ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి.. అని ఒక సినీ కవి ఏనాడో చెప్పాడు. శాశ్వత సత్యమిది. తాము మంచి వాళ్లం, తాము ఎంతో నిజాయితీ పరులం, తాము ఎంతో గొప్పవాళ్లం అని చెప్పుకునేందుకు.. అవతల వాళ్లు ఎలా పాఠాలు నేర్వాలో నీతులు చెబుతూ ఉంటారు చాలా మంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ కోవలోకి చెందిన వ్యక్తేనని స్పష్టం అవుతోంది. మొన్నటి వరకూ హడావుడి చేసి వెళ్లిన పవన్ కల్యాణ్ తను సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వకుండానే.. వైసీపీపై, జగన్ పై తనకు తోచిన బురద చల్లి వెళ్లాడు.
చంద్రబాబును తను ఎందుకు సమర్థిస్తున్నానో.. అంటూ పవన్ తనను తాను సమర్థించుకున్న తీరు ఒక ప్రహసనం. అంత ప్రహసనంలా మాట్లాడుతూ కూడా పవన్ తనను తాను సమర్థించుకొంటూ, చంద్రబాబును సమర్థిస్తూ వెళ్లిన తీరు.. అభిమానులకు నచ్చితే నచ్చి ఉండవచ్చు గాక, మిగతా వాళ్లకు మాత్రం నవ్వుకోవడానికి అదో మెటీరియల్ అయ్యింది. అదే అనుకుంటే.. ఇప్పుడు పీకే మరో క్లాసు పీకాడు. ఈసారి తెలుగు ఎంపీలకు అట.
ఏదో ఒక ఇష్యూ విషయంలో పవన్ తెలుగునాడు ఎంపీలు తమిళనాడు నుంచి పాఠాలు నేర్చుకోవాలని ట్వీటాడు. ఇష్యూ ఏదైనా కానీ.. ఇలా చెప్పడం అయితే బాగానే ఉంది. తమిళనాడు నుంచి పాఠాలు నేర్వాలి మనవాళ్లు. అది కేవలం ఎంపీలు మాత్రమే కాదు.. సినీ హీరోలు కూడా. పవన్ కల్యాణ్ కూడా… తమిళనాడు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. అక్కడ ప్రజా సమస్యలపై సినిమా వాళ్లు ఎలా స్పందిస్తారో వేరే వివరించనక్కర్లేదు.
తమిళుల సమస్యల విషయంలో సినిమా వాళ్లు చాలాగొప్పగా రియాక్ట్ అవుతారు. తమిళనాడుకు ఆపద వచ్చినా, తమిళనాడుకు అవసరం వచ్చినా ఆయా సందర్భాల్లో సినిమా వాళ్లు ముందుంటారు. రాజకీయాలకు అతీతంగా స్పందిస్తారు. కావేరీ జలవివాదమా, తమిళ ఈలం సమస్యా, జల్లి కట్టు ఇష్యూనా, తమిళ రైతుల సమస్యా.. ఇలా తేడాలు లేవు. రాజకీయ నేతలే ఆ పనులు చూడాలి, రాజకీయ నేతలే ప్రజా సమస్యల విషయంలో స్పందించాలి అనే హద్దులు లేవక్కడ.
తమిళ రైతుల సమస్యల మీద ఏడాదిన్నర కిందట.. నడిగర్ సంఘం వాళ్లు ఢిల్లీ వెళ్లారు. విశాల్, కార్తీ వంటివాళ్లు అరుణ్ జైట్లీ ముందు చేతులు కట్టుకుని నిలబడి తమ రాష్ట్ర రైతుల సమస్యల గురించి వివరించి చెప్పారు. ఆదుకోవాలని కోరారు. తమిళ హీరోల స్పందనకు అదొక తార్కాణం మాత్రమే. వాళ్ల స్పందనలన్నింటి జాబితాను తయారు చేస్తే అదో చరిత్ర పుస్తకం అవుతుంది.
మరి తెలుగు హీరోలు? ఎప్పుడో దివిసీమ ఉప్పెన అప్పుడు జోలె పట్టాం, మళ్లీ క్రికెట్ మ్యాచ్ లు ఆడి డబ్బులు సేకరించాం.. హుదూద్ అప్పుడు ఆదుకున్నాం.. అంటేకాదు కదా. ఈ మాత్రానికే అయితే.. రాజకీయ నేతలకు హితబోధలు చేసేంత సీన్ ఉన్నట్టా? ఇప్పుడు నీతులు చెబుతున్న పవన్ కల్యాణ్.. ప్రజారాజ్యం పెట్టకముందు.. ప్రజా సమస్యలపై ఎంత స్పందించాడు? అప్పుడు తమిళనటులు స్పందించే తీరు గురించి తెలీదా? ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని విలీనం చేసి మూడునాలుగేళ్లు మాయం అయినప్పుడు ప్రజాసమస్యలు తెలీలేదా? జనసేన పెట్టాకా విరామ సమయాల్లో మాత్రమే ఇవన్నీ గుర్తుకు వస్తుంటాయా? అందరికీ నీతులు చెప్పే పవన్ తన ధర్మం గురించి తనను ప్రశ్నించుకోడా?