బాలయ్య ఫ్యాన్స్‌ను భయపెడుతున్న డైరెక్టర్!

చాన్నాళ్ల కిందట ఫామ్ కోల్పోయిన పూరీజగన్నాథ్ తో బాలయ్య ‘పైసా వసూల్’ అంటూ సినిమా తీశాడు. అది కాస్తా పైసాలను వసూల్ చేయలేకపోయింది. ప్రీ రిలీజ్ మార్కెట్ బజ్ కూడా రాలేదు ఆ సినిమాకు.…

చాన్నాళ్ల కిందట ఫామ్ కోల్పోయిన పూరీజగన్నాథ్ తో బాలయ్య ‘పైసా వసూల్’ అంటూ సినిమా తీశాడు. అది కాస్తా పైసాలను వసూల్ చేయలేకపోయింది. ప్రీ రిలీజ్ మార్కెట్ బజ్ కూడా రాలేదు ఆ సినిమాకు. థియేటర్ల వద్ద ప్రేక్షకులకు ఏ మాత్రం పట్టలేదు ఆ పోకిరీ ఫార్ములా సినిమా. అయితే బాలయ్య నమ్మాడు, చేశాడు, ఒక ఫ్లాఫ్ ను జోడించుకున్నాడు.

ఇక బాలయ్య నమ్మకం మళ్లీ కూడా ఫామ్ లో లేని దర్శకుడి మీదే నిలిచింది. ఫలితంగా ‘జై సింహా’ విడుదలకు సిద్ధం అవుతోంది. కేఎస్ రవికుమార్.. ఏనాటి దర్శకుడు ఇతడు? అనుభవం అయితే చాలానే ఉంది. 27 నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్ ను నమోదు చేసి చాలా కాలం అయిపోయింది. బహుశా కమల్ హాసన్ తో తీసిన ‘దశావతారం’ చెప్పుకోదగిన సినిమా.

అయితే కొన్నేళ్లుగా కమల్ సినిమాల్లో దర్శకుడికి పెద్దగా పని ఉండదు. అన్నీ కమలే చేసుకొంటాడు. దర్శకుడు డమ్మీ అనే ముద్ర ఎలాగూ ఉండనే ఉంది. దశావతారం తర్వాత కమల్ తోనే ‘మన్మథబాణం’ తీశాడు కేఎస్. అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత భాషాకు సీక్వెల్ అంటూ కన్నడలో ఒక సినిమా, తమిళ ‘సామి’ హిందీ రీమేక్.. వంటి సినిమాలు చేశాడు.

ఇక కేఎస్ ఆఖరి పెద్ద సినిమా ‘లింగా’.. ఫెయిల్యూర్ ఆఫ్ ద డికేడ్ అనిపించుకుంది. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీలను వెంటేసుకు తిరుగుతున్నాడు కేఎస్ రవికుమార్. అలాగే ఈయన తీసిన స్ట్రైట్ తెలుగు సినిమాలు.. స్నేహంకోసం, బావనచ్చాడు వంటి సినిమాల చరిత్ర ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో కేఎస్ రాతను బాలయ్య మార్చబోతున్నాడా? లేక పాతకథే రిపీట్ అవుతుందా? జై సింహ ఫలితమే సమాధానంగా నిలవబోతోంది. బాలయ్య ఫ్యాన్స్‌ను మాత్రం కేఎస్ తన ట్రాక్ రికార్డుతో భయపెడుతున్నాడు!