తమిళనాడులో ఆర్కె నగర్ ఉపయెన్నికలో దినకరన్ గెలుపు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతని ఎన్నికల గుర్తయిన ప్రెషర్ కుక్కర్ యీలైనా వేస్తుందో లేదో అనుకుంటే జయలలిత కంటె ఎక్కువ మెజారిటీతో గెలిచి పెట్టి అతను ప్రత్యర్థుల గుండెల్లో రైలు కూత వినిపించాడు. దేశంలో ఉపయెన్నికలు జరిగిన మిగతా చోట్ల అధికార పార్టీయే గెలవగా, యిక్కడ మాత్రం దానికి విపర్యంగా జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లో లికాబాలి నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి పిపిఏ అభ్యర్థి కంటె తెచ్చుకున్న మెజారిటీ 305 (3461-3156) , పక్కె-కెస్సాంగ్‌లో గెలిచిన బిజెపి అభ్యర్థి తన కాంగ్రెస్ ప్రత్యర్థిపై పొందిన ఆధిక్యత 475 (3517-3042), యుపిలో సికందరాలో బిజెపి అభ్యర్థికి ఎస్పీ అభ్యర్థిపై వచ్చిన మెజారిటీ 11,861 (73284-61423).
9 నెలల క్రితం ఎస్పీతో పొత్తు పెట్టుకుని యిప్పుడు విడిగా పోటీ చేసిన కాంగ్రెసు అభ్యర్థికి వచ్చిన ఓట్లు 19,084! బెంగాల్‌లోని సబాంగ్‌లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థికి సమీప సిపిఎం అభ్యర్థిపై వచ్చిన మెజారిటీ 64,192 (106179-41987). ఈ నేపథ్యంలో ఆర్కెనగర్‌లో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి కంటగింపుగా ఉన్న స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్‌కి తన ఎడిఎంకె ప్రత్యర్థిపై వచ్చిన మెజారిటీ 40,711 (89019-48308) గణనీయం. సబాంగ్‌లో తృణమూల్ అభ్యర్థికి, దినకరన్‌కు యిద్దరికీ పోలయిన ఓట్లలో 50%కి మించి వచ్చాయి.
దేశం మొత్తంమీద ఇన్‌కమ్‌టాక్స్ దాడులకు గురవుతున్న రాజకీయ కుటుంబం ఏదైనా ఉందా అంటే శశికళదే. వాళ్లను మించిన అవినీతిపరులు యింకెవ్వరూ ఉండరన్న స్థాయిలో ప్రచారం సాగేటందుకు కేంద్రం సర్వధా కృషి చేస్తోంది. ఆ కుటుంబం నుంచి వచ్చి, అనేక కేసుల్లో యిరుక్కుని, తాజాగా ఎన్నికల కమిషనర్ ఆఫీసుకే లంచం యివ్వబోయాడన్న కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చిన దినకరన్‌కు తమిళ ఓటర్లు యింతలా ఘనవిజయాన్ని కట్టబెట్టడమేమిటి? వాళ్లకు నీతి-అవినీతి వంటి పట్టింపులు లేవా? అవినీతి ఆరోపణలే కాక, కేసులు కూడా ఉన్న జయలలిత, కరుణానిధిలను గతంలో గెలిపించినప్పుడే వాళ్ల వైఖరి తెలిసిపోయిందంటారా? ఆర్కె నగర్ జయలలిత సొంత నియోజకవర్గం.
