నారా లోకేష్ వాక్-చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాతో టచ్ ఉన్న వాళ్లకు లోకేష్ 'కామెడీ' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక దేశంగా మార్చేసిన ఘనత ఆయనది. ఈ మంత్రిగారిపై సదరు పార్టీలోని నేతలే గుట్టుగా జోకులేసుకుంటారు.
అలాంటి లోకేష్ ఇప్పుడో సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అది కూడా మామూలు సినిమా కాదు. స్వయంగా లోకేష్ మామగారు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా ఫంక్షన్. ఈరోజు సాయంత్రం విజయవాడలో జరగనున్న ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ నారా లోకేష్.
మామూలుగానే మాట తడబడుతుంది లోకేష్ కి. ఇలాంటి సినిమా ఫంక్షన్లంటే మరీ కొత్త. అది కూడా మామ ముందు మాట్లాడాలి. అందుకే ఈసారి లోకేష్ నోటి నుంచి ఇంకెన్ని 'ఆణిముత్యాలు' జాలువారతాయోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఈరోజు సాయంత్రం సిద్దార్థ్ స్కూల్ గ్రౌండ్ లో జరగనున్న ఫంక్షన్ లో మంత్రిగారు తనకు తెలియకుండానే ఇంకెన్ని పంచ్ లు పేలుస్తారో చూడాలి.
ఈ విషయంలో లోకేష్ మామ బాలయ్యను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. తన ప్రసంగాన్ని ఎటు ప్రారంభించి ఎటు ముగిస్తాడో ఈ నటసింహానికి కూడా తెలీదు. తన ప్రసంగాల్లో నోరుజారిన సందర్భాలు చాలా ఉన్నాయి. బాలయ్య భాషలో చెప్పాలంటే అతని ప్రసంగం ఆసాంతం దబిడిదిబిడే.
ఇలాంటి ఇద్దరు ప్రముఖులు జై సింహా ఆడియో రిలీజ్ సందర్భంగా ఒకే వేదికపైకి వస్తున్నారు. తమ మాటల తూటాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.