తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేనొకటంటా.. అన్నదిట వెనకటికి ఓ సహధర్మచారిణి. మాట అంటే పడేది లేదని.. చాలా మంది చాలా సందర్భాల్లో నిరూపిస్తూనే ఉంటారు. కొన్ని రంగాల్లో పైపైన చక్కెరపూతలు పూస్తారు. రాజకీయాల్లో అలా ఉండదు. ఒక మాట అంటే.. దానికి పది రెట్లుగా తిరిగి అనితీరాల్సిందే. అయితే.. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల మధ్య! ఒకరికొకరు సంబంధమే లేని రాజకీయాలు నడుపుతూ వేర్వేరు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న వారి మధ్య ఇలాంటి తగాదాలు అరుదు! అలాంటి వాటి బారిన పడిన కేటీఆర్ పాపం నాలుక కరచుకోవాల్సి వచ్చింది.
ఏపీ రాష్ట్రాన్ని, అక్కడి పాలనను తక్కువ చేసి మాట్లాడినందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ గంటల వ్యవధిలో దిద్దుబాటు ప్రయత్నం చేశారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనేది ఇక్కడ ఆయనకు సరిపోతుంది. తనకు తగని మాటలు మాట్లాడడం ఎందుకు? తిరిగి నొచ్చుకునే ట్వీట్లు ఎందుకు? సారీ చెప్పకపోయినా.. ఆయన అంత పనీచేశారు. కాకపోతే.. కామెంట్‌కు, ట్వీట్‌కు మధ్య చాలానే జరిగింది.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా దళాలు మొత్తం చెలరేగిపోయాయి. కేటీఆర్‌ను విపరీతంగా ట్రోల్ చేయడం ఆరంభించారు. తనకు సంబంధంలేని వ్యవహారంలో వేలు పెట్టడం మాత్రమే కాకుండా.. జగన్మోహన్ రెడ్డి పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించినందుకు ఆ పార్టీ సోషల్ మీడియా సైనికులు రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముసుగులో ఎన్ని లొసుగులు ఉన్నాయో.. ఉతికి ఆరేశారు. ఏపీ మంత్రులు, ప్రభుత్వ పెద్దలు కేటీఆర్ మాటలను ఖండించడం ఒక ఎత్తు.. అదంతా మర్యాదస్తుల వ్యవహారంలాగా సాగిపోయింది,. కానీ.. కేటీఆర్ తీరును సోషల్ మీడియా ఒక రేంజిలో ఉతికి ఆరేసింది.
కేటీఆర్ హైదరాబాదులో నిత్యం ఏపీకి చెందిన కొన్ని కులాల ప్రముఖులతోనే తిరుగుతుంటారనే ఒక వాదన ఉంది. ఇటీవలి ఏపీ మంత్రి వర్గ విస్తరణలో నామమాత్రపు అవకాశం కూడా దక్కని.. ఒకటి రెండు అగ్ర కులాల వ్యాపారులతోనే కేటీఆర్ ఎక్కువగా మెలగుతుంటారనేది ఒక వాదన. వాళ్లంతా సహజంగా జగన్ వ్యతిరేకులు. కేటీఆర్ ప్రస్తావించిన ‘మిత్రులు’ అనే కేటగిరీ కింద ఆయన బుర్రలోకి విషం ఎక్కించింది కూడా వాళ్లే. అలాంటి వాళ్లతో తిరుగుతోంటే బుర్రలోకి విషం తప్ప ఇంకేం వస్తుంది.. అనేది వైసీపీ అభిమానుల వాదన.
వైసీపీ సోషల్ మీడియా సైనికులు రెచ్చిపోయి ఎదురుదాడికి దిగడానికి ఇంకో కీలక కారణం కూడా ఉంది. 2018 ఎన్నికల సమయంలో కేటీఆర్ తమ పార్టీ విజయావకాశాలకోసం.. వైసీపీ సోషల్ మీడియా దళాలను కూడా చాలా ఎక్కువగా వాడుకున్నారు. ఇదంతా అప్రకటితంగా లోలోన జరిగిపోయిన వ్యవహారం. ఈ రోజుల్లో ఎన్నికల్లో సోషల్ మీడియా ఎంత కీలక భూమిక పోషిస్తున్నదో అందరికీ తెలుసు! అలాంటిది.. తమ పార్టీ బలాల్ని, బలగాల్ని వాడుకుని.. ఇప్పుడు తమ అధినేతను మాట అనేసరికి వారంతా సహించలేకపోయారు. తీవ్రమైన ఎదురుదాడికి దిగారు.
ఈ ట్రోల్స్ కు ఎదురుదాడికి జడిసి మొత్తానికి కేటీఆర్.. నొచ్చుకుంటున్నట్టుగా ట్వీటారు. బహుశా ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఎవరితోనైనా.. వ్యక్తిగతంగా కూడా తన పొరబాటును అంగీకరించి ఉండవచ్చు. మాట మీద కాస్త అదుపు పాటిస్తే సరిపోయేదానికి.. ఆయన ఇంత దాకా తెచ్చుకున్నారు మరి! ఇదంతా దుష్టులతో సావాసం వల్లనే అనే విమర్శలే సర్వత్రా వినిపిస్తున్నాయి.