పవన్ కళ్యాణ్-కింకర్తవ్యమ్?

పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్. నిజంగానే పవర్ తో కలిసి పయనిస్తున్న స్టార్. ఆయనకు వున్న ఫ్యాన్స్ పవర్ అంతా ఇంతాకాదు. టాలీవుడ్ లో అపరమితమైన ఫ్యాన్స్ కలిగిన హీరో. ఏ సినిమా…

పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్. నిజంగానే పవర్ తో కలిసి పయనిస్తున్న స్టార్. ఆయనకు వున్న ఫ్యాన్స్ పవర్ అంతా ఇంతాకాదు. టాలీవుడ్ లో అపరమితమైన ఫ్యాన్స్ కలిగిన హీరో. ఏ సినిమా ఫంక్షన్ అయినా, ఏ హీరో సినిమా ఫంక్షన్ అయినా పవర్ స్టార్ అని నానా గత్తర చేయగలిగిన సేనకు నాయకుడు. ఇన్నాళ్లు ఆయన సినిమా  విడుదలయితే, ఫ్లాప్ అయినా కూడా అరవై డెభై కోట్లు తేగలడు అని ఇండస్ట్రీలో ఒక భరోసా. దానికి కారణం ఆయనకు వున్న అపరిమితమైన క్రేజ్ అని టాక్. పైగా పవన్ వెనుక వున్న ఆ బలాన్ని చూసే, చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడు కూడా పవన్ మాటలకు మడుగులొత్తుతూ వస్తున్నారు.

నిజానికి పవన్ కు తెలుసో, తెలియదో కానీ వాస్తవం ఒకటి వుంది. ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దుతుగా వున్నంతకాలమే ఈ పాజిటివ్ ట్రెండ్ అలా వుంటుంది. ఒక్కసారి కాస్త దూరంగా జరిగిన సూచనలు కనిపిస్తే చాలు, మీడియాలో అనుకూల ధోరణి అంతా క్షణాల్లో మాయమైపోతుంది. గడచిన మూడేళ్లలో ఇలాంటి పరిస్థితి ఒకటి రెండు సార్లు వచ్చి, తృటిలో తప్పిపోయింది. అప్పటి నుంచి మళ్లీ ఆ తరహా సిట్యువేషన్ రాకుండా పవన్ జాగ్రత్త పడుతూ వచ్చారు.

మరోపక్క పవన్ కు మరో ప్లస్ పాయింట్ వుంది. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు చాలా బలంగా వుంటారు. పవన్ వ్యతిరేక వార్తలను వాళ్లు చీల్చి చెండాడుతారు. ఏ ఓటింగ్ అయినా పవన్ ప్రమేయం వుంటే అది ఆయనకు అనుకూలంగా వుండాల్సిందే.

కత్తి మహేష్ ఇస్యూ అంత చెలరేగడానికి కారణం పవన్ సోషల్ మీడియా సైన్యం కూడా ఓ కారణం. వాళ్లు కనుక కత్తి మహేష్ ను సోషల్ మీడియాలో అంతలా వెంటాడకుండా వుండి వుంటే, అతను అంత పాపులర్ అయ్యేవాడు కాదు. ఏ స్పందనా లేక, నాలుగు అయిదు ట్వీట్ లు చేసి అలిసిపోయేవాడు. కానీ అతన్ని తిట్టి, తిట్టి రెచ్చగొట్టిన ప్రతిభ అంతా పవన్ సోషల్ మీడియా సైన్యందే. 

అజ్ఞాతవాసి ఏం చెబుతోంది?

ఇంత బలమైన అభిమానులు, ఇంతటి బలమైన సోషల్ మీడియా సైన్యం కూడా అజ్ఞాతవాసి సినిమాను కాపాడలేకపోయాయి. సరే అభిమానులు తొలి రోజు విరగబడి చూడడం వల్లనే 28కోట్లకు పైగా వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ నిజం కాదని క్లియర్ గా ఇండస్ట్రీ జనాలకు తెలుసు. ఎందుకంటే ఈ 28కోట్లలో ఫిక్స్ డ్ హైర్ లు, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయన్న సంగతి తెలిసిందే.

