ఒక్కోసారి చెప్పలేం తాబేలు గెలుస్తుంటుంది. ఈసారి సంక్రాంతి బరిలోకి లీస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ తో దిగిన సినిమా జైసింహా. ఈ సినిమా గొప్పగా వుంటుందని కానీ, అద్భుతాలు చేస్తుందని కానీ ఎవ్వరూ అనుకోలేదు. పైగా కెఎస్ రవికుమార్ కాస్త అవుట్ డేట్ అయ్యారు అన్న ప్రచారం వుంది. ఇలాంటి నేపథ్యంలో విడుదలయిన జై సింహా అనుకున్నట్లుగానే విమర్శకులు పెదవి విరిచేలా వుంది. పక్కా పాతచింతకాయ పచ్చడిలా వుంది.
కానీ, కమర్షియల్ సినిమా, అది కూడా బి సి సెంటర్ల ప్రేక్షకులకు నప్పే మీటర్ మీద నడిచే సినిమాలా వుంది. అన్నింటికి మించి అజ్ఞాతవాసి అస్సలు అర్థం కాలేదన్నది బి సి సెంటర్ల ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి టైమ్ లో పక్కా రెగ్యులర్ ఫార్మాట్ లో జై సింహా వచ్చింది.
ఒకటి రెండు పాటలు, ఫైట్లు, బాలయ్య డైలాగులు ఇవి చాలు పండగపూట బాలయ్య ఫ్యాన్స్ కు. అవి పక్కాగా సరిపోయాయి. పైగా అసలు ఏమీ వుండదనుకున్న సినిమా ఈ మాత్రం వుండేసరికి బి సి సెంటర్లలో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఎ సెంటర్లలో లేకున్నా, బిసి సెంటర్లలో పండగ మూడు రోజులకు ఇదే మెయిన్ సినిమాగా వుంటుంది.
గ్యాంగ్ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ, థియేటర్లు సరిగ్గా పడలేదు. మౌత్ టాక్ ను బట్టి ముందుకు వెళ్లాలి అన్నా దగ్గర్లో థియేటర్లు వుండాలి. అజ్ఞాతవాసిని పది రోజుల పాటు థియేటర్లలోంచి తీయరు. మళ్లీ గురువారం వరకు అగ్రిమెంట్ లు వుంటాయి. కావాలంటే కొన్ని షో లు మాత్రం గ్యాంగ్ కు దొరికే అవకాశం వుంది. జై సింహాకు ముందుగా కొన్ని థియేటర్లు దొరికాయి. ఎప్పుడైతే బి సి సెంటర్లలో ఫరవాలేదు అనే టాక్ వచ్చిందో, అజ్ఞాతవాసి స్క్రీన్లలో కొన్ని షో లు ఇటు మళ్లే అవకాశం వుంది.
జై సింహాను అమ్మలేదు. అడ్వాన్స్ లు కూడా అంతగా లేవు. కేవలం అగ్రిమెంట్ల మీద ఇచ్చారు. అందువల్ల తొలి రోజు మంచి షేర్ నమోదు చేసినట్లే అనుకోవాలి. శని, ఆది, సోమ, మంగళ కూడా అన్ని సినిమాలకు మంచి కలెక్షన్లే వుంటాయి. సో జై సింహా వరుసగా అయిదు రోజులు ఫుల్స్ చూస్తుంది బి సి సెంటర్లలో. ఆ విధంగా యూనిట్ పిచ్చ హ్యాపీ.