ఎమ్బీయస్‌: గుజరాత్‌లో బిజెపికి 116 చదివిస్తారా?

గుజరాత్‌లో మొదటి దశలో 89 స్థానాలలో పోలింగు జరిగింది. ఇవి బిజెపికి కంచుకోటలుగా భావించే సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో ఉన్నాయి. మొత్తం 182లో 2012 ఎన్నికలలో వచ్చిన 116 సీట్లలో యిక్కణ్నుంచి సంపాదించిన సీట్లే…

గుజరాత్‌లో మొదటి దశలో 89 స్థానాలలో పోలింగు జరిగింది. ఇవి బిజెపికి కంచుకోటలుగా భావించే సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో ఉన్నాయి. మొత్తం 182లో 2012 ఎన్నికలలో వచ్చిన 116 సీట్లలో యిక్కణ్నుంచి సంపాదించిన సీట్లే ఎక్కువ. సౌరాష్ట్రలో 58 స్థానాలలో 35 గెలుచుకుంది. కాంగ్రెసు 20 గెలుచుకుంది. 35 స్థానాలున్న దక్షిణ గుజరాత్‌లో బిజెపి 28, కాంగ్రెసు 6 గెలిచాయి. గతంలో కంటె ఎక్కువగా, 150 సీట్ల లక్ష్యంగా గోదాలోకి దిగిన బిజెపి యిప్పుడు తన కంచుకోటలకు బీటలు వారతాయేమోనని బెదురుతోంది.  రెండో విడత పోలింగు 14న. లెక్కింపు 18న.

ఇప్పుడు విశ్లేషకులు 150 సీట్ల గమ్యం చేరుతుందా లేదా అని చర్చించటం లేదు. మొత్తానికి గెలుపు ఖాయమే అయినా గుజరాత్‌ ఓటర్లు గతంలోలా 116 సీట్లు చదివిస్తారా, ఏ 100 వద్ద దగ్గరో ఆపేస్తారా అని చర్చిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన నుంచి సర్వేలలో బిజెపికి వచ్చే ఓట్ల శాతం తగ్గుతూ వస్త్తోంది. ప్రాంతాల వారీగా చూసి సిఎస్‌డిఎస్‌ బిజెపికి కాంగ్రెస్‌పై సౌరాష్ట్రలో 6%, మధ్యగుజరాత్‌లో 1% ఆధిక్యత ఉందంటున్నారు. కాంగ్రెస్‌కి బిజెపిపై ఉత్తర గుజరాత్‌లో 4%, దక్షిణ గుజరాత్‌లో 2% ఆధిక్యత ఉందంటున్నారు. సీట్ల ప్రకారం చూస్తే బిజెపికి కాంగ్రెసు కంటె 10-15 కంటె ఎక్కువ రావని వాళ్ల అంచనా. 

గుజరాత్‌ ఓటరు ఆ పార్టీపై కోపంగా ఉన్నాడని, అయినా సరైన ప్రత్యామ్నాయం కనబడక దానికే ఓటేస్తున్నాడనీ అంటున్నారు. ఎందుకైనా మంచిదని బిజెపి 82 మంది ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లిచ్చింది. కాంగ్రెసుకు సోనియా, రాహుల్‌ కాక మరే లీడరున్నా, స్థానికంగా బలమైన లీడరున్నా పరిస్థితి యింత అధ్వాన్నంగా ఉండేది కాదు. అలాగే మోదీ ప్రధాని గద్దె దిగి వచ్చి గుజరాత్‌లో కాలికి బలపం కట్టుకుని తిరిగి ఉండకపోతే బిజెపి పరిస్థితి యింతకంటె అధ్వాన్నంగా ఉండేది. ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ సైతం తన గెలుపుకోసం శ్రమించవలసిన అవసరం పడింది. ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెసు అభ్యర్థి ఇంద్రనీల్‌ రాజ్యగురు ఆయనను తన నియోజకవర్గంలోనే కట్టిపడేయగలిగాడు. మోదీ సభలకు తప్ప బిజెపి సభలకు జనం రావటం లేదు. 

