ఏడుకొండలపై కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని నీడలో నివసిస్తున్న తిరుమల వాసుల కష్టాలు ఎట్టకేలకు తొలిగాయి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకుడు, ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇచ్చిన హామీలకు మోక్షం కలిగింది. ఇందుకు ఇవాళ తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ధర్మకర్తల మండలి సమావేశం వేదిక కావడం శుభపరిణామం.
ఇటీవల హైకోర్టు దిశానిర్దేశం ప్రకారం ప్రత్యేక ఆహ్వానితుడి హోదా దక్కించుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఈ సమావేశానికి మొదటిసారిగా హాజరయ్యారు. తిరుమల వాసుల సమస్యల పరిష్కారంలో ప్రధాన భూమిక పోషించారు. భూమన కరుణాకర్‌రెడ్డి చొరవ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేయూత, పాలక మండలి సభ్యుల ప్రోత్సాహం,ఈవో జవహర్‌రెడ్డి, అదనపు జేఈఓ ధర్మారెడ్డి సహకారం …వెరసి అందరి అండదడంలతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుమల వాసుల సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి.
కొండపై మాస్టర్ ప్లాన్‌లో భాగంగా బాలాజీనగర్‌లో 1070 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. వీరిలో కొందరు ఇళ్లను అమ్ముకున్నారు. అయితే టీటీడీ మొదట్లో ఎవరి పేరుతో కేటాయించిందో, ఇప్పటికీ వారి పేరుతోనే ఇంటిపై హక్కు ఉంది. కానీ పలువురి చేతులు మారడం, కాలం కొత్త వారసులను తీసుకొచ్చిన నేపథ్యంలో ఇళ్లపై హక్కుకు సంబంధించి కొన్ని డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇళ్ల కొనుగోలు లేదా వారసుల పేరుతో రాయించిన వారికే హక్కు కల్పించాలని భూమన కరుణాకరరెడ్డి దృష్టికి బాలాజీనగర్ వాసులు తీసుకెళ్లారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే… డిమాండ్‌ను నెరవేర్చుతానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తాజా పాలక మండలి సమావేశంలో టీటీడీ అద్భుత నిర్ణయం తీసుకుంది. కొన్న వాళ్లు, అలాగే కూతురు లేదా కొడుకు, వారి పిల్లల పేర్లపై హక్కు కల్పించేందుకు టీటీడీ అంగీకరించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో 900 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
ఇక రెండో విషయానికి వస్తే తిరుమలలో దుకాణదారులు, హ్యాకర్లకు సంబంధించి చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో ఎవరైనా దుకాణాలను అనధికారికంగా కొనుగోలు చేసి వుంటే వారి పేరు పైనే హక్కు కల్పించేందుకు టీటీడీ తీర్మానం చేయడం ద్వారా మరో హామీ నెరవేర్చినట్టైంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 1300 దుకాణ, హ్యాకర్ల యజమానులు లబ్ధి పొందనున్నారు.
ముచ్చటగా మూడో హామీ కూడా అమలుకు నోచుకుంది. తిరుమలలో టెండర్‌షాపులు దక్కించుకున్న వాటికి రెన్యువల్ చేయాలని పాలక మండలి తీర్మానం చేయడం విశేషం. 2014లో టెండర్ టైం పీరియడ్ అయిపోయిన వాళ్లకు కూడా సదవకాశాన్ని టీటీడీ కల్పించింది. టెండర్ షాపుల గడువు రెన్యువల్ చేయాలనే నిర్ణయంతో సుమారు 64 కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. ఇలా మూడు హామీలను నెరవేర్చడం ద్వారా 2,264 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
మరో తీర్మానం ద్వారా తిరుమల వాసులు కోర్టు చుట్టూ తిరిగే వ్యయ ప్రయాసలు పోయాయి. పైన పేర్కొన్న మూడు హామీలకు సంబంధించి లబ్ధి పొందాలంటే సక్సెసన్ సర్టిఫికెట్ పొందాల్సి వుంటుంది. ఇది కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే తిరుమల కొండకు సంబంధించిన వ్యవహారం కాబట్టి రెవెన్యూశాఖకు బదులుగా న్యాయస్థానం ద్వారా మాత్రమే సదరు సర్టిఫికెట్ తెచ్చుకుని వారసత్వ లేదా ఇతరత్రా లబ్ధి పొందే అవకాశం ఉండేది.
సక్సెసన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుంది. ఈ లోపు పుణ్యకాలం కాస్త కరిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన పాలక మండలి అద్భుత నిర్ణయం తీసుకుంది. సక్సెసన్ సర్టిఫికెట్‌తో పని లేకుండా తిరుపతి రెవెన్యూ అధికారుల నుంచి ఫ్యామిటీ సర్టిఫికెట్ తెచ్చుకుంటే సరిపోతుందని తీర్మానించి, తిరుమల వాసుల నెత్తిపై పాలుపోసింది.