ఖరీదైన కారును కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి వెళ్లి కొని.. అక్కడ తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి పన్ను మినహాయింపును పొందిన కేసులో ఫవాద్ ఫాజిల్ ను అరెస్టు చేశారు పోలీసులు. కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లి ఖరీదైన కార్లను కొని పక్క రాష్ట్రాలకు తీసుకొచ్చుకుని తిప్పిన వ్యవహారంలో ఫవాద్ అరెస్టు అయ్యాడు.
మన వాళ్లకు ఇతడు అంత పరిచయస్తుడు కాదు. అయితే ఫవాద్ తండ్రి ఫాజిల్ తెలుగులో ఒకటీ అర సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే మలయాళంలో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన బోలెడన్ని సినిమాలు తెలుగులోకి డబ్, రీమేక్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే… క్యూటీ బ్యూటీ నజ్రియా నజీమ్ భర్తే ఫవాద్.
పన్ను ఎగవేత కేసులు నమోదు చేసి ఇతడిని అరెస్టు చేశారు పోలీసులు. ఆ వెంటనే బెయిల్ కూడా వచ్చిందని అనుకోండి. ఇక ఇదే తరహా ఆరోపణలను ఎదుర్కొంటోంది అమలపాల్. ఫవాద్ తో పాటు అమల పేరు కూడా ఈ కేసుల్లో నానుతోంది. ఇప్పటికే అమలపై కూడా కేసులు నమోదయ్యాయి.
అయితే అలర్ట్ అయిన ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఒకవేళ బెయిల్ లభించకపోతే అమలను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ కేసులు మరీ అంత తీవ్రమైనవి కాకపోవచ్చు. పూచికత్తుల మీద విడుదలలు, సరిగా పన్నులు చెల్లించేస్తే లేదా ఫైన్లు కట్టేస్తే కేసులు కొట్టేసే అవకాశాలు ఉండవచ్చు.