గుజరాత్‌ మోడల్‌ యావద్భారతానికి ఆదర్శప్రాయం అని ప్రచారం సాగుతూండగా, స్వయంగా ప్రధాని, కేంద్రమంత్రులు యింతలా తిరగడం దేనికి? ఇండియా టుడే ''స్టేట్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌'' రిపోర్టులో యిచ్చిన ర్యాంకింగులో గుజరాత్‌ ఎ్కడుందో చూదాం. 2015-16 డేటా తీసుకుని, పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలుగా విడగొట్టి ర్యాంకులిచ్చారు. గుజరాత్‌ 21 పెద్ద రాష్ట్రాలలో ఒకటి. భారతదేశంలోని విస్తీర్ణంలో 6%, జనాభాలో 5% ఉన్న గుజరాత్‌ స్థానం – శాంతిభద్రతల్లో 1, ఎంటర్‌ప్రెనార్‌షిప్‌లో 2, ఆర్థిక స్థితిలో 3 (దేశ జిడిపిలో 7.4% వాటా దీనిదే), ఆరోగ్యం విషయంలో 3, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విషయంలో 5, టూరిజంలో 6, విద్య విషయంలో 9, వ్యవసాయంలో 10, పరిపాలనలో 13, పర్యావరణం పరిశుభ్రత విషయంలో 15. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించే (ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌) రాష్ట్రాల జాబితాలో 19 వ స్థానం. మొత్తం మీద ర్యాంకింగ్‌లో 4, మొదటిది హిమాచల్‌ ప్రదేశ్‌ (కాంగ్రెస్‌ పాలితం), రెండోది తెలంగాణ (తెరాస పాలితం) , మూడోది కర్ణాటక (కాంగ్రెస్‌ పాలితం), నాలుగోది గుజరాత్‌. 2010-11, 2015-16 మధ్య అన్ని రంగాలను లెక్కవేసి చూస్తే ఎక్కువగా అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఒడిశా (బిజెడి పాలితం).  

మోదీ హయాంలో గుజరాత్‌ వ్యవసాయరంగంలో, నీటిపారుదల రంగంలో పరిస్థితి ఎంతో మెరుగుపడింది. అయినా యిప్పటికీ బిజెపి బలహీనంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లోనే!  అక్కడ 182లో 99 స్థానాలు అక్కడే ఉన్నాయి. 2012లో బిజెపి సగం అంటే 50 గెలిచింది. సెమి అర్బన్‌ స్థానాలు 45 ఉంటే 66% గెలిచింది. అర్బన్‌వి 38 ఉంటే 92% గెలిచింది. 2015 పౌర ఎన్నికలలో కూడా బిజెపి నగర ప్రాంతాల్లో 9% ఆధిక్యతతో, మునిసిపాలిటీల్లో 5% ఆధిక్యతతో ఉండగా గ్రామాల్లో కాంగ్రెసు 4% ఆధిక్యతతో ఉంది. అప్పటికీ యిప్పటికీ బిజెపి గ్రామాల్లో పుంజుకోలేక పోయింది.

సిఎస్‌డిఎస్‌ సర్వే ప్రకారం ఒక దశలో దక్షిణ గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెసు బిజెపి కంటె 2% మాత్రమే (44-42) వెనకబడి ఉంది. సౌరాష్ట్ర గ్రామాల్లో 6% (49-43), మధ్య గుజరాత్‌ గ్రామాల్లో 4% (47-43), ఉత్తర గుజరాత్‌ గ్రామాల్లో 15% (56-41) ఆధిక్యతతో ఉంది.  ఎందుకిలా? హార్దిక్‌ పటేల్‌ మీడియాతో అంటున్నాడు – అహ్మదాబాద్‌లో రివర్‌ ఫ్రంట్‌ చూసి మురిసిపోకండి. నాతో రండి. ఒక్క 50 కి.మీ.ల అవతలకి వెళ్లి చూద్దాం, గ్రామాలు ఎలా ఉన్నాయో అని. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారు. వేరుశెనగ మద్దతు ధర 20 కిలోలకు రూ.1500 చేస్తానని 2014లో వాగ్దానం చేసిన మోదీ 900యే యిస్తున్నాడేం? అని అడుగుతున్నారు రైతులు. గత ఐదేళ్లలో 90 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 