అంటే టోటల్ గా, అచ్చంగా పవన్ ఫ్యాన్స్ తొలి రోజు పూర్తిగా చూస్తే వచ్చింది మహా అయితే 18కోట్ల మేరకు మాత్రమే వుంటుంది. పూర్తిగా అని ఎందుకు అనడం అంటే సినిమా హాళ్లకు గేట్లు తీసేసి, 24గంటలు నడపుకోమని ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల ఫ్యాన్స్ సినిమాను తొలి రోజు మిస్ అయ్యే సమస్య లేదు. అడుగు బొడుగు వున్న ఫ్యాన్స్ కూడా తొలి రోజే చూసేసారు. ఫ్యాన్స్ బ్యాలన్స్ లేరు అనడానికి మరో ఉదాహరణ, రెండో రోజు వచ్చిన అడుగు బొడుగు కలెక్షన్లు.

జస్ట్ రెండు కోట్లకు కాస్త అటు ఇటుగా. 

అంటే పవన్ మీద ప్రేమతో పవన్ ఫ్యాన్స్ అంతా సినిమా చూస్తే వచ్చేది 20కోట్ల రేంజ్ అని క్లియర్ అయిపోయింది. అంటే ఇన్నాళ్లు అనుకున్న అరవై డెభై కోట్లు మినిమమ్ గ్యారంటీ అన్నది గాలి బుడగ అని తేలిపోయింది. సినిమా బాగుంటే, అప్పుడు మిగిలిన వాళ్లు తరలి వస్తే, ఎంతయినా వస్తుంది, ఎన్ని కోట్లు అయినా వస్తాయి. కానీ అలాంటి సినిమా పవన్ నుంచి వచ్చి ఎన్నాళ్లయింది.

అత్తారింటికి దారేదికి ముందు నాలుగు డిజాస్టర్లు వున్నాయి. అత్తారింటికి దారేది తరువాత మూడు ఫ్లాపులు పలకరించాయి. ఆ మాటకు వస్తే ఖుషీ తరువాత వచ్చిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు అన్నీ కూడా గొప్ప సినిమాలుగా మిగలలేదు. జల్సా వచ్చిన తురువాత చాన్నాళ్లకు కానీ హిట్ పలకరించలేదు.

అయితే పవన్ లో వున్న గొప్పదనం ఏమిటంటే ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా మళ్లీ సినిమా వచ్చేసరికి ఫ్యాన్స్ సినిమా హాళ్ల దగ్గర బారులు తీరుతారు. ఆ మాటకు వస్తే ఇదే టైపు ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ కు వుంది బాలయ్యకు వుంది. కానీ ఏ రేంజ్ అన్నదే తేడా. ఇప్పుడు పవన్ రేంజ్ కూడా కిందకు జారిపోయింది.

ఇప్పుడేంటీ?

పవన్ ను హ్యాండిల్ చేయడం అన్నది డైరక్టర్లకు కాని పని. ఎందుకంటే ఆయనకు నచ్చిన స్క్రిప్ట్, ఆయనకు నచ్చిన స్టయిల్ లో, ఆయనకు నచ్చినపుడు, ఆయనకు నచ్చిన విధంగా తీయాలి. అది కూడా ఆయనను ఆయనే డైరక్ట్ చేసుకుంటారు. మిగిలిన వాళ్లును మాత్రమే డైరక్టర్ చూసుకోవాలి. ఒక్క త్రివిక్రమ్ దగ్గరే కాస్త బెటర్. అయినా అక్కడ కూడా ఆయన వచ్చినపుడు, ఆయన ఓకె అన్నపుడే షూట్. అలాగే చేసుకుంటూ వచ్చారు అజ్ఞాతవాసి సినిమాను.

మరి ఇప్పుడు ఎవరు సూట్ అవుతారు పవన్ వర్కింగ్ స్టయిల్ కు. బాబీని చూసేసారు. సంపత్ నంది మధ్యలోనే తప్పుకున్నాడు. త్రివిక్రమ్ ఫెయిలయ్యారు. ప్రస్తుతానికి సంతోష్ శ్రీనివాస్ ఓ రీమేక్ స్క్రిప్ట్ పట్టుకుని రెడీగా వున్నారు. ఏళ్ల క్రితం అడ్వాన్స్ చేతిలో పెట్టి మైత్రీ మూవీస్ రెడీగా వుంది.

