మధ్యలో ఈ సైకిల్ గోల ఏంది అజ్ఞాతవాసి?

అంత తెలియకుండా అలాంటి డైలాగులు పెట్టి ఉంటారు, అని అనుకోవడానికి లేదు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయిన పవన్ కల్యాణ్ సినిమాలో అంత విరివిగా మరో రాజకీయ పార్టీ గుర్తు గురించి ప్రస్తావన…

అంత తెలియకుండా అలాంటి డైలాగులు పెట్టి ఉంటారు, అని అనుకోవడానికి లేదు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయిన పవన్ కల్యాణ్ సినిమాలో అంత విరివిగా మరో రాజకీయ పార్టీ గుర్తు గురించి ప్రస్తావన రావడం విశేషమే. అదంతా ఏదో కాకతాళీయకంగా, సీన్ కోసం జరిగిందే అని అనుకుంటే అంతకన్నా అమాయకత్వమూ లేదు.

కావాలనే అజ్ఞాతవాసి సినిమాలో ‘సైకిల్’ ప్రస్తావన తీవ్రంగా చేశారని స్పష్టం అవుతోంది. మరి ఏ లక్ష్యంతో ఆ సీన్లను పెట్టారో కానీ.. అవి కాస్తా అసలు లక్ష్యాన్నీ చేరక, మరోవైపు ఎంటర్ టైన్ మెంట్ నూ అందించ లేదు. పనిలో పనిగా జనసేన అభిమానులు కూడా ఊసురుమన్నారు ఆ సీన్లను చూసి! పవన్ కల్యాణ్ ఉద్యోగిగా గాక తన తండ్రికి వారసుడిగా ఆఫీసులోకి అడుగుపెట్టాకా.. ‘సైకిల్’తో కొన్ని కలగాపులగం సీన్లు ఉంటాయి.

పవన్ కల్యాణ్ సైకిలెక్కేసి ఆఫీసంతా తిరుగుతూ కమేడియన్ మురళీశర్మను భయపెడతాడు. ఈ సందర్భంగా ‘సైకిల్’పై పవన్ కల్యాణ్ మమకారాన్ని అంతా చూపించాడు త్రివిక్రమ్. ‘నాకు చిన్నప్పటి నుంచి సైకిలంటే ఇష్టం.. సైకిల్ అంటే ప్రాణం..’ అంటూ ఏవేవో డైలాగులు చెబుతాడు పవన్ కల్యాణ్. ఇక్కడ ‘సైకిల్’ ద్వంద్వార్థానికి దారి తీస్తోందని వేరే చెప్పనక్కర్లేదు.

ఈ సైకిల్ పై మోజును చాటడం ద్వారా.. తెలుగుదేశం పార్టీపై కూడా పవన్ ఈ సీన్ ద్వారా చాటాడేమో అని అనుకోవాల్సి వస్తోంది. ఒకవేళ ఏ బాలయ్య సినిమాలోనో ఇలాంటి డైలాగులు ఉండుంటే అదో లెక్క. కానీ.. సొంతం రాజకీయ పార్టీని కలిగి ఉండి, తన సినిమాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీపై పవన్ కల్యాణ్ మమకారాన్ని చాటుకోవడమే అయ్యింది ఈ సీన్లతో.

బయట చేస్తున్నదే కాకుండా.. సినిమాలో కూడా పవన్ ఇలా సైకిల్.. సైకిల్.. అంటూ హంగామా చేయడం విశేషం. ఇది నిఖార్సైన జనసేన అభిమానులను కూడా కాస్త నిరాశ పరిచే అంశమే. ఏదో చంద్రబాబుకు మద్దతు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ.. మరీ ఇంత కంగాళీ చేసుకోవడం అవసరమా? అనేదే సందేహం!