బాలీవుడ్‌ లోనూ థియేటర్ల గొడవ.. రాజకీయం!

థియేటర్ల గొడవ.. పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు.. ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు అన్నీ.. అనే మాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలాకాలం నుంచినే వినిపిస్తున్నాయి. ప్రాంతాల వారీగా కొంతమంది నిర్మాతలు థియేటర్లను పంచేసుకున్నారని..…

థియేటర్ల గొడవ.. పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు.. ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు అన్నీ.. అనే మాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలాకాలం నుంచినే వినిపిస్తున్నాయి. ప్రాంతాల వారీగా కొంతమంది నిర్మాతలు థియేటర్లను పంచేసుకున్నారని.. ఏ సినిమా విడుదల కావాలన్నా వాళ్ల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాల్సి వస్తోందని, చిన్న సినిమాలను రూపొందించి వాటిని థియేటర్లలో ప్రదర్శించుకోవడం అసాధ్యమైన పనిగా అయిపోయిందని చాలా మంది టాలీవుడ్‌ వాళ్లు వాపోతూ ఉంటారు.

గత పది సంవత్సరాల్లో ఈ వ్యవహారంపై ఎంతో చర్చ జరిగింది. అనేకమంది ఈ వ్యవహారంలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ సినిమాలను తొక్కేస్తున్నారని వాపోయారు. ఇలా వాపోయిన వాళ్లలో నటులు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఉన్నారు. కొందరైతే ఈ విషయంలో మానవ హక్కుల సంఘం వరకూ వెళ్లారు. తమ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని.. తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని హక్కుల సంఘాలు స్పష్టంచేశాయి.

దీంతో.. ఈ రకమైన మాఫియాకు ఎదురే లేకుండా పోయింది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకపోవడం.. కొంతమంది డ్యామినేషన్‌, మొత్తం థియేటర్లను వాళ్ల కనుసన్నల్లో పెట్టుకోవడం.. ఇదంతా డైలీ సీరియల్‌గా సాగుతోంది టాలీవుడ్‌. ఈ వ్యవహారాలను సదరు నిర్మాతల దగ్గరకే తీసుకెళ్లిన సందర్బాలూ ఉన్నాయి. అయితే.. వాళ్లుమాత్రం మాఫియా అనేమాటతో ఏకీభవించలేదు. తమకు ఏ పాపం తెలియదని, తమంతటి శుద్ధపూసలు ఎవరూ లేరని వారు స్పష్టం చేశారు కూడా. ఇలా టాలీవుడ్‌లో ఈ గేమ్‌ సాగుతూనే ఉంది.

మరి దీనికి టాలీవుడ్డే కాదు.. బాలీవుడ్‌ కూడా మినహాయింపులా కనిపించడంలేదు. అక్కడ కూడా ఇదే గొడవే. ప్రస్తుతం దానికి కొంత రాజకీయం కూడా జోడీ కావడంతో వ్యవహారం మసాలాగా మారింది. బాలీవుడ్‌లో క్రిస్మస్‌ సీజన్‌ పెద్ద సినిమా.. చిన్న సినిమాలను తొక్కేసింది అనే ప్రధానమైన ఆరోపణ. తొక్కేసిన సినిమా 'టైగర్‌ జిందాహై'. ఈ టైగర్‌ కింద నలిగిపోయింది మరాఠా సినిమాలు!

ముంబై కేంద్రంగా నడిచే చిత్ర పరిశ్రమ బాలీవుడ్‌ మాత్రమే కాదని వేరే చెప్పనక్కర్లేదు. మరాఠా చిత్రాలకు కూడా కేంద్రం ముంబై మహానగరమే. మరాఠాలో ఈ మధ్యకాలంలోనే మంచి మంచి సినిమాలు వచ్చాయి. వాటిని బాలీవుడ్‌ కూడా రీమేక్‌ చేస్తున్న పరిస్థితి. ఇక బాలీవుడ్‌ ప్రముఖులు మరాఠాలో సినిమాలు రూపొందిస్తున్నారు కూడా. నిర్మాతలుగా, నటులుగా మరాఠా సినిమాల్లో వాళ్లు కనిపిస్తున్నారు.

