భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

పైరసీ భూతం అన్నది టాలీవుడ్ కు పక్కలో బల్లెం మాదిరిగా ఎప్పటి నుంచో వుంది. సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఫోన్ లు చేసి బెదిరిస్తారని. డబ్బులు గుంజుతారని, ఇవ్వకుంటే వెంటనే నెట్ లోకి…

పైరసీ భూతం అన్నది టాలీవుడ్ కు పక్కలో బల్లెం మాదిరిగా ఎప్పటి నుంచో వుంది. సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఫోన్ లు చేసి బెదిరిస్తారని. డబ్బులు గుంజుతారని, ఇవ్వకుంటే వెంటనే నెట్ లోకి ప్రింట్ ప్రత్యక్షమైపొతుందని వార్తలు వినిపిస్తూ వుండేవి. ఇలా అయినా కూడా గతంలో వ్యవహారం వేరుగా వుండేది. సినిమా విడుదలయ్యాక, జనరల్ గా మీడియా ద్వారా పైరసీపై విజ్ఞప్తి చేయడం, సీడీలు వచ్చాయని తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి జరిగేవి.

కానీ ఈ మధ్య పరిస్థితి భిన్నంగా వుంది. ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అంటే దీనివెనుక పైరసీ మీద భయం వుందా? లేక ముందుగానే పైరసీ దారులను భయపెడుతున్నారా? అన్నది అనుమానంగా వుంది. ఈరోజు నిర్మాత దిల్ రాజు రేపు విడుదల కాబోతున్న తన ఎంసిఎ సినిమా విషయమై సైబర్ క్రయిమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రింట్ నెట్ లోకి వెళ్లకుండా చూడాలని కోరారు.

ఈ మధ్య పైరసీకారుల కన్నా యాంటీ ఫ్యాన్స్ తో తలకాయనొప్పి కూడా పెరిగింది. ప్రతి చేతిలో స్మార్ట్ ఫోన్ వుంటోంది. యూట్యూబ్ నిండా ఫేక్ అక్కౌంట్ లే. తమకు కిట్టని హీరో సినిమా కావచ్చు, లేదా తమ సరదాకావచ్చు. మొత్తానికి సినిమాకు డ్యామేజ్ జరిగిపోతోంది. ఇలాంటివి జరుగుతాయని ఊహించడం అన్నది పెద్ద కొత్తదీకాదు, కష్టమూ కాదు. బహుశా అందుకే కావచ్చు, ఇలాంటి వాళ్లను కాస్త కట్టడి చేయడానికే కావచ్చు. ముందుగానే ఫిర్యాదు చేసినట్లున్నారు దిల్ రాజు. 

చిత్రమేమిటంటే, వచ్చేవారం విడుదలయ్యే ఒక్కక్షణం సినిమా గురించి, ఆ చిత్ర కథానాయకుడు అల్లుశిరీష్ కూడా ఈరోజే, సినిమా విడుదలకు వారం ముందే పోలీసులకు ఫిర్యాదు చేసారు.