మన తెలుగు వాళ్లకు పొరుగింటి పుల్లకూర రుచేమో కానీ తమిళ జనాలకు కాదు. అందునా మన సినిమా జనాల్లో కట్టుబాటు కలికంలోకి కూడాలేదు. కానీ తమిళ నాట అలా కాదు. వాళ్ల సినిమాల తరువాతే ఏదయినా. ఏమయినా? ఆ మధ్య మన దగ్గర కూడా కాస్త హడావుడి చేసారు. పండుగ రోజుల్లో పక్క భాష సినిమాలు వద్దు అని. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియదు. అంతా సైలెంట్.
అయితే మన దగ్గర థియేటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. అందువల్ల మూడు నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలయినా, ఫరవాలేదు. కనీసంలో కనీసం రెండువందలకు పైగా థియేటర్లు దొరికేస్తాయి. పైగా థియేటర్లు ఇవ్వము అని మనవాళ్లు అనరు.
కానీ తమిళనాట అలా కాదు. వాళ్ల సినిమా తరువాతే ఏదయినా. ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాకు అదే ఇబ్బందిగా మారుతోంది. 10వ తేదీన అజ్ఞాతవాసి తమిళనాట కూడా విడుదలవుతోంది. రెండు రోజుల పాటు తమిళనాట అంతా సుమారు వంద నుంచి నూట పాతిక స్క్రీన్ లు ఇస్తున్నారు. కానీ 12న సూర్య గాంగ్ విడుదలవుతోంది. అలాగే మరో సినిమా కూడా విడుదలవుతోంది.
అంతే, ఇక చెన్నయ్ అంతా మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ లలోంచి అజ్ఞాతవాసిని లేపేస్తారట. ఒక్కటంటే ఒక్కటి మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ లు అజ్ఞాతవాసికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసారట. దాంతో తమిళనాడులో విడుదలకు అజ్ఞాతవాసిని కొన్న బయ్యర్ కు ఏం చేయాలో తోచడం లేదు. మనం చూస్తే తమిళ సినిమాలను నెత్తిన పెట్టుకుంటాం. వాళ్లు చూస్తే, మన సినిమాలను పక్కన పెడుతున్నారు.
మన చాంబర్ లు, మండలిలు, నిర్మాతలు అందరూ ముఫై మూడు గ్రూపులు. ఓ యూనిటీ లేదు, పాడు లేదు. ఇదే కనుక అక్కడ అజ్ఞాతవాసికి స్క్రీన్ లు ఇవ్వకుంటే ఇక్కడ తమిళ సినిమాలు ఆడనివ్వం అని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఓ తాటి మీదకు వస్తే… సీన్ మొత్తం మారిపోతుంది.