1. రజనీకాంత్‌లా చిరంజీవికి కూడా కథల సమస్య. ఎందుకంటే వాళ్ల నుంచి జనం చాలా Expect చేస్తారు. దాన్ని డైరెక్టర్లు రీచ్ కాలేరు. ఫలితమే రజనీ వరుస ప్లాప్స్. చిరంజీవి సైరా ప్రమాదం నుంచి బయట పడడానికి కారణం అది ఒక తిరుగుబాటు వీరుడి బయోపిక్. సినిమాలో ఎన్నో పాత్రలు ఎమోషన్స్ వున్నాయి. ఆచార్య కేవలం ఒన్ మాన్ షో. అదనంగా చరణ్ వచ్చి చేరాడు కానీ , ఆయన లేకపోయినా కథకేం నష్టం లేదు.
ఎందుకంటే చిరంజీవి చేసిన పనులే చరణ్ చేశాడు తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. చిరంజీవి చేసే ఫైట్స్ బోలెడు వెర్షన్స్ జనం ఆల్రెడీ చూసేశారు. కొత్తగా ఫీల్ కావాలంటే ఎమోషన్ పండాలి. అఖండలో విలన్ల క్రూరత్వం ఎస్టాబ్లిష్ కావడంతో జనం Accept చేశారు. ఆచార్యలో సోనూసూద్ దుర్మార్గం పండలేదు. అతను పాతికేళ్ల క్రితం విలన్‌లా వున్నాడు తప్ప, చిరంజీవి అంతలా చావబాదాల్సిన పనులు Expose కాలేదు. దానికి తోడు అతను కరోనా హీరో కావడంతో ప్రేక్షకుల్లో వాళ్లకు తెలియకుండానే సాఫ్ట్‌కార్నర్ ఏర్పడింది.
2. ఎంత గొప్ప శిల్పికైనా తగిన రాయి దొరకాలి. పదునైన ఉలి వుండాలి. శిల్పమంటే మరేమీ కాదు, రాయిలోని వేస్టేజీని తీసి వేయడమే. అయితే సగం శిల్పం రాయితో, మిగతా సగం లోహంతో చేసి రెంటిని జాయింట్ చేస్తానంటే కుదరదు. ఎందుకు కుదరదంటే కుదరదంతే. పాలన్నంలోకి ఉలవ చారు కలపలేవు.
ఆచార్య ఆధ్మాత్మిక వాదంతో ప్రారంభమవుతుంది. అమ్మవారి గుడి, ధర్మస్థలి క్షేత్రం, భక్తితో కొలిచే పాదఘట్టం, గిరిజనులు. ఆ వూరికి దళంలో పనిచేసే ఒక విప్లవకారుడు వస్తాడు. నక్సలైట్ అంటే ఎవరు? సమాజం అంటే వర్గపోరాటాల చరిత్ర అని, బలవంతుడు బలహీనున్ని దోపిడీ చేస్తాడని నమ్మిన వాడు. ఈ అంతరం తొలగాలంటే సాయుధ పోరాటమే మార్గమని విశ్వసించిన వాడు.
ఆచార్యకి నిజంగా ఐడియాలజీ వుంటే ధర్మస్థలి ప్రజలకి చెప్పాల్సింది ఏమంటే సోనూసూద్ అనే దుర్మార్గుడు ఆలయం పేరుతో అక్రమాలు చేస్తున్నాడని జనం తమ వాస్తవ దుస్థితి తెలుసుకోకుండా ఉండడానికి ఆధ్మాత్మిక ముసుగు కప్పుతున్నాడని చెప్పాలి. చెప్పకపోగా ఒకమ్మాయితో అమ్మవారి శ్లోకం పాడిస్తూ మరీ ఫైట్ చేస్తాడు.
నక్పలైట్లకు మాత్రం భక్తిభావం వుండకూడదా? అనుకుని చిరంజీవితో రథాన్ని ముందుకు తోయిస్తాడు కొరటాల. కథ మీద లోతైన చర్చ, అవగాహన లేకపోవడం వల్ల ఉదాత్తత ఉండాల్సిన హీరో పాత్ర, విలన్ మనుషుల్ని కొట్టే రోబోగా మారిపోయింది. నక్సల్ నాయకుడిగా చిరంజీవి అంటే అదిరిపోతుందనుకుని, ఆ మోహంలో పడి చిరంజీవి అసలు బలాన్ని విస్మరించి, గ్రాఫిక్స్ బలాన్ని నమ్ముకున్నాడు.
3. చిరంజీవి అసలు బలం ఫైట్స్ కాదు. ఆయన హిట్ సినిమా ఏది తీసుకున్నా ఎమోషన్స్, సున్నిత హాస్యం, రొమాన్స్. ఇవన్నీ కలగలిసి వుంటాయి. ఆచార్య డిజైనింగ్‌లో లోపం వుండడంతో ఎమోషన్స్‌కి స్కోప్ లేదు. వయసు వల్ల రొమాన్స్ లేదనుకున్నా, హాస్యానికి అవకాశం లేకుండా పోయింది. ఒక ఫైట్‌లో ఇద్దరు హీరోలు కామెడీ చేయాలని చూశారు కానీ, హింసతో కామెడీ మిక్స్ కాలేదు.
4. కొరటాల బలం ఆయన రైటింగ్. గత సినిమాలు చూస్తే హీరోతో పాటు మిగతా పాత్రలు బలంగా వుంటాయి. మిర్చిలో ప్రభాస్- సత్యరాజ్ శ్రీమంతుడులో హీరోహీరోయిన్లతో పాటు జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్. భరత్‌లో మహేశ్, ప్రకాశ్‌రాజ్, జనతాగ్యారేజీలో మోహన్‌లాల్ – ఎన్టీఆర్. వాళ్ల మధ్య డైలాగ్‌లు కూడా అర్థవంతంగా వుంటాయి. వీళ్లు కాకుండా ఇతర నటులు కూడా కాసేపు కనిపించినా ఒక ముద్ర వేస్తారు. ఆచార్యలో ఫోకస్ అంతా చిరంజీవి రామ్ చరణ్‌పై ఉండడంతో మిగతా వాళ్ల ఉనికి మాయమైంది. చివరికి పూజాహెగ్డే కూడా నామమాత్రమైంది.
5. సెకెండాఫ్‌లో రామ్ చరణ్ వచ్చినా అప్పటికే పడిపోయిన సినిమాని లేపలేక పోయాడు. నక్సల్ కాల్పుల సన్నివేశాలు కూడా 20 ఏళ్ల క్రితం సినిమాలోని సీన్స్‌లా అనిపించాయి.
మైనింగ్, గిరిజనుల సమస్యలపై వెనుకటికి త్రివిక్రమ్ కూడా ఖలేజా తీసి మొటిక్కాయలు వేయించుకున్నాడు.
ఫినిషింగ్ టచ్ః
హీరోయిజంలో ఇరుక్కుపోవడం వల్ల చిరంజీవిలోని అసలు నటుడు ఇంకా ఆవిష్కృతం కాలేదని చాలా మంది నమ్మకం. ఈ బిల్డప్‌లు, ఇగోలు, బిజినెస్ లెక్కలు అన్నీ వదిలి ఒకసారి అమితాబ్‌లా బయటికొచ్చి చూడండి. తెలుగు సినిమాల్లో కొత్త చాప్టర్ ప్రారంభం కావచ్చు. చిరంజీవి సార్, ఇది మీకు అసాధ్యం కాదు.
జీఆర్ మహర్షి