తెలుగు సూపర్ హిట్ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఇప్పటికే పట్టాలు ఎక్కింది. చాలా హిట్ సినిమాల రీమేక్ ప్రతిపాదనలు ప్రతిపాదనలుగానే మిగిలిపోతూ ఉంటాయి. అయితే అర్జున్ రెడ్డి రీమేక్ లు మాత్రం శరవేగంగానే పట్టాలు ఎక్కుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాట జాతీయ అవార్డెడ్ దర్శకుడు బాల ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తీసుకున్నాడు.
బాల వంటి దర్శకుడు అర్జున్ రెడ్డి ని రీమేక్ చేస్తున్నాడంటే.. ఈ స్క్రిప్ట్ కు మరింత గౌరవం దక్కినట్టే నిస్సందేహంగా. కన్నడలో కూడా ఈ సినిమా రీమేక్ కావడం ఖరారే. అసలే రీమేక్ సినిమాలు అంటే కన్నడ హీరోలు పడిచస్తారు. ఈ క్రమంలో శాండల్ వుడ్ స్టార్ యశ్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. హిందీ రీమేక్ విషయంలో మాత్రం హీరోల తర్జనభర్జనలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాను హిందీలో చేయడానికి ముందుగా రణ్ వీర్ సింగ్ ను అనుకున్నారు. అతడు కూడా మొదట్లో సై అన్నాడు కానీ.. ఇప్పుడు మాత్రం ఆ హీరో వెనుకాడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికో కారణం ఉంది. బాలీవుడ్ లో ‘పద్మావతి’ సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు రణ్ వీర్. అది కూడా అల్లావుద్ధీన్ ఖిల్జీ పాత్రను చేశాడు. ఈ సినిమానే బ్యాక్ ఫైర్ అయ్యింది.
ఇలాంటి నేపథ్యంలో అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమాను చేయడానికి రణ్ వీర్ వెనుకాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఎక్కడైనా సంచలనం అవుతుంది.. వివాదాలు తప్పవు. అందుకే.. రణ్ వీర్ ఈ రీమేక్ ను మిస్ చేసుకున్నాడని సమాచారం. దీంతో.. ఇప్పుడు షాహిద్ కపూర్ తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. షాహిద్ తో ఈ సినిమా హిందీలో రీమేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకత్వం ఛాన్స్ ఒరిజినల్ ను చెక్కిన సందీప్ రెడ్డికే దక్కవచ్చును అని టాక్.