బొత్సగారు విద్యాశాఖ మంత్రేనా?

బొత్స సత్యనారాయణ కొత్తగా విద్యాశాఖను చేపట్టిన తర్వాత చాన్నాళ్లకు మీడియాలో కనిపించారు. కొత్త మంత్రులకు శాఖలు అప్పగించిన వెంటనే.. ముఖ్యమంత్రి నిర్వహించిన విద్యాశాఖ సమీక్ష సమావేశానికి బొత్స డుమ్మా కొట్టారు. తాజాగా సీఎం పెట్టిన…

బొత్స సత్యనారాయణ కొత్తగా విద్యాశాఖను చేపట్టిన తర్వాత చాన్నాళ్లకు మీడియాలో కనిపించారు. కొత్త మంత్రులకు శాఖలు అప్పగించిన వెంటనే.. ముఖ్యమంత్రి నిర్వహించిన విద్యాశాఖ సమీక్ష సమావేశానికి బొత్స డుమ్మా కొట్టారు. తాజాగా సీఎం పెట్టిన సమావేశానికి మాత్రం వచ్చారు. విద్యాశాఖ ఇవ్వడం పట్ల ఆయనలో ఏమైనా అసంతృప్తి ఉన్నదేమో అనే అనుమానం ఎవరికైనా ఉంటే.. అది దూరమైనట్టే.

అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన ఏపీలోని ఇబ్బందులకు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో వాస్తవ పరిస్థితుల గురించి సరైన అవగాహన లేకుండా, ఎవరో తన మిత్రులు చెప్పారంటూ.. పొరుగు రాష్ట్రాన్ని చులకన చేసేలా బాధ్యతగల స్థాయిలో ఉన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీనికి బొత్స కౌంటర్ ఇచ్చారు. 

హైదరాబాదులోనే కరెంటు లేదని.. ఆయన ఎవరో చెబితే విన్నారని, తాను స్వయంగా చూసి వచ్చానని బొత్స తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఇన్నాళ్లూ ఏదో పర్సనల్ పనుల్లో ఉన్నారని అనుకున్నప్పటికీ.. తాజాగా సీఎం సమీక్ష సమావేశాలకు, మీడియా ముందుకు వచ్చిన తర్వాత.. విద్యాశాఖను ఓన్ చేసుకున్నట్టుగా కనిపించడం లేదే.. అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. 

పదోతరగతి పరీక్షల నిర్వహణ భ్రష్టుపట్టిపోతోంది. వరుసగా.. ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. లీక్ అయిన ప్రశ్నపత్రాలు ఒక జిల్లాలో వైసీపీ నాయకుల గ్రూపులో షేర్ కావడం హైలైట్ చేస్తూ.. మీడియాలో కథనాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రశ్నపత్రాలు లీకైనా, మరే ఇతర తప్పు జరిగినా.. అందుకు కారకులు కిందిస్థాయిలో ఎవ్వరైనా సరే.. వెంటనే ఆ తప్పును భూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వానికి, వీలైతే ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టేయడానికి పచ్చమీడియా అత్యుత్సాహం కనబరుస్తూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. 

మీడియా సంగతి ఎటు పోయినా.. ప్రశ్నపత్రాలు లీకైన మాట వాస్తవం. అవి పరీక్షలు మొదలైన చాలా తక్కువ వ్యవధిలోనే గ్రూపుల్లో షేర్ కావడం ఘోరం. బాధ్యతగల విద్యాశాఖ మంత్రి గారు ఈ వ్యవహారం గురించి మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మూసకొట్టుడుగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అనే మాట అయినా.. మంత్రి చెప్పి ఉంటే బాగుండేది. అయితే ఇదేమీ పట్టనట్టుగా బొత్స వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటివి జరిగినప్పుడే.. తనకు అప్రధాన శాఖ కట్టబెట్టారనే అసంతృప్తితో బొత్స సత్యనారాయణ రగిలిపోతున్నారనే పుకార్లు ప్రచారం చేసేవారికి ఊతమిచ్చినట్టుగా ఉంటుంది. బొత్స గారు తనకు తోచిన మాటల దాడులు చేయడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలతో తన మీద విరుచుకుపడతారో కూడా గమనించుకుంటూ అడుగులు వేయాలి కదా అని పలువురు అనుకుంటున్నారు.