ఆమె పార్టీ ఐన ఎడిఎంకెకు అసలైన వారసులు ఇపిఎస్ (పళనిస్వామి) – ఒపిఎస్ (పన్నీరు సెల్వం) అని ఎన్నికల కమిషన్ నిర్ణయించి, రెండాకుల గుర్తు కూడా వాళ్లకే దయచేయించింది. ఆ గుర్తు చూసైనా చాలా ఓట్లు పడి వుండాలి. శశికళ వర్గం, పన్నీరు సెల్వం వర్గం తలపడినపుడు పన్నీరు మహోన్నతుడని, అతనే బిజెపి సహాయంతో రాష్ట్రాన్ని లంచగొండుల బారి నుండి కాపాడగల సమర్థుడని సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. పన్నీరు బంధువుల పేర ఎన్ని కోట్లు పోగుపడ్డాయో యిటీవలే ఒక జాతీయ వారపత్రిక కథనం వేసింది. అప్పట్లో పళనిస్వామి దుష్టశశికళ ప్రతినిథి. లోకమంతా ఏమనుకున్నా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు అతని పక్షానే నిలబడ్డారు. వెంటనే ఎన్నికలు వస్తే డిఎంకె గెలవవచ్చనే భయంతో, మళ్లీ ఖర్చు పెట్టాలనే జంకుతో అధికారపక్షం వైపే ఉండి ప్రభుత్వాన్ని నిలబెట్టారు.
ఇది బిజెపికి నచ్చలేదు. శశికళ-పళనిస్వామిని విడగొట్టదలచింది. శశికళ వర్గీయులపై మరిన్ని దాడులు (ప్రస్తుతానికి 200ట) చేయించింది. ప్రజలు ఆమెను అసహ్యించుకుంటున్నారన్న అభిప్రాయం బాగా వ్యాపించింది. పళని శశికళపై తిరుగుబాటు చేసి, పన్నీరుతో చేతులు కలిపాడు. ఎవరెన్ని విధాల బోటు పెట్టినా, ఎన్ని సామదానభేద దండోపాయాలను ఉపయోగించినా తను ఎమ్మెల్యేలను పోగుచేయలేనని గ్రహించిన పన్నీరు, పళని కింద ఉపముఖ్యమంత్రి కావడానికి అంగీకరించాడు. బిజెపి దగ్గరుండి స్నేహబంధం కలిపింది. మానసికంగా శశికళకు దగ్గరగా ఉన్నా ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఊహతో వున్న చాలామంది ఎమ్మెల్యేలు పళని వెంట నిలిచారు.
ఎవరేమనుకున్నా ఫర్వాలేదు, మేము శశికళ వర్గీయులమే అని బాహాటంగా నిలబడిన 18ఎమ్మెల్యేలను స్పీకరు ద్వారా అనర్హులుగా ప్రకటింపచేశారు. అంతా బ్రహ్మాండంగా ఉంది, కేంద్రం మద్దతుతో ఎడిఎంకె ప్రభుత్వం ఢోకా లేకుండా నడుస్తుందనుకున్నారు. కానీ పాలన సరిగ్గా సాగలేదు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న రిపోర్టులు వచ్చినట్లున్నాయి. బిజెపి పునరాలోచనలో పడింది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న నాయకులలో స్టాలిన్ ఒక్కడే ఎత్తయిన లీడరు. ఎన్నికలు జరిగితే దానికే నెగ్గే అవకాశం ఉంది. అతనికి ప్రతిగా నిలబెడదామని చూసిన ఎడిఎంకె నేతలు ఎవరూ సరిగ్గా పాలించలేక పోతున్నారు. అందువలన డిఎంకెవైపుకి మొగ్గితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.
చెన్నయ్‌కు వేరే ఫంక్షన్‌కై వెళ్లిన మోదీ హఠాత్తుగా కరుణానిధిని చూడడానికి వెళ్లారు. ముందుగా సమాచారం అందుకున్న స్టాలిన్ విదేశాల నుంచి సమయానికి తిరిగి వచ్చి ఆయనతో మాట్లాడాడు. ఇద్దరూ కాకలు తీరిన రాజకీయ నాయకులే, ఏం మంతనాలు సాగాయో తెలియదు. నోట్ల రద్దుకి వ్యతిరేకంగా మర్నాడు జరగాల్సిన ర్యాలీని డిఎంకె రద్దు చేసుకుంది. ఆర్కె నగర్ ఉపయెన్నిక సాగుతూండగానే 2జి స్కాములో నిందితులైన కనిమొళి, రాజాలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఈ కారణాల చేత అక్కడ డిఎంకె గెలుస్తుందని, తప్పితే ఎడిఎంకె గెలుస్తుందని అనుకున్నారు.