కానీ మైత్రీ మూవీస్ కావచ్చు, సంతోష్ శ్రీనివాస్ కావచ్చు, పవన్ తో ఈ ఊపుతాపులు అన్నీ పడగలరా? అంత భయం ఎందుకు అని ఎవరైనా అడొగొచ్చు. ఎన్ని సమస్యలు వుంటాయో పవన్ తో సినిమా చేసిన యూనిట్లకు తెలుస్తుంది. పైగా పవన్ ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా కాలు పెట్టారు. ఎప్పుడు దేనికి స్పందిచాల్సి వస్తుందో, ఎప్పుడు చటుక్కున బయల్దేరి వెళ్లాల్సి వస్తుందో తెలియదు. దాంతో షూట్ అంత సజావుగా సాగుతుందన్న నమ్మకం లేదు.

అదీ కాక, పవన్ రెమ్యూనిరేషన్, అతని రేంజ్ కు తగిన స్టార్ కాస్ట్ ఇవన్నీ కలిపి సినిమా నిర్మాణానికి కనీసం ఎనభై కోట్ల మేరకు చేరుస్తాయి. ఇప్పుటి పవన్ మార్కెట్ రీత్యా అదేమంత అధికం కాదు. కానీ సినిమా తేడా కొడితేనే సమస్య. పవన్ ట్రాక్ రికార్డు ప్రకారం హిట్ అయిన సినిమాల కన్నా తేడా కొట్టిన సినిమాలే ఎక్కువ. అందుకే ఇప్పుడు మైత్రీమూవీస్ ఒకటే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడితో కలిసి తయారుచేయించిన స్క్రిప్ట్ ను ఎకాఎకి రెండు నెలలు లేదా కనీసం 50కాల్షీట్లు ఇస్తే, సినిమా చేయాలని, లేదంటే కష్టమని అనుకుంటున్నట్లు వినికిడి. అయితే ఇలా కండిషన్లకు లొంగడం అన్నది పవన్ మెంటాటిలీకి సూటయ్యే వ్యవహారం కాదు. 

అసలు ఏం జరిగింది?

ఇపుడు పవన్ క్యాంప్ లో ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇన్నాళ్లు పైకి అనకపోయినా, 'మా వాళ్లు' చూస్తే చాలు మా సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోతాయి అన్నది ధీమా మెగా క్యాంప్ లో వుండేది. వాళ్ల రాజకీయ ప్రవేశం వెనుక అదే ధీమా. చంద్రబాబు పవన్ కు రెడ్ కార్పెట్ పరవడం వెనుక అదే వ్యవహరం. అలాంటిది తిప్పితిప్పి కొడితే గట్టిగా ఇరవై కోట్లు షేర్ రాకపోవడమా? ముచ్చటగా మూడో రోజు రెండు కోట్లు కూడా రాకపోవడమా? చిన్న, మీడియం హీరోల సినిమాలకు వస్తున్నాయి కదా? 

మరో పక్క ఈసారి కొన్ని కమ్యూనిటీలు పవన్ సినిమా విషయంలో కినుక వహించినట్లు వార్తలు వినవచ్చాయి. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు పవన్ తొలిసారిగా వైఎస్ జగన్ పై నేరుగా విమర్శలుచేసారు. అలాగే కత్తి మహేష్ మీద పవన్ ఫ్యాన్స్ తిట్ల దాడికి దిగారు. అమెరికాలాంటి చోట్ల కూడా వైకాపా సానుభూతి పరులు అజ్ఞాతవాసి చూడకూడదని ముందుగానే వాట్సప్ ప్రచారం సాగినట్లు వార్తలు వున్నాయి. ఇవన్నీ నిజంగా జరిగి ఎఫెక్ట్ చూపించినట్లయితే, మరి రాజకీయంగా మందుకు వెళ్తే పరిస్థితి ఏమిటి?

2019దగ్గర చేసి పరిస్థితులు చూసి, బాబుతో దూరంగా జరగాలన్న ఒక ఆలోచన అయితే జనసేన లో వుండేది అన్నది వాస్తవం. ఇప్పుడు ఆ ఆలోచనకు మూలమైన బలం సమూలంగా మాయమైనట్లు కనిపిస్తోంది. అసలు ఎన్నికల ముందు మరో సినిమా చేయడమా? మానడమా? చేస్తే ఎలా వుంటుంది. చేసి అది కూడా ఫ్లాప్ అయితే ఎన్నికల ముందు ఘోరంగా వుంటుంది. అలా అని చేయకపోతే మధ్యలో జారిపోయినట్లు వుంటుంది.