నోట్ల రద్దు కారణంగా గ్రామీణ ప్రజ కుదేలైంది. ఆ తర్వాత జిఎస్‌టి పేరు చెప్పి వ్యాపారస్తులు తమను మోసం చేస్తున్నారని గ్రామీణ వృత్తి పనివారు కోపంగా ఉన్నారు. అలా అని వ్యాపారస్తులు కూడా సంతోషంగా లేరు. అన్ని ప్రాంతాలలోని వ్యాపారస్తులూ జిఎస్‌టి తమ పొట్ట కొట్టిందని ఫిర్యాదు చేస్తున్నారు. మోదీ గుజరాత్‌ వదిలి వెళ్లిన తర్వాత కేంద్రం నుంచి సహాయం అందుతూనే ఉన్నా గ్రామాలు కునారిల్లుతూ వచ్చాయి. పట్టణాలలో కూడా మేన్‌టెనెన్స్‌ సన్నగిల్లుతూ వచ్చింది. మోదీ ఉండగా పరిపాలనపై పట్టు ఉండేది. సిబ్బంది పనితీరుపై నిరంతర నిఘా ఉండేది. ఇప్పుడది పోయిందట. గుజరాత్‌ సమాజం అవినీతి పట్ల పెద్దగా స్పందించదు. ఓ స్థాయిలో ఉన్నంతవరకు ఆమోదిస్తుంది. కానీ యిప్పుడు అది పెచ్చుమీరింది. అధికారులు లంచాలు ఎక్కువగా అడుగుతున్నారని వ్యాపారస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా నగర ప్రాంతాలలోని మధ్యతరగతివాళ్లు, ధనికులు బిజెపి వైపు ఉన్నారు. నగర పేదలు మాత్రం ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. 

హార్దిక్‌ పటేల్‌ పటేల్‌ కులపరమైన పోరాటం చేస్తున్నా, అతను లేవనెత్తిన సమస్యలు అన్ని కులాల వారికి వర్తించేట్లా ఉన్నాయి. ప్రభుత్వ విద్య నాణ్యత లేకపోవడం, ప్రయివేటు విద్య మరీ ఖరీదై పోయి అందుబాటులో లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, వ్యవసాయం, వ్యాపారం రెండూ దెబ్బ తినడం యివి ప్రతి ఒక్కరినీ బాధించాయి. గుజరాత్‌ సమాజం వ్యాపారస్తుల సమాజం. ఏ కులానికి చెందినవారైనా సరే, వ్యాపారంపై ఆధారపడతారు. గత 50 ఏళ్లగా వాళ్లు చదువుపై శ్రద్ధ పెట్టడం మానేశారు. వడోదరా వంటి నగరాలలో తప్ప మంచి విద్యాలయాలు, విద్యాప్రమాణాలు తగ్గిపోయాయి. రాష్ట్రానికి బయట ఉన్న గుజరాతీలలో విద్యాధికులు కనబడిన నిష్పత్తిలో రాష్ట్రంలో నివసిస్తున్న గుజరాతీలలో విద్యాధికులు కనబడరు.

అందువలన వారికి ఉద్యోగాలు రావడం మానేశాయి. గుజరాత్‌లో పెట్టుబడులు వచ్చి, ఉద్యోగాల సృష్టి జరిగినా అవి యితర ప్రాంతాల వాళ్లు ఎగరేసుకుని పోతున్నారు. సగటు గుజరాతీ ఉద్యోగాల కోసం అల్లాడవలసి వస్తోంది. తక్కువ సాంకేతిక గల చిన్న ఉద్యోగాలలో కుదురుకోవలసి వస్తోంది. చదువు ప్రాముఖ్యత గుర్తించి, ప్రయివేటు విద్యాలయాలకు వెళదామంటే అవి అందుబాటులో లేవు. హార్దిక్‌ పటేల్‌ పాల్గొన్న ఒక సమావేశంలో ఒకరు 'గుజరాత్‌లో నిరుద్యోగ సమస్య ఉంటే యితర ప్రాంతాల వారు యిక్కడికి ఉద్యోగాలకై ఎలా రాగలుగుతున్నారు?' అని అడిగారు. హార్దిక్‌ కౌంటర్‌ ప్రశ్న అడిగాడు – 'సమస్య లేకపోతే ఒక్క ప్రభుత్వోద్యోగానికి వేలాది మంది ఎందుకు అప్లయి చేస్తున్నారు?' అని. 

