కేటీఆర్ దిద్దుబాటు ట్వీట్.. ఇక మంత్రులు తగ్గుతారా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో వైసీపీ నేతలు భగ్గుమన్నారు. కేటీఆర్ పై వరుసపెట్టి విమర్శలకు దిగారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పనిచేసే ఎల్లో మీడియా ఈ…

తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్యతో వైసీపీ నేతలు భగ్గుమన్నారు. కేటీఆర్ పై వరుసపెట్టి విమర్శలకు దిగారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పనిచేసే ఎల్లో మీడియా ఈ అంశాన్ని ప్రముఖంగా ఎత్తుకోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల మధ్య వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగాల్సి వచ్చింది.

గంటల వ్యవథిలోనే తను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నేరుగా క్షమాపణలు చెప్పలేదు కానీ, తన తప్పును ఒప్పుకున్నారు. జగన్ నాయకత్వాన్ని సమర్థించారు. “ఓ కార్యక్రమంలో నేను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే నొప్పిని కలిగించాయి. నిజానికి నేను ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సోదరభావంతో ఉన్నాను. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ వేశారు.

కేటీఆర్ తాజా ప్రకటనతో ఈ వివాదానికి తెరపడుతుందేమో చూడాలి. వివాదాలకు దూరంగా ఉండే కేటీఆర్, ఆఘమేఘాల మీద ఈ ట్వీట్ వెనక మరో బలమైన కారణం కూడా ఉంది. కేటీఆర్ వ్యాఖ్యల్ని తెలంగాణలోని ఓ సెక్షన్ మీడియా వక్రీకరించింది. మరోసారి ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చురేపి, పబ్బం గడుపుకోవాలని కేసీఆర్-కేటీఆర్ భావిస్తున్నారంటూ కథనాలు ప్రత్యక్షమయ్యాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు ఆల్రెడీ ఈ విషయాన్ని ఎత్తుకున్నారు. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు కేటీఆర్.

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అభివృద్ధి కనపడలేదంటే దానికో అర్థం ఉంది, వారి రాజకీయ ఎదుగుదలకు ఆ విమర్శలు అవసరం. కానీ ఏపీలో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను, సచివాలయ వ్యవస్థను కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సైతం గొప్పగా చెప్పుకుంటున్న వేళ, పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ కి అది కనపడకపోవడం విచిత్రం.

పక్క రాష్ట్ర పాలకులు జగన్ పాలనను మెచ్చుకోవాలనే రూలేం లేదు, కానీ సందర్భం లేకపోయినా ఇలా విమర్శించడం మాత్రం సంస్కారం కాదు. అందుకే జగన్ అస్సలు ఆ వ్యవహారంపై స్పందించ లేదు. మాటలతో కాదు, చేతలతోనే ఆయన ఇన్నాళ్లూ ప్రతిపక్షాలకు సమాధానం చెప్పారు, ఇకపై కూడా అలానే చెబుతారు.

ఇక పక్క రాష్ట్రం విషయంలో కూడా జగన్ ది ఇదే ఫార్ములా. అక్కడ అధికార పార్టీకి ఎన్ని సీట్లొచ్చాయి, ఇక్కడ ప్రతిపక్షం ఏమేరకు భూస్థాపితం అయింది అనే విషయం తెలుసుకుంటే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. అది 2018-19లో అయినా.. 2023-24లో అయినా. అందుకే జగన్ గురించి బాగా తెలిసిన కేటీఆర్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలతో ఏపీలోని తన ఫ్రెండ్స్ బాధపడ్డారంటూ తను కూడా పరోక్షంగా బాధపడ్డారు.