కానీ అంతా తారుమారైంది. దినకరన్ గెలిచాడు. దీనికి కారణం ఏమిటన్నదానిపై మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. డబ్బుతో గెలిచాడని సింపుల్‌గా అనేయడం కరక్టు కాదు. అక్కడ డబ్బుకు లోటు చేసే పార్టీ ఏదీ లేదు. పైగా డబ్బు పంపిణీ చేసే అవకాశం అధికార పార్టీకే ఎక్కువ వుంది. దినకరన్‌పై ప్రభుత్వంతో బాటు మీడియా నిఘా కూడా ఎక్కువ వుంటుంది. మొదటి వాదన ప్రకారం – దినకరన్ వ్యక్తిగతంగా సౌమ్యుడు. అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇంటింటికీ తిరిగి జనాలను ఆకట్టుకున్నాడు. తనను తాను ఒక బాధితుడిగా, దిల్లీ కుతంత్రానికి బలవుతున్న అమరవీరుడిగా చిత్రీకరించుకున్నాడు. శశికళ జయలలితను చంపివేసి, ఆసుపత్రిలో చేర్పించిందని, చికిత్స పేరుతో అక్కడ కొన్ని రోజుల పాటు నాటకమాడించిందని పుకార్లు వ్యాప్తిలో ఉన్నాయి.
అవన్నీ అబద్ధమని నిరూపించడానికి దినకరన్ సరిగ్గా పోలింగు రోజున వీడియో రిలీజు చేయించాడు. ఆసుపత్రిలో చేరిన మర్నాటికి (వీడియో తేదీ యింకా తేలలేదు) జయలలిత సజీవంగా, తనంతట తను జ్యూస్ తాగే స్థితిలో వుందని చూపించే ఆ వీడియో ఆ పుకార్లు అబద్ధమని నిరూపించింది. అది దినకరన్‌కు నైతిక మద్దతు తెచ్చిపెట్టింది. ఇక ఎడిఎంకె అభ్యర్థి మధుసూదనన్ వయోవృద్ధుడు, శారీరకంగా బలహీనుడు. డిఎంకె అభ్యర్ధి మరుదు గణేశ్ రాజకీయంగా బలమైనవాడు కాదు. ఓటర్లు జయలలితకు వారసులుగా జనాలు శశికళను, ఆమె కుటుంబాన్ని గుర్తించారు. అందుకే గెలుపు కట్టబెట్టారు. వారసులమని చెప్పుకుంటున్నవారికి 48,306 ఓట్లు (27%) యిచ్చి సరిపెట్టారు. జయలలితను వ్యతిరేకించే డిఎంకె వారికి 24,651 (14%) యిచ్చి ఆవల పెట్టారు.
రెండో వాదన ఏమిటంటే – బిజెపి జోక్యాన్ని సహించలేని తమిళ ప్రజలు దానికి పాఠం చెప్పారు. జయలలిత ఉన్నంతకాలం తమిళనాడులో అదుపులో ఉన్న బిజెపి నాయకులు, తమ మద్దతుతో ప్రభుత్వం నడవడం మొదలెట్టాక రెచ్చిపోయి అధికారులపై జులుం చేయసాగారు. ఓ చెంప డిఎంకెతో, మరో పక్క ఎడిఎంకె, యింకో వంక రజనీకాంత్‌తో మంతనాలు సాగిస్తూ ఎలాగైనా తమిళ కోటను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకు ప్రాంతీయపార్టీలదే తమిళనాడులో పెద్దన్న పాత్ర. జాతీయపార్టీలు వాళ్లకు వంతపాడుతూ కాలక్షేపం చేస్తున్నాయి.