సమస్యేమిటంటే గుజరాతీలకు ఉద్యోగాలు రావటం లేదు. వాళ్లు చిన్నా, చితకా వ్యాపారాలు చేసి బతకాల్సి వస్తోంది. గుజరాత్‌లో ఏ డిపార్టుమెంటులోనూ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండదు. బిల్లులు లేకుండానే కోట్లాది వ్యాపారాలు సాగుతాయి. అధికారికి డబ్బు యిచ్చి పని నడిపించేసుకోవడం వాళ్లకు అలవాటు. స్వభావరీత్యా వ్యాపారగుణం ఉంది కాబట్టి, వ్యవస్థతో పేచీ పెట్టుకోరు. ప్రతిఘటించరు, సర్దుకుపోతారు. అందుకే అక్కడ కార్మిక యూనియన్లు ఉండవు. ప్రజాఉద్యమాలు ఉండవు. 1973లో విద్యార్థులు నవనిర్మాణ్‌ పేర అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించారు. చివరకు అది కాంగ్రెసు వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది తప్ప వ్యవస్థ మారలేదు. 1985లో మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా జరిగినది పూర్తిగా కులపరమైనది.

అక్కడి అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించి తీరాలని పట్టుబట్టరు. ఆ కారణం చేతనే వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు గుజరాత్‌కు క్యూ కడతారు. బిజెపి కాదు, కాంగ్రెసు కాదు, వేరే ఏ పార్టీ ఉన్నా సరే, గుజరాతీ సమాజమే అలాటిది. అక్కడ మానవహక్కులకు విఘాతం కలిగిందని బయటివాళ్లు వచ్చి ఉద్యమం చేయాలి తప్ప వాళ్లకు పట్టదు. ఇక్కడి గుజరాతీలే కాదు, అమెరికా, తదితర దేశాల్లో స్థిరపడిన గుజరాతీ వ్యాపారస్తులు కూడా ఆ దేశపు పన్నులు ఎలా తగ్గించాలో, ఎలా తప్పించుకోవాలో ఉపాయాలు చెప్పగలరట. కష్టపడే స్వభావానికి, యిలాటి ఉపాయాలు తోడై వాళ్లు అతి త్వరలో ఐశ్వర్యవంతులై పోతూ ఉంటారు.

ఇటువంటి వ్యాపారకేంద్రిత సమాజంపై వ్యాపారపరమైన ఆంక్షలు విధిస్తే వాళ్లెంత భగ్గుమంటారో ఊహించండి. జిఎస్‌టికి వ్యతిరేకంగా తమిళ సినిమాల్లో డైలాగులు పెడుతూంటే జనాలు చప్పట్లు కొడుతున్నారు. వ్యాపారమే జీవనాడిగా కలిగిన గుజరాతీ సమాజం ఆ డైలాగులు గుజరాతీలో వింటే మరింత గట్టిగా చప్పట్లు కొట్టేది. అందుకే జిఎస్‌టిని గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌ అని వర్ణించిన రాహుల్‌ వాళ్లకు నచ్చాడు. ఇప్పటిదాకా ఎక్కడా ఆమోదం పొందని రాహుల్‌ గుజరాత్‌లో ఆదరణ పొందుతున్నాడు. అతని సభలకు జనం వస్తున్నారు. అతని మాటలు వింటున్నారు.

