తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రోజుకో సారి జూమ్ మీటింగులు, తమ పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ లు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసే వ్యాఖ్యలన్నీ అనుకూల మీడియాలో వార్తలుగా వస్తూ ఉంటాయి.
ఇక ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏమో.. సోషల్ మీడియాకు పరిమితం అవుతూ ఉండటం కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు..అది కూడా టీడీపీ కార్యకర్తల విషయంలో వాళ్ల ఇళ్ల వరకూ వెళ్తూ.. అక్కడ కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు లోకేష్.
ఇదంతా రొటీన్ సీరియలే కానీ.. తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి ఈ మాత్రం హడావుడి చేసే నేతలు కూడా లేకపోవడం విశేషం! ఒకప్పుడు రాయలసీమలో మెజారిటీ సీట్లను నెగ్గిన తెలుగుదేశం పార్టీ, బీసీలు బలంగా ఉన్న చోట కంచుకోటలను కలిగి ఉన్న టీడీపీ తరఫు నుంచి ఇప్పుడు నేతలు కాస్తంతైనా కదలకపోవడం గమనార్హం!
ప్రజల మధ్యకు వెళ్లడం మానేసి చాలా కాలం అయ్యింది తెలుగుదేశం నేతలు. ఇది విశేషం కాదు కానీ, అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బోలెడన్ని సార్లు చెప్పారు, చెబుతూనే ఉంటారు. అయితే చంద్రబాబేమో అవిగో ఎన్నికలు, ఇవిగో ఎన్నికలు అని అంటూనే ఉన్నా.. టీడీపీ నేతలు మాత్రం ఆ దిశగా ఏ మేరకు పని చేస్తున్నారనేది ప్రశ్నార్థకం!
తెలుగుదేశం నేతలు కార్యక్షేత్రానికి దూరం అయిపోయారు. ఎవరెక్కడ సేదతీరుతూ ఉంటారో కానీ.. ప్రజల మధ్య మాత్రం వారు కనిపించి సంవత్సరాలు గడిచిపోయాయి. కేడర్ ను కలుపుకుని పోవడం కూడా లేదు. అధికారం చేజారిన దగ్గర నుంచి ఇక ప్రజలతో కానీ, ప్రజాసమస్యలతో కానీ తమకేం అవసరం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
జగన్ పై వ్యతిరేకత అంశం గురించి కూడా నోటి ప్రచారాలనే నమ్ముకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. చంద్రబాబు నాయుడు పదే పదే ఈ మాట చెబుతూ ఉన్నారు. ఇలా తాము చెబుతుంటే చాలు అనే భావనలో ఉండటం గమనార్హం. జగన్ కు ఒకే ఒక్క అవకాశం ఇచ్చారని, జగన్ కథ అయిపోయిందని.. రోజూ చంద్రబాబు నాయుడు ఈ కామెంట్లే చేస్తూ ఉన్నారు. మరి ఇలా చెప్పేస్తే చాలు అనే భావనే చంద్రబాబు మార్కు రాజకీయం అనుకోవాలి!
అధికారంలో ఉన్నప్పుడూ ఇలాగే వ్యవహరించారు. తమకు తిరుగులేదని, జగన్ ను ప్రజలు ఆదరించే అవకాశమే లేదని, 2019 ఎన్నికల తర్వాత పార్టీని మూసేసుకోవడమే అన్నట్టుగా ఒకటికి వంద సార్లు చెప్పారు. అయితే… గోబెల్స్ ప్రచారాలతో ప్రయోజనం లేదని 2019 ఎన్నికల ఫలితాలతో అయినా టీడీపీకి అర్థం కావాల్సింది. అయితే చంద్రబాబు నమ్ముకున్నది గోబెల్స్ ప్రచారాన్ని మాత్రమే అని ఆయన రాజకీయ చరిత్ర ఆసాంతం చాటి చెబుతూ ఉంది. అన్నీ పక్కన పెట్టి రోజువారీ ప్రచారాన్ని మాత్రమే ఆయన నమ్ముకున్నట్టున్నారు.