ఇప్పుడు పరిస్థితి తారుమారై జాతీయపార్టీ ప్రాంతీయ పార్టీ నాయకులను కీలుబొమ్మల్లా ఆడిస్తోంది. డిఎంకె తీర్పు సరిగ్గా పోలింగు రోజున రావడంతో, డిఎంకె కూడా బిజెపితో అంటకాగుతోందన్న అభిప్రాయం కలిగింది. అందుకే దానికి కూడా శిక్ష వేశారు. ఇక బిజెపికైతే ఘోరంగా 1417 ఓట్లు యిచ్చారు. అది నోటాకు పడిన 2373 ఓట్ల కంటె తక్కువ. గతంలో డిఎంకె-బిజెపి పొత్తు ఉన్నా అప్పుడు కరుణానిధి, వాజపేయి ప్రభుత్వంపై పట్టు కలిగి వుండేవాడు. ఇప్పుడు మోదీ వచ్చాక అదేమీ కుదరదు. ఎన్‌డిఏ భాగస్వాములు అందరూ తలవొగ్గి ఉండవలసినదే. ఎవరికీ తలవొగ్గకుండా నిలిచిన ధీరమహిళ జయలలిత వారసులు దిల్లీకి దాసోహమనడం తమిళ ప్రజలకు నచ్చలేదు కాబట్టే ఆమె పార్టీని ఓడించారు. ఎడిఎంకె అభ్యర్థి ఓడిపోవడం 1996లో జరిగింది. ఆ తర్వాత యిదే!
మూడో వాదన ఏమిటంటే – డిఎంకె కావాలనే ఓడిపోయి దినకరన్‌ను నెగ్గించింది. ఎందుకంటే ఎడిఎంకె అభ్యర్థి గెలిస్తే వాళ్లకు వచ్చే లాభమేముంది? ప్రభుత్వం బలపడుతుంది, నిలదొక్కుకుంటుంది. జయలలిత వారసులమంటూ వాళ్లు వచ్చే ఎన్నికలలో డిఎంకెకు ప్రతిగా బలమైన పక్షంగా నిలుస్తారు. డిఎంకెకు కావలసినది సత్వరంగా ఎన్నికలు. దినకరన్‌ని ఓడించడం ద్వారా అధికార పార్టీలో గందరగోళాన్ని సృష్టించి, ఇపిఎస్- ఒపిఎస్ కూటమి బలాన్ని విచ్ఛిన్నం చేయడం. జయలలిత పోగానే పార్టీలో కలకలం ఏర్పడ్డాక కావాలంటే ఎడిఎంకెలో కొందర్ని తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు. కానీ దాని చేత ఆ యా నియోజకవర్గాల్లో తన పార్టీ నాయకులకు టిక్కెట్టు యివ్వలేరు. వాళ్లు తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడవచ్చు. పైగా ఫిరాయింపులతో ఏర్పడిన ప్రభుత్వమనే ముద్ర పడుతుంది.
కేంద్రం కరుణించకపోతే, గవర్నరు రద్దు చేయవచ్చు కూడా. అంతకంటె నీతికి నిలబడినట్లు కనబడుతూ, ఎన్నికలు రప్పిస్తే యీసారి గెలుపు మనదే అని స్టాలిన్ విశ్వాసం. ఎన్నికలు రావాలంటే దినకరన్ నెగ్గాలి. ఈ క్రమంలో తమ అభ్యర్థి ఓడినా, డిపాజిట్ పోగొట్టుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే గెలిస్తే వచ్చేది ఒక్క సీటే, కానీ పోతే వచ్చేవి ఎన్నికలు! ఈ లెక్కలేసి డిఎంకె బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టింది. గతంలో జయలలితనే ఢీకొని ఆమె కంటె 39, 545 ఓట్లు మాత్రమే తక్కువ తెచ్చుకున్న ముత్తు చోళన్‌ను తప్పించి గణేశ్ వంటి అభ్యర్థిని పెట్టడంలో ఆంతర్యం యిది. 2016 మేలో డిఎంకెకు 57,673 ఓట్లు పడ్డాయి. వారిలో 33 వేల మంది ఏడాదిన్నర అయ్యేసరికి తమ పార్టీపై విముఖత పెంచుకుని పోయిపోయి దినకరన్‌కు వేశారంటే నమ్మగలమా? అందుచేత యిది కావాలని డిఎంకె ఆడిన నాటకమని వీరి వాదన.
