రెండేళ్ల కిందట సంచలన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్ సీరిస్ పాతాల్ లోక్. అమెజాన్ లో విడుదలైన ఈ వెబ్ సీరిస్ కు సర్వత్రా సానుకూల స్పందన వ్యక్తం అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ఈ వెబ్ సీరిస్ గురించి నెటిజన్లు ఒక రేంజ్ లో మాట్లాడుకున్నారు. ఈ వెబ్ సీరిస్ లో నటించిన నటులకు కూడా మంచి పేరొచ్చింది.
ఆ పేరు ఇప్పుడు వారికి భారీ రెమ్యూనిరేషన్లనూ తెచ్చిపెడుతున్నట్టుగా ఉంది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రెండో సీజన్ కు రూపకల్పన జరుగుతోంది. ఇందులో భాగంగా ఆ నటులే కొనసాగుతున్నారు. వీరిలో బాగా పేరు సంపాదించుకున్న నటుడు జయదీప్ అహ్లావత్ కు రెండో సీజన్ కు గానూ భారీ రెమ్యూనిరేషన్ అందుతోందని సమాచారం.
రెండో సీజన్ లో నటనకు గానూ జయదీప్ 20 కోట్ల రెమ్యూనిరేషన్ పొందబోతున్నాడట. ఒక వెబ్ సీరిస్ కు సంబంధించి స్టార్ డమ్ ఏమీ లేని నటుడికి ఇది భారీ స్థాయి పారితోషికమే. మరో విశేషం ఏమిటంటే.. తొలి సీజన్లో ఇదే నటుడికి దక్కిన పారితోషికం కేవలం 40 లక్షలు.
ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. రెండో సీజన్ కే ఇతడి పారితోషికం 40 లక్షల నుంచి ఇరవై కోట్ల రూపాయలకు చేరింది!