ఇలాంటి ప్రస్థానం ఉన్న మరాఠా చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినిమాలకు విడుదల అవకాశాలు మాత్రం తగు రీతిలో లేకుండా పోయాయని తెలుస్తోంది. బాలీవుడ్‌ సినిమాలు, ఆ సినీ పరిశ్రమ ప్రముఖుల ప్రమేయంతో.. మరాఠా సినిమాల మనుగడ కష్టం అయిపోతోంది. ప్రత్యేకించి బాలీవుడ్‌ పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు మరాఠా సినిమాలను విడుదల చేసుకోవడం కూడా కష్టమే అవుతోందని తెలుస్తోంది.

ఈ పరంపరలో సల్మాన్‌ఖాన్‌ తాజా సినిమా 'టైగర్‌ జిందాహై' భారీఎత్తున విడుదల కావడంతో.. ఈ సీజన్‌ వారంలో విడుదల అనుకున్న మరాఠా సినిమాలకు థియేటర్లు అస్సలు దొరకడం లేదని తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్‌ నటించిన ఈ భారీ సినిమా ఎంత భారీగా విడుదల అయ్యిందో(శుక్రవారం) వేరే చెప్పనక్కర్లేదు. ఇది ముంబై మహానగరంలోనే కాకుండా.. మహారాష్ట్ర అంతా థియేటర్లను ఆక్రమించేసిందట. దీంతో ఇప్పుడు మరాఠా సినిమాలకు విపత్తు వచ్చేసింది. తమ రాష్ట్రంలో తమ భాష సినిమాలను తీసేవాళ్లకు ఈ రకమైన ఇబ్బంది వచ్చేసరికి మరాఠా రాజకీయ నేతలు స్పందించేశారు.

ఈ విషయంలో వాళ్లు పోటీలుపడ్డారు. మరాఠాల కోసమే తమ పార్టీ అని చెప్పుకునే శివసేన, మహారాష్ట్రను నవనిర్మానిస్తాననే ఎమ్‌ఎన్‌ఎస్‌లు ఈ సందర్భంగా ఘాటుగా స్పందించాయి. మరాఠా సినిమాల విడుదలకు అవకాశం ఇవ్వకుండా టైగర్‌ జిందాహై థియేటర్లను ఆక్రమించేయడం పట్ల ఈ పార్టీల నేతలు ఫైర్‌ అయ్యారు.

ఎమ్‌ఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ఠాక్రే ఈ విషయంలో తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. బాలీవుడ్‌ మాఫియాను సహించేదిలేదని ఆయన వ్యాఖ్యానించాడు. బాలీవుడ్‌ వాళ్లు జోరు తగ్గించుకుని.. మరాఠా సినిమాలకు అవకాశం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని రాజ్‌ హెచ్చరిక జారీచేశాడు.

ఇక శివసేన కూడా గట్టిగానే హెచ్చరించింది. 'టైగర్‌ జిందాహై' అని సినిమా పేరు పెట్టుకున్నారు.. ముంబైలో మరో టైగర్‌(శివసేన) కూడా జిందాహై అని మీరు గుర్తుంచుకోవాలి.. అని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ యశ్‌రాజ్‌ పిక్చర్స్‌ వాళ్లకు హెచ్చరిక జారీచేశాడు. బాలీవుడ్‌లో పేరెన్నిక గల నిర్మాణ సంస్థ అయిన వైఆర్‌ఎఫ్‌కు ఈ విధంగా మరాఠా పార్టీలు వరస హెచ్చరికలు జారీచేశాయి. ఈ విధంగా నడుస్తోంది మరాఠా గడ్డపై థియేటర్ల రాజకీయం!