అవును. ఈ నంబర్ పెద్దదే. ఇంకా చెప్పాలంటే కళ్ళు చెదిరే నంబరే. ఇప్పటిదాకా ఇంత పెద్ద నంబర్ లో అస్తులను పంచిన చరిత్ర లేదు. అది కూడా ఒకేసారి పంచడం అన్నది లేదు. అందుకే మా జగన్ కాబట్టే ఇంతలా చేశారు అని వైసీపీ నేతలు తెగ మురిసిపోతున్నారు.
ఇంతకీ జరిగింది ఏంటంటే ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లా సబ్బరవానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ అక్షరాలా రెండు లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ళ స్థలాల పట్టాలను ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఇలా సెంటు నుంచి సెంటున్నర దాకా ఇళ్ళ పట్టాలు లభించాయి.
వీటి లెక్క ప్రస్తుత మార్కెట్ ప్రకారం చూస్తే అక్కడ సెంట్ భూమి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ఉంది. దాంతో ఎలా చూసుకున్నా పది లక్షల రూపాయలు ఇప్పటికిపుడు ఒక్కో లబ్దిదారుడికి ఆస్తిగా జగన్ ఇచ్చినట్లే అంటున్నారు. రేపటి రోజున ఆ స్థలాలలో ఇళ్ళు కట్టిస్తే కచ్చితంగా ఆ విలువ మరింత పెరుగుతుంది.
మొత్తానికి చూస్తే ఈ విలువ చాలా ఎక్కువని స్వాతత్రం లభించిన తరువాత ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని వైసీపీ నేతలు చెబుతున్నారు. పైగా నగరానికి దగ్గరలలో ఖరీదైన భూములనే పట్టాలుగా చేసి ఇవ్వడంతో రానున్న ఏళ్ళల్లో ప్రతీ పేదవాడు పావు కోటీశ్వరుడు కావడం ఖాయమని కూడా రియల్ ఎస్టేట్ లెక్కలు చెబుతున్నాయి.
మొత్తానికి జగన్ ఒకే దెబ్బకు పది వేల కోట్ల ఆస్తిని పంచి వెళ్లారని, ఇది తమ ఘనతని వైసీపీ నేతలు చెప్పుకోవడంలో తప్పేముంది.