ఎందుకో తమిళ డైరక్టర్లు తెలుగు సినిమాలకు వర్కవుట్ అవ్వడం లేదు ఈమధ్య. ఏకంగా మురుగదాస్ లాంటి దర్శకుడే మహేష్ లాంటి స్టార్ ను పెట్టి డిజాస్టర్ తీశాడు. తర్వాత సుశీంద్రన్ లాంటి పలువురు దర్శకులు కూడా తెలుగులో ఫ్లాపులిచ్చారు. దీంతో మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి తెలుగు హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఉన్నాడు.
బాహుబలి-2తో నేషన్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నాడు. దీనికి తోడు తాజాగా అట్లీ డైరక్ట్ చేసిన మెర్సెల్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఇక ప్రభాస్-అట్లీ కాంబినేషన్ పక్కా అనుకున్నారంతా. కానీ ప్రభాస్ మాత్రం మరోసారి వెనకడుగు వేశాడు. ఇప్పట్లో అట్లీ డైరక్షన్ లో సినిమా ఉండదని అంటున్నారు ప్రభాస్ సన్నిహితులు.
ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఈ రెండూ కంప్లీట్ అయిన తర్వాతే కొత్త ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటాడు. ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకుంటే నెక్ట్స్ ప్రాజెక్టు మరింత ఆలస్యం కూడా కావొచ్చు.
బాహుబలి-2సక్సెస్ తర్వాత తెలుగు-తమిళ భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. సాహో బడ్జెట్ పెరగడానికి, స్క్రీన్ ప్లేలో మార్పులు జరగడానికి కారణం కూడా ఇదే. అందుకే ఇకపై తమిళ దర్శకులకు ప్రభాస్ ఎక్కువ ఛాన్సులు ఇవ్వొచ్చంటూ ప్రచారం జరిగింది. అట్లీ కూడా ప్రభాస్ తో చర్చలు జరిగాయని మెర్సెల్ టైమ్ లోనే ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పట్లో సాకారం కాదు.