మారాలి తివిక్రమ్.. మీరు మారాలి

తెలుగు సినిమా టాప్ ఫైవ్ డైరక్టర్లు ఎవరు? రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సుకుమార్, బోయపాటి శ్రీనివాస్. అంతే కదా? వీళ్లకు చాలా వరకు పరాజయాల పర్సంటేజ్ తక్కువ. అందునా ఫస్ట్ ముగ్గురికి…

తెలుగు సినిమా టాప్ ఫైవ్ డైరక్టర్లు ఎవరు? రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సుకుమార్, బోయపాటి శ్రీనివాస్. అంతే కదా? వీళ్లకు చాలా వరకు పరాజయాల పర్సంటేజ్ తక్కువ. అందునా ఫస్ట్ ముగ్గురికి అస్సలు ఇప్పటి వరకు పరాజయాలు లేవు. అయితే వీరిలో మిగిలిన నలుగురి శైలికి పూర్తిగా భిన్నమైన శైలి త్రివిక్రమ్ శ్రీనివాస్ ది.

దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో, ఇండస్ట్రీతో టచ్ లోనే వుంటారు. పబ్లిక్ ఫంక్షన్ లకు వస్తుంటారు. పది మందిని కాకున్నా, ఒకరిద్దర్ని అయినా గుర్తు పట్టి పలకరిస్తుంటారు. స్నేహితుల కోసం, తన వాళ్ల కోసం తన వంతు సాయం చేస్తుంటారు.

కొరటాల శివ తన పని తనదే కానీ, ట్విట్టర్ ద్వారా అందుబాటులోనే వుంటారు. ఇండస్ట్రీతో చాలా రకాల సంబంధాలు వున్నాయి ఆయనకు.

ఇక సుకుమార్. ఆయన కూడా అంతే. త్రివిక్రమ్ మాదిరిగా ఆయన కూడా ఎక్కువగా మాట్లాడరు కానీ, అవసరం అయినపుడు బయటకు రావడం, నలుగురితో కలిసి నడవడం అలవాటే.

ఇక బోయపాటి శ్రీనివాస్ పక్కా మాస్ మనిషి. ఆయన ఎవరితో కావాలంటే వారితో హాయిగా, సరదాగా కలిసిపోతారు.

త్రివిక్రమ్ వ్యవహారం వేరు. ఆయన తాను సిగ్గరి అని చెప్పుకుంటారు. అందుకే ఎవరితో ఎక్కువగా కలవలేనంటారు. సిగ్గరి తనం వేరు, నలుగురితో పరిచయాలు నిర్వహించుకోవడం వేరు. బాహుబలి లాంటి సినిమా తీసిన తరువాత, బాహుబలి 2లాంటి సినిమా టైమ్ లో కూడా రాజమౌళి వీలు చేసుకుని, మీడియాను కలిసి మాట్లాడారు. ప్రభాస్ మీడియాను స్వయంగా కలిసి ఇంటర్వూలు ఇచ్చారు. శ్రీమంతుడు టైమ్ లో మహేష్ బాబు, కొరటాల శివ మీడియాతో పూర్తిగా ఇంట్రాక్ట్ అయ్యారు.

150కోట్ల మార్కెట్ వున్న సినిమాకు ఒక్కటంటే ఒక్క మీడియా మీట్ లేదు అంటే ఏమనుకోవాలి? అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరక్టర్ తెలుగుకు పరిచయం అవుతున్నా ఓ చిన్న ఇంటరాక్షన్ లేదు. ఇదీ సినిమా అని త్రివిక్రమ్ చెప్పింది లేదు. ఎంత సేపూ తాను పవన్ నవ్వుకుంటూ, తుళ్లుకుంటూ, మాట్లాడుకుంటూ వున్న స్టిల్స్ విడుదల చేయడం? అసలు ఆ నవ్వులు ఎందుకు? జనాలను ఫూల్స్ ను చేసే సినిమా తీస్తున్నామని ఒకళ్లకి ఒకళ్లు చెప్పుకుని నవ్వుకోవడమా? తొలి సాంగ్ బిట్ వదిలినపుడు స్టార్ట్ అయింది త్రివిక్రమ్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే హంగామా. విడుదల నాటికి తారా స్థాయికి చేరుకుంది.