మూడో వాదన నాకు నమ్మశక్యంగా తోస్తోంది. డిఎంకె తన నాయకులపై కేసు విషయాల్లో బిజెపితో ఒక పక్క బేరాలాడుతూనే, మరో పక్క దాని పరువు తీసేందుకు కుట్ర రచించింది. దినకరన్ గెలుపును బిజెపికి నైతిక ఓటమిగా చిత్రీకరించేందుకు ఆస్కారం కల్పించింది. దీనివలన జరిగిన పర్యవసానం ఏమిటంటే – ఎడిఎంకెలో అనుకున్నట్లుగానే కలకలం రేగింది. దినకరన్ గెలవగానే 6గురు మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు అతన్ని అభినందించారు. వేలూరు ఎంపీ సెంగూట్టవన్ అతని యింటికి వెళ్లి అభినందించాడు. తన కింకా స్లీపర్‌సెల్స్ ఉన్నారని, మూణ్నెళ్లల్లో ప్రభుత్వం కూలడం ఖాయమని దినకరన్ ప్రకటించాడు.
ఈ విజయంతో శశికళ వర్గానికి ప్రజామోదం లభించిందని ప్రచారం సాగుతోంది కాబట్టి అనేకమంది ఎమ్మెల్యేలు ఇపిఎస్-ఒపిఎస్‌లను వదిలిపెట్టవచ్చు. ప్రస్తుతానికి కనీసం 30 మంది గోడ దూకుతారని అంచనా. కాదు 60 మంది అంటున్నారు దినకరన్ పక్షాన ప్రచారం చేసిన నాయకులు. వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. అనర్హులుగా ప్రకటించబడినవారు కోర్టుకి వెళ్లారు. వాళ్లు అక్కడ ఓడిపోతే 18 చోట్ల ఉపయెన్నికలు వస్తాయి. అక్కడా యిలాటి ఫలితాలే వస్తే గొహోవిందా. ఏది ఏమైనా ఎడిఎంకె ప్రభుత్వ ఆయుర్దాయం నెలల్లో లెక్కించాలి. స్పీకరే యిటు తిరిగితే యిక చెప్పనే అక్కరలేదు.
ఇదంతా బిజెపి అనుకున్న ప్లాను కాదు. రాజ్యసభలో ఎడిఎంకెకు ఉన్న 13 మంది ఎంపీల మద్దతు దానికి కావాలంటే దినకరన్ రథానికి అడ్డుకట్ట వేయాలి. అందుకేలాగుంది, వెంటనే రజనీకాంత్‌ను రంగంలోకి దించింది. రాజకీయాలంటే మాటలు కాదని కమలహాసన్‌కు సలహా యిచ్చిన రజనీ హఠాత్తుగా యిప్పటికే ఆలస్యం చేశాను, డిసెంబరు 31 కల్లా పార్టీ పెట్టేస్తానంటూ తొందరపడడం వెనక బిజెపి ఉందని ఊహించడంలో తప్పేమీ లేదు. అయితే యిక్కడొక పరిశీలన చేయాలి. రజనీకాంత్‌కు, జయలలితకు ఎప్పుడూ చుక్కెదురే.
అందువలన జయలలిత అభిమానులు రజనీకి ఓటేయడం కల్ల. రజనీ, జయలలిత వ్యతిరేకుల ఓట్లే, అంటే డిఎంకె ఓట్లే చీల్చగలుగుతాడు. జయలలిత అభిమానులు, తమ నాయకురాలు ఎలాగూ లేదు, ఆమె పేరు చెప్పుకుంటున్నవారందరూ పనికిమాలినవారే అనుకుని డిఎంకె లేదా రజనీవైపు మొగ్గితేనే వారికి గణనీయమైన ఓట్లు వస్తాయి. శశికళ కుటుంబానికి జయలలిత ఓటర్లు బదిలీ అవుతారా లేదా అన్నది యీ ఒక్క ఉపయెన్నిక బట్టి నిర్ణయించలేం. రానున్న కాలం తమిళనాడు పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారతాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]