ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకోసం, సినిమాలకు దూరమవడానికి తాను సిద్ధమేనని ప్రకటించేశారు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్. అంటే, ఇకపై పవన్‌కళ్యాణ్ నుంచి కొత్తగా సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళకపోవచ్చన్నమాట. త్వరలో విడుదల కానున్న 'అజ్ఞాతవాసి' సినిమా పవన్‌కళ్యాణ్‌కి ఆఖరి సినిమా అయ్యే ఛాన్సులున్నాయి. అలాగని పూర్తిగా పవన్‌కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేయకపోవచ్చు. ఎందుకంటే, చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వెళ్ళారు, సినిమాలకు 'బ్రేక్' ఇచ్చారు.. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత, సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చారు.
'నాలాగా నా తమ్ముడు పవన్‌కళ్యాణ్ చేయడనే అనుకుంటున్నాను. నాకంటే సమర్థుడు పవన్‌కళ్యాణ్. సినిమాల్ని, రాజకీయాల్ని బ్యాలన్స్ చేసుకోగలడు..' అని ఓ సందర్భంలో పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి, చిరంజీవి వ్యాఖ్యానించిన విషయం విదితమే. అయితే, అన్నయ్య మాటలకి తమ్ముడు ఎంత విలువ ఇస్తాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అయినా, పవన్ ఏనాడూ సినిమాల్ని సీరియస్‌గా తీసుకోలేదు. 'ఇక సినిమాలు చేయకూడదు' అని పవన్ చాలా సందర్భాల్లో అనుకున్నాడు. మాట మీద నిలబడే వ్యక్తి కాదు కదా, అందుకే మాట అనుకుంటాడు.. దాన్ని వెనక్కి తీసుకుంటాడు. సినిమాల్లో వున్నప్పుడు అది ఆయన ఇష్టం. కానీ, రాజకీయాల్లో అలా కుదరదు. మాటంటే ఆ మాట మీదే నిలబడాలి. అఫ్కోర్స్, మాట మీద నిలబడ్తామని చెప్పేవారెవరూ ఆ మాట మీద నిలబడినట్లు ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ కన్పించరనుకోండి.. అది వేరే విషయం.
మొత్తమ్మీద, సినిమాలు చేయబోనంటూ పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అభిమానులు ఒకింత డిజప్పాయింట్ అయ్యారన్నది నిర్వివాదాంశం. అయినా, పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి.. అప్పుడు మిగతా విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికైతే వరుసగా మూడు రోజులు రాజకీయ తెరపై కన్పించి పవన్ బాగా అలసిపోయాడాయె. మళ్ళీ ఎన్నాళ్ళకో ఈ భాగ్యం.! ఆ గ్యాప్‌లో పవన్‌కళ్యాణ్ ఎంచక్కా ఇంకో సినిమా చేసేసుకోవచ్చు.