సాయిపల్లవికి ఫిదా

అసలే నాని సక్సెస్ ఊపులో వున్నాడు. దిల్ రాజు డిటో డిటో. అలాంటి టైమ్ లో సాయిపల్లవి వీళ్లకు జోడయింది. అంతే సినిమా ఎలా వుంది? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండాఫ్ ఎలా వుంది?…

అసలే నాని సక్సెస్ ఊపులో వున్నాడు. దిల్ రాజు డిటో డిటో. అలాంటి టైమ్ లో సాయిపల్లవి వీళ్లకు జోడయింది. అంతే సినిమా ఎలా వుంది? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండాఫ్ ఎలా వుంది? ఇలాంటివి ఏవీ చూడడం లేదు. సాయిపల్లవిని చూడాలి. ఆమె విరగదీసిన డ్యాన్స్ లు చూడాలి అనేసుకుని ఫిక్సయిపోయారు మాస్ ఆడియన్స్. అంతే ఫస్ట్ డే నే వరల్డ్ వైడ్ గా తొమ్మిదికోట్లకు పైగా వసూళ్లు కురిసాయి ఎంసిఎ సినిమాకు.

సాధారణంగా డివైడ్ టాక్ వచ్చిన సినిమాల తొలిరోజు ఫస్ట్ షో వసూళ్లపై ప్రభావం కనిపిస్తుంది. కానీ ఎంసిఎకు అలా కనిపించకపోగా, రెండోరోజు హలో వచ్చినా ఎంసిఎ జోరు తగ్గలేదు. అయితే ఇదంతా నాని క్రేజ్ అనుకుంటే పొరపాటే.

నానికి ఇప్పుడు కచ్చితంగా మాస్ అండ్ యూత్ హీరో ఫాలోయింగ్ వచ్చింది. అది వాస్తవమే. కానీ మరీ నైజాంలో తొలి రోజే మూడుకోట్లకు పైగా వసూళ్లు అంటే అది నాని ఒంటరిగా సాధించిన ఫీట్ మాత్రం కాదు. కచ్చితంగా సాయిపల్లవికి వచ్చిన ఇమేజ్ కూడా అని అనుకుని తీరాల్సిందే. 

ఎంసిఎలో కూడా సాయిపల్లవి మాస్ డ్యాన్స్ లు విరగదీసింది. ఈ మధ్య కాలంలో మన హీరోయిన్లు ఎవ్వరూ వేయని పక్కా మాస్ స్టెప్స్ హుషారుగా వేసేసింది. అందుకే సినిమా టాక్, మిగిలిన వ్యవహారాలకు దూరంగా సినిమా కలెక్షన్లు వున్నాయి. పైగా రెండు నెలలుగా సరైన సినిమా పడలేదు. జనం మొహం వాచి వున్నారు. అలాంటి టైమ్ స్లాట్ ను పక్కగా కొట్టేసింది ఎంసిఎ. ఆ విధంగా దిల్ రాజు లక్కీ.