అతను చేసే తప్పులకు గతంలోలా పగలబడి నవ్వకుండా అతని సరిదిద్దాలని చూస్తున్నారు. రాహుల్‌ ప్రచారశైలి కూడా మారింది. జనంలో ఎక్కువగా తిరుగుతున్నాడు. బిజెపి కాంగ్రెస్‌-ముక్త్‌ భారత్‌ అని పిలుపు నిచ్చింది కదా, మీరు బిజెపి ముక్త్‌ -భారత్‌ అని పిలుపు నివ్వండి అని వడోదరాలో యువకులు అడిగారు. ప్రజాస్వామ్యంలో బిజెపి కూడా భాగమే. నేనలా అనను అన్నాడు రాహుల్‌. బిజెపి నాయకులది అహంకారం, నాది ఎవరైనా చెప్తే వినే తత్త్వం అని చెప్పుకుంటూ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని సభలకు స్పందన బాగానే వస్తోంది. 

బిజెపి వ్యతిరేక సంకేతాలు చూసి కాబోలు రాహుల్‌కు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి తలపెట్టారు. అధ్యక్షుడైనంత మాత్రాన రాహుల్‌కు హఠాత్తుగా తెలివితేటలు వచ్చేయవు. కానీ వెంటనే వచ్చే గుజరాత్‌ ఫలితాలలో అమిత్‌ షా ముందనుకున్నట్లు వాళ్లకు 150, కాంగ్రెసుకు 30 వస్తే రాహుల్‌ పరువు పోతుంది. బిజెపిని ఏ 100 దగ్గరో ఆపగలిగితే రాహుల్‌ కారణంగానే యీ అద్భుతం జరిగిందని డప్పు కొట్టుకోవచ్చు. ఆ అవకాశం ఉందని వాళ్ల సర్వేలు చెప్పినట్లున్నాయి. బిజెపికి ఉన్న సేవాదళం ఆరెస్సెస్‌ కాంగ్రెసుకు లేదు. ఓటర్లను బూతులకు రప్పించే నిర్మాణం లేదు. గుజరాత్‌లో యితర రాష్ట్రాల వారు ఎక్కువగా ఉద్యోగాలకు వచ్చిన విషయం గమనించి, ఆ యా ప్రాంతాల నుంచి వాలంటీర్లను రప్పించి, ప్రచారం చేయిస్తోంది. బిజెపి కూడా రాహుల్‌  పరువు తీయడానికి యిటీవల ఎన్నికలలో అమేఠీలో గెలిచిన పంచాయితీ అభ్యర్థులను రప్పించింది. 

'పాస్‌'లోంచి సగానికి సగం మంది నాయకులను బిజెపి గుంజుకున్నా, హార్దిక్‌ పటేల్‌ కొరకరాని కొయ్యగా మారాడు. అతనిపై సిడి విడుదలయ్యింది. ఆ సిడి నిజమే అనుకుందాం. హార్దిక్‌ ఆ అమ్మాయిని బలాత్కారం చేయడం లేదు కదా! ఇద్దరు విల్లింగ్‌ అడల్ట్‌స్‌ మధ్య నడిచినది బయటపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడ మేమిటి? అతనేమీ పదవిలో లేడు, బదిలీకై అడగడానికి వచ్చిన టీచర్ను ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో లొంగదీసుకున్నాడు అనడానికి. అతను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప యిలాటి నీచమైన కుట్రలకు దిగి లాభమేమిటి? ఎన్నికలలో గెలుపుకై ఎంత నీచానికైనా దిగజారుతున్నారంటే ఎక్కడో అభద్రతా భావం ఉన్నట్టే తోస్తోంది.

