రాను రాను ప్రేక్షకుల తీరు మారుతోంది. చెప్పుకోవడానికి సినిమాలు బాగుంటే రెండు మూడయినా చూస్తారు. ఎన్ని విడుదలయినా ఫరవాలేదు ఇలాంటి కబుర్లు చాలా వుంటాయి. కానీ జనాలు మాత్రం ఒక సినిమాను మించి చూసే పరిస్థితి చాలా అరుదుగా వస్తోంది. సెలవులు వున్నా కూడా రెండు మూడు సినిమాలు వేస్తే, ఎవరికీ సంతృప్తి వుండే పరిస్థితి రావడం లేదు. దీనివల్ల కాస్త నిలబడే సినిమాలు కూడా కింద పడిపోతున్నాయి.
కిందటి సంక్రాంతికి ఎన్టీఆర్, బాలయ్య, నాగ్ సినిమాలు వచ్చాయి, బాగానే ఆడాయి కదా అనుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమాకు యాభైకోట్లు, బాలయ్య సినిమాకు ఇరవైకోట్లు వచ్చాయి. నిజానికి పండగ సీజన్ కాకుంటే పరిస్థితి ఏమిటి? నాలుగు రోజులు వరుస సెలవులు వస్తే చాలు పోటీ పడిపోతున్నారు. బాగా వుంటే ఆడేస్తాయి అనుకుంటున్నారు. కానీ జనం ఏదో ఒక సినిమాకే ఓటేస్తున్నారు. కలెక్షన్లు చీలిపోతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టులో ఏం జరిగింది. రకరకాల పరిస్థితుల కారణంగా, పంతాలు పట్టింపుల కారణంగా మూడు సినిమాలు పోటీ పడి విడుదలయ్యాయి. ఎవరికీ పూర్తి సంతృప్తి కలగలేదు. భారీ సినిమా అయిన జయజానకీనాయక సినిమా విడిగా, సోలోగా వచ్చి వుంటే గట్టెక్కేది. మంచి సమీక్షలు వచ్చి కూడా ఆ సినిమా ప్రాఫిటబుల్ వెంచర్ కు కాస్త దూరంగా వుండిపోయింది.
సోలోగా వచ్చి వుంటే లై సినిమా మరి కాస్త కలెక్షన్లు దక్కించుకునేది. నేనే రాజు నేనే మంత్రి సినిమా అనుకున్నదానికన్నా మరి కాస్త ఎక్కువ కలెక్ట్ చేసేది. జయజానకీనాయక సినిమా ఇటీవల టీవీల్లో వేస్తే జనం విరగబడి చూసారు. బ్యాక్ టు బ్యాక్ రెండు ఆదివారాలు వేసారు. అంటే అప్పుడు చూడలేకపోయిన వారంతా ఇప్పుడు చూసారనుకోవాలి.
సరైన డేట్ మళ్లీ దొరకదనో, వెనక్కు వెళ్లినా, ముందుకు వెళ్లినా ప్రెస్టీజ్ క్వశ్చను అనో పోటీలో దిగి ఇబ్బందిపడుతున్నారు. ఈ వారం చూడండి. హలో సినిమా ప్లాన్ చేసుకుంటే నాని సినిమా వచ్చి పడింది. నాని-సాయిపల్లవి వున్నారనే ధీమా ఆ సినిమా నిర్మాతది. వెనక్కు వెళ్తే ఏమనుకుంటారో అని హలో నిర్మాత. దాంతో ఇప్పుడేమయింది.
దగ్గర దగ్గర తొమ్మిద వందల స్క్రీన్ లో ఎంసిఎ విడుదలయితే, ఏడు వందల లోపు స్క్రీన్ లలో హలో విడుదలయింది. పైగా సాయిపల్లవి-నాని ప్రభావం. తొలి సినిమా తరువాత అఖిల్ తీసుకున్న గ్యాప్ ఫలితం కూడా క్లియర్ గా కనిపించింది. విక్రమ్ కె కుమార్ అనగానే ఫ్యామిలీ మూవీ అనే బజ్ వచ్చింది.
నాని-సాయిపల్లవి అనగానే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అన్నటాక్ వచ్చింది. దీని ఎఫెక్ట్ కూడా కనిపించింది. పైగా నాని సినిమాకు ఫిక్స్ డ్ హైర్స్ ఇతరత్రా వ్యవహారాలు కలిసాయి. హలో సినిమా దాదాపు ఓన్ రిలీజ్ కావడంతో షేర్ లు మాత్రమే కనిపించాయి.
వెరసి హలో సినిమా తొలి రోజు ఎపి తెలంగాణలో మూడు కోట్లు మాత్రమే షేర్ వసూలు చేయగలిగింది. నాని సినిమా ఎపి తెలంగాణలో తొలి రోజు ఏడు కోట్లకు పైగా షేర్ లాగింది. ఇదే కనుక హలో సోలోగా బరిలోకి వచ్చి వుంటే పరిస్ఢితి కచ్చితంగా వేరుగా వుండేది. తొలిరోజు అయిదుకోట్ల వరకు షేర్ వచ్చి వుండేది.
సమస్య ఏమిటంటే, హీరోలు ప్రెస్జీజ్ గా ఫీల్ అవుతున్నారు. వెనక్కు వెళ్తే వెళ్లారంటారేమో అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. అందరూ సోలో డేట్ ల కోసం చూస్తున్నారు. 52శుక్రవారాలు వుంటే, 150కి పైగా సినిమాలు తయారవుతుంటే, సోలో డేట్ కష్టమే. అయినా కూడా ప్రయత్నించాలి కానీ పోటీలో దిగితే అనర్థమే.