పవ’నిజాలు’: సినిమాలు వదిలేస్తా

వైజాగ్, రాజమండ్రి, విజయవాడ.. ఇలా స్థలం మారినా పవన్ కల్యాణ్ మాట మారడం లేదు. తను పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన జనసేన అథ్యక్షుడు.. ఈసారి పూర్తిగా సినిమాలు వదిలేస్తున్నానని అంటున్నాడు. Advertisement “మీ…

వైజాగ్, రాజమండ్రి, విజయవాడ.. ఇలా స్థలం మారినా పవన్ కల్యాణ్ మాట మారడం లేదు. తను పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన జనసేన అథ్యక్షుడు.. ఈసారి పూర్తిగా సినిమాలు వదిలేస్తున్నానని అంటున్నాడు.

“మీ అందరి ఆశీస్సులు కావాలి. ముఖ్యమంత్రి అయిపోవాలని ఈ మాట చెప్పట్లేదు. అధికారం కోసం ఇలా అనట్లేదు. ఇకపై మీతోనే ఉంటాను. అందుకే మీ ఆశీస్సులు కావాలి. కేవలం ట్విట్టర్ వరకే పరిమితమైపోయాడని కొందరు అంటున్నారు. ఈసారి సినిమాలు వదిలేస్తున్నాను. మీ కోసం వస్తున్నాను.” సినిమాలపై పవన్ అభిప్రాయమిది.

అజ్ఞాతవాసి సినిమాను విడుదలకు సిద్ధంచేశాడు పవన్. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేస్తాడనే ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు ఏఎం రత్నం సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టాడు. మరి ఈ రెండు సినిమాల పరిస్థితేంటి? పవన్ నిజంగానే సినిమాలు మానేస్తాడా..? లేదా ఎప్పట్లానే మానేస్తానని చెబుతూనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటాడా..?

నిజానికి “సినిమాలు మానేస్తా” అని పవన్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం కాదు. సర్దార్ గబ్బర్ సింగ్ కాలం నుంచే చెబుతున్నాడు. అప్పుడు నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇదే ఆఖరి సినిమా కావొచ్చంటూ ప్రకటనలు కూడా చేశాడు. కానీ ఆ తర్వాత కాటమరాయుడు సినిమా చేశాడు. తాజాగా అజ్ఞాతవాసి మూవీ కూడా చేశాడు. 

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి ఫ్లాపులతో కాకుండా.. బహుశా ఓ మంచి హిట్ ఇచ్చి సినిమాల నుంచి తప్పుకోవాలని పవన్ భావిస్తున్నాడేమో. పవన్ మనసులో ఇదే కనుక ఉంటే అజ్ఞాతవాసి హిట్ అయితే అతడు సినిమాల నుంచి తప్పుకోవడం ఖాయం. ఒకవేళ ఇది అతడి ఆలోచన కాకపోతే ఎప్పట్లానే ఒట్టుతీసి గట్టున పెట్టి మరో సినిమా చేయడం కూడా ఖాయం. ఎటొచ్చి పవన్ సినిమాలు మాత్రం ఆపడని అంటున్నారు చాలామంది.

రాజకీయాల్ని పక్కనపెడితే, పరిశ్రమ వర్గాలు మాత్రం పవన్ మరో సినిమా చేస్తాడనే అంటున్నాయి. పవన్ సన్నిహితులతో పాటు బడా నిర్మాతలు కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. తన ప్రసంగాల్లో 'సినిమాలు వదిలి వచ్చేస్తున్నా' అని పవన్ చెబుతున్న ప్రతిసారి కార్యకర్తలంతా వద్దు..వద్దు అని కేకలు వేయడం కామన్ అయిపోయింది.