అది విడుదలైన మర్నాడే హార్దిక్‌ పెట్టిన సభకు 10 వేల మంది వచ్చారు, దానిలో 10 మంది అమ్మాయిలు వచ్చి అతనికి తిలకం దిద్దారు. అతను సిడి గురించి మాట్లాడుతూ, ''24 ఏళ్ల అవివాహితుడిపై సిడి తయారుచేసే బదులు తమ 22 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో దానిపై సిడి తయారుచేసి విడుదల చేయాల్సింది'' అని ఎద్దేవా చేశాడు. తర్వాత కూడా హార్దిక్‌ పెద్ద సభలకు 40 వేల మంది దాకా జనం వస్తూనే ఉన్నారట. అతని ఆందోళన ధర్మమాని కాంగ్రెసు ఎన్నడూ లేనిది 47 మంది పటేళ్లకు సీట్లిచ్చింది. బిజెపి 53 మందికి యిచ్చింది. 

బుల్లెట్‌ ట్రైన్‌ అక్కర లేకపోతే ఎద్దుబండి ఎక్కండి అని ఎద్దేవా చేసిన ఎట్టకేలకు మోదీ గ్రామీణ ప్రాంతాలపై, అసంతృప్త వర్గాలపై దృష్టి పెట్టాడు. మానిఫెస్టో లేకుండా నెట్టుకొచ్చిన బిజెపి చివరకు శనివారం తొలివిడత పోలింగు అనగా శుక్రవారం నాడు 'నవ గుజరాత్‌' అంటూ విడుదల చేసింది. ఆగ్రహంతో ఉన్న రైతులను ఊరడించడానికి అనేక తాయిలాలు, విద్యాప్రమాణాలను పెంచుతాననడం, ఎస్సీ విద్యార్థులకు కొత్త హాస్టళ్లు కడతాననడం వంటివి చేర్చింది. పటేళ్ల రిజర్వేషన్‌ గురించి చాలాకాలం మాట్లాడని మోదీ దాని గురించి మాట్లాడవలసి వచ్చింది. రిజర్వేషన్‌ 50% కంటె ఎక్కువ సాధ్యం కాదని తెలిసీ కాంగ్రెసు పటేళ్లను మోసం చేస్తోంది అన్నాడు. మరి బిజెపి భాగస్వామిగా ఉన్న ఆంధ్ర ప్రభుత్వం కాపులవిషయంలో ఏం చేసింది? రిజర్వేషన్‌ యిస్తామనగానే యిది రాజ్యాంగరీత్యా అసాధ్యం అని మోదీ వారించలేకపోయాడా? 

ఇలాటి పరిస్థితుల్లో మొదటి దశలో 68% ఓటింగు నమోదైంది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంటే ఓటింగు యింకా ఎక్కువ ఉండాలనే వాదన ఉంది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ఓటర్లలో నిరాసక్తత కలిగి ఓటింగు తక్కువగా ఉండవచ్చు. గుజరాత్‌లో బిజెపి గెలవదని ఎవరూ అనలేరు. మెజారిటీ గుజరాతీలు మోదీ వారసుల పట్ల, సలహాదారుల పట్ల కోపంగా ఉన్నారు కానీ మోదీని యింకా ఆరాధిస్తున్నారనే చెప్తున్నారు. గుజరాత్‌లో బిజెపిని ఓడించి మోదీ పరువు తీసే ఉద్దేశం వారికి లేదు, కానీ అసంతృప్తిని వెల్లడించాలనీ అనుకుంటున్నారట. తమ అసంతృప్తి కొద్దిగా వ్యక్తం చేస్తేనే జిఎస్‌టిలో మార్పులు చేశారు కదా, ఓటింగులో కూడా ఓ ఊపు ఊపితే మోదీకి తెలిసి వస్తుందని గుజరాతీ ఓటర్లు అనుకుని, మెజారిటీని గణనీయంగా తగ్గింవచ్చు అనే ఆలోచనే ప్రబలంగా ఉంది. పొట్ట మీద కొట్టకుండా వీపు మీద కొడతారన్నమాట! కానీ అది కూడా జరగకుండా చేయడానికి మోదీ సర్వాస్త్రాలూ ప్రయోగిస్తున్నాడు. 

వాటి గురించి ''గుజరాత్‌ ఎన్నికలు – ముస్లిం ఫాక్టర్‌'', ''గుజరాత్‌ ఎన్నికలు – మోదీ ఆరోపణలు''లో చర్చిద్దాం. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
[email protected]