సినీ అభిమానం క్రమక్రమంగా ఆటవికంగా మారుతున్నట్టుగా ఉంది. తమ అభిమాన హీరోని ఏ రకంగా విమర్శించినా వారి వారి అభిమానగణాలు అస్సలు సహించేలాలేవు. అత్యంత నీఛంగా, అత్యంత దారుణంగా మాట్లాడటానికి.. బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడానికి అభిమానుల రూపంలోని ఈ రౌడీలు వెనుకాడటంలేదు.
ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో సినీ అభిమానం అనే ఉన్మాదం నీఛస్థాయికి వెళ్లిపోతోంది. కనీస ఇంగితం మరిచి మాట్లాడటమే సినీ అభిమానానికి పరమావధి అవుతోంది. మూర్కత్వం, ఉన్మాదం, ఆటవికం.. ఇలాంటి పదాలేవీ సినీ హీరోల వీరాభిమాలను ఆగడాలను వర్ణించడానికి సరిపోవడంలేదు. ఆఖరికి మా హీరోని ఏమైనా అంటే.. రేప్చేస్తాం జాగ్రత్త.. అని హెచ్చరించేంత వరకూ వచ్చారు సినీ హీరోల అభిమానులు.
మలయాళ గడ్డపై మరోసారి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఒక నటిపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో హీరో దిలీప్ జైల్లో రెండు మూడునెలలు ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని ఆ నటిపై అతడు రేప్ చేయించాడనే కేసులు నమోదు అయ్యాయి.
డబ్బులు ఇచ్చి అతడు కొంతమంది చేత ఈ పని చేయించి, వారి చేతే ఫొటోలు కూడా తీయించి ఆ నటిపై తన కసి తీర్చుకున్నాడనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో ఉంది. అందుకు సంబంధించిన పరిణామాలు కొనసాగుతుండగానే ఇప్పుడు అదే మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన మరో హీరో అభిమానులు ఒక ప్రముఖ నటికి ఈ హెచ్చరికలు జారీచేశారు.
ఈసారి వంతు నటి పార్వతిది. ఈమె పలు మలయాళీ సినిమాల్లో నటించింది. బెంగళూరు డేస్‌లో నటించింది. అలాగే కమల్‌హాసన్ నటించిన తమిళ సినిమా 'ఉత్తమ విలన్'లో కమల్ కూతురి పాత్రలో కనిపించింది. ఉత్తమ విలన్ తెలుగులోకి డబ్ అయ్యింది కాబట్టి.. ఆ సినిమాలో కమల్ కూతురిగా ఈమె ప్రతిభా పాటవాలను చూడవచ్చు. మలయాళీ పరిశ్రమ ఇచ్చిన మరో చక్కటి నటి పార్వతి. ధనుష్ సినిమా మరియన్లో కూడా నటించిందీమె.
ఇప్పుడు ఈమెకు ఎందుకు రేప్ హెచ్చరికలు జారీ అయ్యాయి అంటే.. ఏదో సినిమా ఫంక్షన్లో మమ్ముట్టీ సినిమాల మీద క్రిటిక్‌గా మాట్లాడింది అనేది అభిమానుల ఆగ్రహం. మమ్ముట్టీ వీరాభిమానులు ఈ విషయాన్ని సహించలేకపోయారు. ఆమెపై అత్యాచారం చేస్తాం.. అని వీరు సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీచేశారు. మరి దిలీప్ వ్యవహారాన్ని చూసి.. ఇతర హీరోల అభిమానులకు కూడా ఇలాంటి మాటలు వస్తున్నట్టుగా ఉన్నాయి.
రేప్ చేసేస్తాం.. తమ హీరోపై స్పందించిన ఆడవాళ్లందరికీ ఇదో హెచ్చరిక అయిపోయింది అభిమానుల నుంచి. దిలీప్ వ్యవహారాలపై స్పందించిన నటీమణులకు కూడా ఆయన అభిమానులు ఇదే హెచ్చరికలు చేశారు. దిలీప్‌ను ఏమైనా అంటే.. రేప్‌కు గురైన నటికి పట్టినగతే మీకూ పడుతుంది అని దిలీప్ ఫ్యాన్స్ వీరావేశంగా హెచ్చరించారు. ఇప్పుడు మమ్ముట్టీ అభిమానులూ అదేమాటే మాట్లాడుతున్నారు. తమ హీరోని ఏమైనా అంటే రేపులయిపోతాయని అంటున్నారు.
ఈ సినీ అభిమానం అనే ఉన్మాదం రోజు రోజుకూ మరింత ఉన్మత్తతగా మారుతోంది. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్లు, తమ అభిమాన హీరోని ఏమైనా అంటే నరికేస్తాం, పొడిచేస్తాం.. అనే ఆవారాగాళ్ల చమడాలను చట్టపరంగా తీసేవరకూ ఇలాంటి తీరులో మార్పు రాకపోవచ్చు. నలుగురికి పడితే మిగతా వాళ్లంతా దారికివస్తారు.