కామెడీ దారిని వదిలేసి, హీరోగా మారిన సునీల్ కు 2017ఆఖరు తేదీలు టర్నింగ్ పాయింట్ గా లేదా డిసైడ్ పాయింట్ గా మారనున్నాయి. ఈనెల 29న సునీల్ నటించిన టూ కంట్రీస్ సినిమా విడుదల కాబోతోంది.
ఇన్నాళ్లుగా కథలు సరిగ్గా లేక సినిమాలు విజయం సాధించడం లేదు అని అనడానికి చాన్స్ వుంది. కానీ టూ కంట్రీస్ అలా కాదు. మళయాలంలో మాంచి విజయం సాధించిన కథ. కన్నడంలో రీమేక్ అవుతున్న సినిమా. తెలుగులో దాన్నే సునీల్ హీరోగా తీసారు. ఆల్ మోస్ట్ జిరాక్స్ కాబట్టి, కథ, కథనాలకు వంక పెట్టడానికి వుండదు.
కానీ జనాలు సినిమాను ఆదరించకపోతే మాత్రం, అది సునీల్ ఖాతాలోనే పడుతుంది. పైగా సునీల్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. టూ కంట్రీస్ ఫరవాలేదు అని అనిపించుకుంటే, హీరోగా ముందుకు వెళ్లడానికి చాన్స్ వుంటుంది.
అలా కాకుండా అయితే మాత్రం సునీల్ హీరో కెరీర్ ఇక ఇక్కడితో ఆగిపోయే ప్రమాదం వుంది. ఇక అప్పుడు అయినా సునీల్ మళ్లీ తన కామెడీ ట్రాక్ వైపు వెళ్లక తప్పదు. అది ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప సరైన కమెడియన్లు లేరు. కానీ టూ కంట్రీస్ హిట్ అయితే మాత్రం మళ్లీ సునీల్ మనసు హీరో వేషాల వైపే లాగుతుంది.
అందువల్ల సునీల్ ఇటు వెళ్తాడా? అటు వెళ్తాడా? అన్నది టూ కంట్రీస్ తో డిసైడ్ అయిపోతుంది. ఈవారం విడుదలయిన హలో, ఎంసిఎ సినిమాలు రెండో వారం కచ్చితంగా థియేటర్లలో వుండే సినిమాలే.
జనవరి ఫస్ట్ వీక్ లో రాబోయే అజ్ఞాతవాసి ఆ మాత్రం ఈ మాత్రం చులాగ్గా దొరికిన ప్రతి సినిమాను థియేటర్లలోంచి లేపేస్తుంది. మరోపక్క అదే రోజు అల్లు శిరీష్ – ఆనంద్ కాంబినేషన్ లోని ఒక్క క్షణం వస్తోంది. ఇలాంటి టైట్ పొజిషన్ లో టూ కంట్రీస్ విడుదలవుతోంది. మరి సునీల్ లక్ ఎలా వుంటుందో చూడాలి.