అజ్ఞాతవాసి కోసం పవన్ గొంతు సవరించుకున్నారు. గతంలో ఓసారి పాడారు. ఇప్పుడు మళ్లీ పాడారు. ఆ పాట న్యూ ఇయర్ గిఫ్ట్ గా బయటకు వస్తుంది. మాస్ పాటలు రాయడంలో గట్టి పేరున్న భాస్కరభట్ల ఈ పాట రాసారు. అజ్ఞాతవాసి ఆల్బమ్ అంతా ఒక ఎత్తు. ఈ పాట ఒక ఎత్తు అనుకోవాలి.
ఎందుకంటే ఇప్పటిదాకా త్రివిక్రమ్ సినిమాల ఆల్బమ్ లతో పోల్చుకుంటే అజ్ఞాతవాసి ఆల్బమ్ కాస్త వీక్ అనే చెప్పాలి. గాలివాలుగా పాట పెద్ద హిట్. బయటికొచ్చి చూస్తే పాట కూడా ఓకె. మిగిలినవి పెద్దగా ఇన్ స్టాంట్ హిట్ కాలేదు. పైగా గాలివాలుగా, బయటికోచ్చి చూస్తే రెండు పాటలు కూడా మాస్ పాటలు కావు. కాస్త క్లాస్ టచ్ వున్నవే.
బి సి సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ మైకులు మోత మోగాలి అంటే ఈ పాటలు సరిపోవు. మాంచి మాస్ బీట్ కావాలి. దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చేటువంటి కిక్కిచ్చే మాస్ బీట్ అన్నది అనిరుధ్ నుంచి రాలేదు. అది వాస్తవం. మరి ఆలాంటి పాటనే భాస్కరభట్ల – పవన్ కలిసి అందించబోతున్నది.
వాస్తవానికి ఈపాట చిత్రీకరణ ఎప్పుడో అయిపోయింది. ఆర్ ఎస్ సి లో ఫస్ట్ పిక్చరైజ్ చేసింది ఈ పాటనే. కానీ సరైన లిరిక్స్ కుదరలేదు. త్రివిక్రమ్ కు సంతృప్తి కలిగించే లిరిక్ కోసం ట్రయ్ చేసి, చేసి, ఆఖరికి భాస్కర భట్ల దగ్గర సెటిల్ అయ్యారు.
ఫంక్షన్ వుంటుందా?
ఆంధ్రలో అజ్ఞాతవాసి కోసం మరో ఫంక్షన్ చేయాలన్నది హారిక హాసిని యూనిట్ ఆలోచన. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పని చాలా వుంది. ట్రయిలర్ కట్ చేయడానికే త్రివిక్రమ్ కు టైమ్ దొరకడం లేదు.
విజయవాడ, అమరావతి, విశాఖల్లో ఎక్కడో ఒక దగ్గర ఫంక్షన్ చేయాలని ఆలోచన అయితే వుంది. ఈ పాట విడుదలను అకేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ పవన్-త్రివిక్రమ్ ఓకె అనాలి. వాళ్లు తీరుబాటు చేసుకుంటే ఆంధ్రలో మరో మాంచి ఫంక్షన్ వుండడం గ్యారంటీ.