తెరాస కి అతి పెద్ద గొయ్యి తీసిన కేటీఆర్

పదవి మత్తులో ఇష్టానుసారం మాట్లాడితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అసలు తెరాసాకి ఆంధ్ర రాజకీయలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆంధ్రలో లేదు..ఆంధ్రలో ఉన్న వైకాపా తెలంగాణాలో లేదు. పైగా రెండు పార్టీలకీ…

పదవి మత్తులో ఇష్టానుసారం మాట్లాడితే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అసలు తెరాసాకి ఆంధ్ర రాజకీయలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఆంధ్రలో లేదు..ఆంధ్రలో ఉన్న వైకాపా తెలంగాణాలో లేదు. పైగా రెండు పార్టీలకీ కామన్ శత్రువు తెదేపా. ఆ రకంగా వీరద్దరూ మిత్రులు కూడా. 

అదే లెక్కలో వైకాపా సోషల్ మీడియా 2018 ఎన్నికల టైములో తెరాసకి విపరీతమైన సపోర్ట్ చేసింది. 

నిజానికి తెరాస సోషల్ మీడియా చాలా వీక్. లోకల్ గా ఉన్న సంప్రదాయ మీడియాల్ని బెదరగొట్టి మెడలు వంచగలిగింది తప్ప తనకంటూ సోషల్ మీడియాని బిల్డ్ చేసుకోలేకపోయింది ఆ పార్టీ. 

అడక్కుండానే వైకాపా సోషల్ మీడియా తమ పార్టీకి చేయందించింది. ఆ కృతజ్ఞతని మరిచిపోయి ఆంధ్రప్రదేశ్ గురించి నెగటివ్ కామెంట్స్ చేసిన కేటీఆర్ పట్ల వైకాపా సోషల్ మీడియా యోధులు కత్తులు నూరుతున్నారు. అప్పుడే ట్రోలింగులు మొదలయ్యాయి. 

తెలంగాణాలో ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపే బలమైన మీడియా లేదు. నమస్తే తెలంగాణా, టీవీ9, 10 టీవీ, వి6 ఇలా అన్నీ అయితే సొంతానివి… లేకపోతే అస్మదీయులవి. 

ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇతర తెదేపా సానుభూతి చానల్స్ ఎప్పుడో తోకముడిచేసాయి కేసీయార్ భయానికి. వాళ్ల ఆస్తులన్నీ హైదరాబాదులోనే ఉండడంతో తమ జుట్టు కేసీయార్ చేతిలో ఉందని తెలుసుకుని వాళ్ల ప్రతాపాన్ని వైకాపా మీద మాత్రమే చూపిస్తూ మనుగడ సాగిస్తున్నారు. 

అలాగే బలమైన రాజకీయ ప్రత్యర్థి కూడా లేకపోవడం, ఉన్నా వాళ్ల గొంతుకని వినిపించే మీడియా లేకపోవడంతో తెలంగాణా ప్రజల్లో అగ్రభాగం అంతా బాగానే ఉంది కదా అనే ధోరణిలో ఉన్నారు. 

నిజానికి సొషల్ మీడియా అనేది వానర సైన్యం లాంటిది. ఇల్లు పీకి పందిరేయగల సామర్థ్యం సోషల్ మీడియా యోధులకుంది. తెరాసా పరిపాలనలో బొక్కలు వెతికి బయటపెట్టే పనంటూ పెట్టుకుని రంగంలోకి దిగితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండాకి చిరుగుపట్టొచ్చు. ఈ సోషల్ మీడియా ట్రోలింగుల్ని, వీడియోల్ని ప్రత్యర్థ భాజపా పూర్తిగా వాడుకొని ముందుకెళ్ళొచ్చు. అటువంటి పరిస్థితిని తెచ్చిపెట్టాడు తెలివైనవాడనకునే తెరాసా రాముడు. 

తనకు మద్దతిచ్చే సైన్యాన్ని ఉత్తిపుణ్యానికి దూరం చేసుకోవడమంటే ఏమనాలి? అది కూడా ఎన్నికలు ఏడాదిన్నరలో ఉండగా! ఈ డ్యామేజ్ ని ఊహించలేదు పాపం. శత్రువు కాకపోయినా పక్కింటి వాడిని కెలికితే చిరాకులే తప్ప సామరస్యం ఉండదు. 

అడ్రస్సున్న మీడియా సంస్థలపై యాక్షన్ తీసుకుని ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ దేశవిదేశాల్లో ఉన్న వైకాపా సోషల్ మీడియా శ్రేణుల్ని అరికట్టాలనుకోవడం అత్యాసే అవుతుంది. 

ఇదిలా ఉంటే తెలంగాణాలో రాయలసీమ రెడ్లు, వైకాపాని ఇష్టపడే మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు…ఇలా చాలామందే ఉన్నారు. తెదేపా మీద ఏహ్యభావంతో వారంతా తెరాసకే ఓట్లేసి గెలిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు తిరగబడితే పరిస్థితేంటి? 

గర్వాంధకారంలో మట్లాడే మాటలు ఒక్కోసారి అంధకారాన్నే మిగల్చవచ్చు. కేటీఆర్ బహుశా ఈ పరిస్థితి గమనించేనేమో రాత్రికి రాత్రి ట్విట్టర్లో సంజాయిషీ చెప్పుకున్నారు. కానీ ఇది సరిపోతుందా? మునుపట్లాగ వైసీపీ సోషల్ మీడియా తెరాసకి మద్దతివ్వాలంటే సాధ్యమేనా? ఏమో.

ప్రత్యర్థి ఎలా అయినా మాట్లాడతాడు. మిత్రుడో, తటస్థుడో మాట్లాడినప్పుడే సమస్య వస్తుంది. ఇప్పుడదే వచ్చింది. 

ఇన్నాళ్లూ నీ పక్షాన ఉన్న సోషల్ మీడియా వానరసైన్యాన్ని మచ్చిక చేసుకోవాలయ్యా కల్వకుంట్ల రామయ్యా! నీకు ఎన్నికల యుద్ధంలో కలిసొచ్చేది వాళ్లే. 

– శ్రీనివాసమూర్తి