ఇక్కడ మీడియాతో ఇంట్రాక్ట్ కావడం ఒక్కటే సమస్య కాదు. త్రివిక్రమ్ తనకు తాను చాలా ఎత్తున వున్నాననుకుంటారు. తన వెనుక తన గురించి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారో ఆలోచించాలి. తను వస్తే ఆఫీసులో జనాలు లేచి నిల్చోవడం అన్నది గౌరవం కావచ్చు. కానీ ఆ టైమ్ కు అక్కడ వున్న మిగిలిన డైరక్టర్లు కూడా లేచి నిల్చోవడం ఏమిటి? ఈయనేమన్నా మీది నుంచి దిగివచ్చారా? భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు. వాడుకుని, పైకి వచ్చారు. అంతే. నిర్మాత చెప్పినా వినరు. మరెవరికి మాట మాత్రం ఇలా కాదు అలా చెప్పే అవకాశం వుండదు. అంతా పరమ నియంతృత్వ పోకడలు వుంటాయి త్రివిక్రమ్ వర్కింగ్ స్టయిల్ లో అని ఇండస్ట్రీలో గుసగుసలు ఎందుకు వ్యాపించాయి అన్నది ఆయన ఆలోచించుకోవాలి.

త్రివిక్రమ్ ఏకంగా ఫ్యాన్స్ ను మెప్పించడం కోసం కావచ్చు. లేదా మరెందుకైనా కావచ్చు. పవన్ ఏకంగా భగవంతుడిని చేసారు. అక్కడితో ఆగకుండా సినిమాలో కూడా అలాగే చూపించడం ప్రారంభించారు. అత్తారింటికి దారేదిలో మల్టీ మిలియనీర్ కాబట్టి నడచిపోయింది. అజ్ఞాతవాసిలో కూడా అలాంటి అతి పోకడలు చాలావున్నాయి.  అసలు విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోను కామియో రోల్ కు అడగడమే వింత. ఆయన పెద్ద మనసుతో ఒకె అన్నారు. చేసారు. డబ్బింగ్ చెప్పారు. తీరా చేసి ఎడిటింగ్ లో తీసి పక్కన పెట్టడమా? ఎంత అవమానం అది?

పవన్ కు సన్నిహితంగా వుండేవారిని ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వచ్చారు త్రివిక్రమ్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. ఇలాంటి గుసగుస మరే డైరక్టర్ కు హీరోకు మధ్య లేవు కదా? పవన్ కు రాజకీయ ఉపన్యాసాలు రాసిస్తారని, పవన్ వెనుక ప్రాప్టింగ్ ఆయనే అని గుసగుసలు వున్నాయి. సినిమాలో అన్యాపదేశంగా జగన్ పై డైలాగులు అవసరమా? ఎందుకు తాను ఒక వైపు అలా ఒరిగిపోవడం?

ఇవన్నీ ఎందుకోసం? ఒక మంచి మాటల రచయిత, ఓ మంచి దర్శకుడు త్రివిక్రమ్. వేలాదిగా కాదు, లక్షలాదిగా అభిమానులు వున్నారు ఆయనకు. ఒక్క సినిమాతో ఏమీ అయిపోలేదు. ఆకాశం బద్దలై నేలకూలిపోలేదు. కానీ త్రివిక్రమ్ మారాలి. అక్కర్లేని వ్యవహారాలు అన్నీ ఆయన పక్కన పడేయాలి. మళ్లీ తనలోని రచయితకు మాత్రమే పని చెప్పాలి. అక్కర్లేని భేషజాలు వదిలేయాలి. ఇండస్ట్రీతో తాను అనుకోవాలి. తనతో ఇండస్ట్రీ కాదు.

కచ్చితంగా యూ ట్యూబ్ ను షేక్ చేసేయగల వన్ లైనర్లు, పంచ్ లైన్లు ఎన్నయినా వస్తాయి ఆయన కలం నుంచి. అలా రావాలంటే ముందుగా త్రివిక్రమ్ మారాలి. ఆయన తన చుట్టూ కట్టుకున్న కోట నుంచి బయటకు రావాలి. జనంలోకి రావాలి. జనంతో వుండాలి. సిగ్గు అన్నది ఆయన చెబుతున్న సాకు మాత్రమే. తాను మేధావిని, వీళ్లందరికన్నా అతీతుడను అని ఆయన అనుకుంటున్నారేమో? అని జనం సాకుగా భావిస్తున్నారు. ఆ విషయం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ సినిమా తీసే వరకు ఆయనది. తీసిన తరువాత జనాలది.