రజనీకాంత్‌కు ఆమె పెద్ద మైనస్..?

ఒకవైపు రాజకీయం..అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం అంటే పైకి వేలు చూపించడం రజనీకాంత్ కు అలవాటు అయ్యింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఈ…

ఒకవైపు రాజకీయం..అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం అంటే పైకి వేలు చూపించడం రజనీకాంత్ కు అలవాటు అయ్యింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఈ సారి డెడ్ లైన్ రేపే. డిసెంబర్ 31న రాజకీయం విషయంలో రజనీకాంత్ ఏదో ఒకటి తేల్చేస్తాడని అభిమానులు కోటి ఆశలతో ఉన్నారు.

అయితే రజనీకాంత్ ఏమీ చెప్పకపోవచ్చు.. మళ్లీ వాయిదాకే ఆయన మొగ్గు చూపవచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాలా, 2.0 సినిమాల విడుదలల తర్వాత.. తమిళనాడుకు ఎన్నికలు ముంచుకొచ్చే వరకూ రజనీకాంత్ ఇలా నాన్చుడు ధోరణినే కొనసాగించవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అభిమానుల సమావేశంలో రజనీకాంత్ కొన్ని మంచి మాటలు చెప్పాడు.

అవి సినీ హీరోల అభిమానులందరికీ వర్తించేవే. మీ తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాలు చేసుకోండి కానీ.. డబ్బు, ఖ్యాతి, పవర్ ఉన్న వాళ్లకు కాదు అని రజనీ చెప్పారు. సినీ హీరోలపై గుడ్డి అభిమానంతో చెలరేగిపోయే వాళ్లకు కనువిప్పు కాగలవు రజనీ వ్యాఖ్యలు. ఇక అభిమానులతో రజనీకాంత్ సమావేశం కొనసాగుతూ ఉండగానే.. మద్రాస్ హై కోర్టులో రజనీకాంత్ భార్య కు చుక్కెదురైంది.

నగరపాలక సంస్థకు, రజనీ భార్య లతకు మధ్య కేసులో..ఆమెకు ఝలక్ తగిలింది. ఇంతకీ వ్యవహారం ఏమిటంటే.. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ భవన సముదాయంలో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు లత. చాలా కాలం నుంచే ఆ వ్యాపారం నడుస్తోంది. ఇటీవలే అందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు రెంట్ హెచ్చించారు. ఆ మేరకు రెంట్ ను చెల్లించి వ్యాపారాన్ని నడుపుకోవాల్సిన లత.. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లింది. రెంటు పెంచడం.. కార్పొరేషన్ వాళ్లు ఇష్టం. ఆ రెంట్ కట్టేటట్టు అయితే వ్యాపారాన్ని అక్కడే చేసుకోవచ్చు లేదా ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు.

‘మా వద్దకు ఎందుకు వచ్చారు?’ అని కోర్టు చీవాట్లు పెట్టింది. రెంట్ కట్టేటట్టు అయితే లత ఏజెన్సీని ఇక్కడ పెట్టాలని.. కార్పొరేషన్ చెప్పిన రెంట్ కట్టనట్టు అయితే.. ఆమె సామానును అక్కడ నుంచి ఎత్తేయాలని కోర్టు కఠినంగానే చెప్పింది. ఇప్పటికే లతా రజనీకాంత్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు మరో వ్యవహారంలో ఆమెకు కోర్టులు చుక్కెదురైంది. రాజకీయాల్లోకి వెళ్లాలని రజనీ అనుకుంటున్నప్పుడు.. ఇలాంటి వ్యవహారాలు పంటి కింద రాళ్లు అయ్యే అవకాశాలున్నాయి.