సెలబ్రిటీల సంపాదనల గురించి ఇలా కోట్ల రూపాయిల నంబర్లను వినడం జనాలకు ఒక సరదా. ఫలానా సెలబ్రిటీ అన్ని కోట్లు సంపాదించాడు.. అంటే.. అందులో ఒక్క రూపాయి కూడా సామాన్యుడికి లాభం ఏమీ లేదు కానీ.. అతడు అలా సంపాదించాడు అని తెలుసుకోవడం కామన్ మ్యాన్ కు ఒక ప్లజర్. అందులోనూ సదరు సెలబ్రిటీ తనకు ఇష్టమైన వాడో, తన అభిమాన హీరోనో, లేక తమ కులానికి చెందిన డైరెక్టరో.. ఏదో విధంగా తమ కులానికి సంబంధిచిన వాడైతేనో.. అప్పుడు జనాల ఆనందం చెప్పనలవి కాదు.
అతడు బాగా సంపాదించాడని, ఇంకా సంపాదించాలని.. వచ్చే ఏడాది అతడి సంపాదన ఇంకా పెరుగుతుందని, రాబోయే పదేళ్లలో అతడు ఇంకా వందలకోట్లు పోగేస్తాడని.. లెక్కలేసుకుని మరీ ఆనందించడం.. జనాల తత్వం. దీనికి చాలా మంది మినహాయింపు కాదు, ఇదో మానసిక తుత్తి! ఈ నంబర్లన్నీ వినడానికి బాగానే ఉన్నాయి.. జనాలు ఫోర్బ్స్ జాబితా లెక్కలను ఎగబడి చదివారు.. ఎవరెన్ని కోట్లు సంపాదించారు.. అనే అంశం గురించి తెలిసేసుకున్నామనే ఆనందాన్ని పొందారు… ఇంత వరకూ బాగానే ఉంది కానీ, ఈ లెక్కలన్నీ నిజమా? అంటే మాత్రం ఇవన్నీ అబద్ధాలే అని చెప్పకతప్పదు.
ఫోర్బ్స్ గణాంకాలు అబద్ధమని అంటావా? అని కొంతమంది వీరావేశంగా ప్రశ్నించవచ్చు కానీ.. ఇవన్నీ అబద్ధాలే. కేవలం అంచనాలు.. అంచనాల మీద అంచనాల లెక్కలు ఇవన్నీ. ఆ సినిమా అంత వసూలు సాధించింది కాబట్టి.. ఆ సినిమాలో నటించిన హీరోకి అంత డబ్బు వచ్చి ఉండవచ్చు, ఆ హీరో ఈ ఏడాదిలో ఇన్ని సినిమాలు చేశాడు కాబట్టి.. వాటన్నింటికీ కలిపి ఇంత వచ్చి ఉండవచ్చు. అదే హీరో ఇన్ని యాడ్స్ చేశాడు కాబట్టి.. ఒక్కో యాడ్ కు అంత తీసుకునే అవకాశం ఉంది కాబట్టి.. మొత్తంగా అతడు ఇంత సంపాదించి ఉండవచ్చు.. ఇలా సాగుతాయి ఫోర్బ్స్ అంచనాలు.
ఫోర్బ్స్ ఇన్ని లెక్కలు చెప్పింది కదా.. సెలబ్రిటీలు ఇన్ని వందలకోట్లు సంపాదించారని చెప్పింది కదా.. ఆ మేరకు ఆ సెలబ్రిటీలు ఐటీ రిటర్న్స్ ఏమైనా దాఖలు చేశారా? నిస్సందేహంగా లేదు. అసలు ఫోర్బ్స్ కథనాలు అన్నీ అంచనాల లెక్కలే కానీ.. సదరు సెలబ్రిటీల చేత ఈ లెక్కలపై ఫోర్బ్స్ ఎన్నడైనా స్పందనను తీసుకుందా? లేదు! అంత వరకూ ఎందుకు.. గత ఏడాది ఈ పత్రిక వాళ్లు సల్మాన్ ఖాన్ 270కోట్లు సంపాదించాడు అని రాశారు. అదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దానికి సల్మాన్ ఆశ్చర్యపోయాడు.
‘అంత డబ్బు వచ్చిందా? నా దగ్గరైతే అంత డబ్బుల లేదే.. ఎక్కడ ఉందబ్బా.. అంత డబ్బు ఎలా వస్తుంది నాకు..’ అని సల్మాన్ అమాయకంగా సమాధానం ఇచ్చాడు. ఫోర్బ్స్ కూడా తన కథనాలను రాసేస్తుంది.. అంచనాలను చెబుతుంది.. ఆ కథనాలపై సదరు సెలబ్రిటీలు ఏమనుకుంటున్నారనే అంశం గురించి కూడా ఆ పత్రిక రాయదు. వారి స్పందనను తీసుకుని కథనాలను రాయదు. ఇలా రాయడం, తమ కథనాలను సేల్ చేసుకోవడం ఫోర్బ్స్ వ్యాపారం. ఫోర్బ్స్ లో ఇలా పేరు చూసుకుని.. తమ క్రేజ్ పెరిగిందనుకోవడం సినీ జనాల అనందం. చదివే వాళ్ల ఆనందం చదివేవాళ్లది!