ఎక్కడయినా బావే కానీ వంగ తోట దగ్గర కాదు అన్నట్లే వుంది ఆంధ్ర జనాల వ్యవహారం. ఆంధ్ర జనాలకు హైదరాబాద్ తో బంధం ఈనాటిది కాదు, ఏనాటికీ తెగిపోదు. ఆస్తుల బంధం, వ్యాపార బంధం, ఉద్యోగ బంధం ఇలా చాలా వున్నాయి. వీటిని కాదని అడుగు ముందుకు పడదు.
అందులో రాజకీయ నాయకులకు మరీనూ. దాదాపుగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లేని రాజకీయ నాయకులు వుండరు. వాళ్లందరికీ హైదరాబాద్ లో ఆ బంధాలు గట్టిగా వుంటాయి. అందుకే పెద్దగా మాట్లాడలేరు.
అది చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ మీదుగా వైకాపా నాయకుల వరకు. ఇక సినిమా జనాల సంగతి సరేసరి. ఎందుకు వచ్చిందో, ఏ సందర్భంలో వచ్చిందో మొత్తానికి ఆంధ్ర పరిస్థితుల మీద తెలంగాణ అధికార పక్ష కీలక నేత కేటీఆర్ కొన్ని కామెంట్లు చేసారు. తప్పని సరిగా ఆంధ్ర వైకాపా నాయకులు కౌంటర్ ఇవ్వాల్సిందే.
కానీ ఇక్కడే సమస్య. గట్టిగా కౌంటర్ ఇస్తే కేటీఆర్ కు కోపం వస్తుంది. ఇవ్వకుంటే జగన్ ఏమంటారో? అందుకే వీలయినంత సుతి మెత్తగా, కౌంటర్ ఇచ్చామంటే ఇచ్చినట్లు వుండేలా జాగ్రత్త పడ్డారు. ఏం చేస్తాం ఆంధ్ర జనాల వీక్ నెస్ హైదరాబాద్.
ఇక్కట కొసమెరుపు ఏమిటంటే కేటీఆర్ నేరుగా ఆంధ్ర పాలన మీద విమర్శ చేసిన నాడే కొత్తగా మంత్రి అయిన నటి రోజా నేరుగా కేసీఆర్ ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం.