ఒకప్పుడు స్టార్ డైరక్టర్ ఉంటేనే సినిమా చేసేవాడు. త్రివిక్రమ్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. త్రివిక్రమ్ మాత్రమే కాదు.. బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి ఇలా క్రేజ్ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేశాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడీ హీరో మైండ్ సెట్ మారింది.
సబ్జెక్ట్ బాగుంటే డైరక్టర్ ఎవరనే విషయాన్ని చూడట్లేదు. ఇతడి అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. 'నా పేరు సూర్య' అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ తర్వాత అనురెడ్డి అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పాడు.
అనురెడ్డి కూడా కొత్త దర్శకుడే. నెక్ట్స్ సినిమా అతడితో చేస్తాడా చేయడా అనే విషయాన్ని పక్కనపెడితే అతడ్ని లాక్ చేసిన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడీ ఇద్దరు దర్శకులతో పాటు తాజాగా వీఐ ఆనంద్ చెప్పిన ఓ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ.
ప్రస్తుతం అల్లుశిరీష్ తో 'ఒక్క క్షణం' అనే సినిమా చేస్తున్నాడు వీఐ ఆనంద్. ఈ మూవీ సెట్స్ పై ఉన్న టైమ్ లోనే బన్నీకి ఓ మంచి స్టోరీ వినిపించాడు. అది బన్నీకి నచ్చి వీఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే బన్నీ, వీఐ ఆనంద్ కాంబోలో సినిమా రాబోతోంది.
ఇలా చూసుకుంటే.. దర్శకుల విషయంలో బన్నీ మైండ్ సెట్ మారినట్టు కనిపిస్తోంది. ఒకప్పటిలా త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకుల కోసం వెయిట్ చేయకుండా కథలు నచ్చితే కొత్త దర్శకులకు కూడా ఛాన్సులు ఇస్తున్నాడు.