ఆచార్య విడుదలకు ముందు నుంచీ, విడుదల అయిన క్షణం నుంచి దర్శకుడు కొరటాల శివ టార్గెట్ అవుతున్నారు. అది కూడా మామూలుగా కాదు. చాలా అంటే చాలా బలంగా. కేవలం సినిమా బాగాలేకపోవడం మాత్రమే దీనికి కారణమా? ఇంకేమైనా వుందా? ఇలా ప్రశ్నించుకుంటే ఇండస్ట్రీలో కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి.
ఓ బడా డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాతతో కొరటాల శివకు పొసగక పోవడం వల్లనే ఈ నెగిటివిటీని ఓ రేంజ్ కు మించి స్ప్రెడ్ చేసారని, అది సినిమా మీద కూడా నెగిటివ్ పబ్లిసిటీగా మారిందని వినిపిస్తోంది. భరత్ అనే నేను సినిమా విషయంలో ఆ డిస్ట్రిబ్యూటర్ కు కొరటాలకు మధ్య వివాదం నెలకొంది. కొంత అమౌంట్ వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఎవరు ఇవ్వాలి? నిర్మాత దానయ్యనా? లేక ఏరియా ను తన అక్కౌంట్ లోకి తీసుకున్న కొరటాల నా అన్న మీమాంస వచ్చింది.
దాంతో ఆచార్య సినిమా విషయంలో కొరటాల పట్టుపట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ కు హక్కులు ఇవ్వకుండా చేసారు. వేరే వ్యక్తికి హక్కులు ఇప్పించారు. దాంతో తెరవెనుక వివాదం మరింత ముదిరింది. సినిమాకు ఆది నుంచే నెగిటివ్ ప్రచారం రావడం వెనుక ఆ వర్గాలు వున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీనికి తోడు సినిమా కూడా తేడా కొట్టడంతో తెల్లవారుఝాము నుంచే నెగిటివ్ ప్రచారం మరింత ఊపు అందుకుంది. కొరటాలనే పర్సనల్ గా టార్గెట్ చేయడం షురూ అయింది.
అజ్ఞాత వాసి ఫెయిల్యూర్ టైమ్ లో ఏం జరిగిందో బయటకు రానివ్వలేదు. సెటిల్ మెంట్ లు జరిగాయనే తప్ప మరేం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఆచార్య సినిమా కోసం సుమారు 16 కోట్ల మేరకు కొరటాల హామీ సంతకాలు పెట్టాల్సి వచ్చిందని రాత్రికి రాత్రే ఇండస్ట్రీ వర్గాలు బయటకు స్ప్రెడ్ చేసేసాయి.
నిజానికి ఇది రిస్క్ కాదు. అమెజాన్ నుంచి 35 కోట్ల మేరకు మొత్తాలు రావాల్సి వుంది. కొరటాల పనై పోయింది, మొత్తం మునిగిపోయారు అనే ప్రచారం రాత్రికి రాత్రి బయటకు రావడం వెనుక కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు వున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుంటే ఫ్యాన్స్ రాజకీయాలు కూడా దీనికి తోడయ్యాయి. ఆర్ఆర్ఆర్ విషయంలో మెగా ఫ్యాన్స్ హడావుడి ఎక్కువ అయింది. ఎన్టీఆర్ కన్నా చరణ్ కే పేరు వచ్చిందని తెగ హడావుడి చేసారు. దానికి ఇప్పుడు బదులు తీర్చుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే సిఎమ్ లతో డీల్ చేసే విషయంలో బాలయ్యకు చిరంజీవికి ఐడియాలజీ తేడాలు వున్నాయి. అఖండ సినిమాను ఆచార్యను కంపార్ చేస్తూ కూడా హడావుడి మొదలయింది.
ఇదిలా వుంచితే మెగా ఫ్యాన్స్ బన్నీ..పవన్..చరణ్ ఫ్యాన్స్ గా చీలిపోయారు. మెగా ఫ్యాన్స్ అన్నది నిన్నటి మాటగా మారిపోయంది. దాని వల్ల యాంటీ ఫ్యాన్స్ లేదా యాంటీ ప్రచారాన్ని తిప్పికొట్టేంత వ్యవహారం కనిపించలేదు.