నాగార్జున, నాని కాంబినేషన్ లో రాబోతున్న మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో వీళ్లిద్దరి పాత్రలు బయటకొచ్చాయి. డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన ఈ కథలో నాగార్జున మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తాడట. అదే టైమ్ లో నాని ఓ డాక్టర్ గా కనిపిస్తాడట. వీళ్లిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకుంటారు, ఒకరికొకరు ఏమౌతారనేది ఈ మల్టీస్టారర్ స్టోరీ అంటూ పుకార్లు వస్తున్నాయి.
తన సినిమాల్లో కథ కంటే స్క్రీన్ ప్లేకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఈ దర్శకుడు. గతంలో తీసిన భలే మంచి రోజు, శమంతకమణి సినిమాల్లో ఇది కనిపిస్తుంది. తాజా మల్టీస్టారర్ కూడా అదే విధంగా ఉంటుందట. దీనికి తోడు నాని, నాగార్జున మధ్య పుష్కలంగా కామెడీ పండుతుందట. నిజానికి ఈ కామెడీ ఎలిమెంట్స్ వల్లనే ఈ ఇద్దరు హీరోలు మూవీ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
స్టోరీలైన్ వరకు ఓకే. కానీ శ్రీరామ్ ఆదిత్య ఇప్పటివరకు ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. ఆ స్క్రీన్ ప్లే విన్న తర్వాత నాగార్జున, నాని వాళ్ల అభిప్రాయాలు చెబుతారు. హీరోల సూచనలు ఆధారంగా స్క్రీన్ ప్లేలో మళ్లీ మార్పుచేర్పులు ఉంటాయి. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఈ లోగా మహానటి ప్రాజెక్టును పూర్తిచేస్తాడు నిర్మాత అశ్వనీదత్. ఆ మూవీ రిలీజైన తర్వాత మల్టీస్టారర్ ప్రాజెక్టుపై మరింత క్లారిటీ వస్తుంది.