌ చెవినే వేయడం.. వంటి కామెడీ సీన్లు 'అజ్ఞాతవాసి'లో కూడా రిపీట్‌ అయ్యాయి.

అందులో శ్రీనివాసరెడ్డి- అల్లరి నరేష్‌ మధ్యన నడిచే సీన్లు ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ – పవన్‌ కల్యాణ్‌ల మధ్య నడుస్తాయి. 125కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ సినిమాలో.. ఇలాంటి బేసిక్‌ కామెడీ సీన్లు రిపీట్‌ అవుతూ ఉంటే, ఎక్కడో కొట్టుకొచ్చిన కాపీ కథలతో.. అసలు వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వకుండా, వీళ్ల పేర్లు వేసుకొంటూ ఉంటే.. ఇది చూడటానికా.. వందలు, వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని సినిమాకు వెళ్లడం? అనే ఆలోచనలు సామాన్య ప్రేక్షకుడికి రాకముందే ఈ కాపీరాయుళ్లు కొంత జాగ్రత్త పడటం మంచిది. లేకపోతే.. తెలుగు సినిమాల మీదే నమ్మకం పోతుంది సుమా!