సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నట్లు వుంది ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా బయ్యర్ల పరిస్థితి. కనీవినీ ఎరుగని రేట్లకు సినిమాను కొన్నారు. ఎలాగూ ప్రభుత్వం అనుకూలంగా వుంటుంది కాబట్టి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పదిరోజుల పాటు యూనిఫార్మ్ రేటు 200అమ్మేసుకోవచ్చు, చిన్న సెంటర్లలో 100అమ్మేసుకోవచ్చు అన్న ధీమా వుంది.
ఇదిలావుంటే ఇప్పుడు పవన్ లోని రాజకీయ నాయకుడు బయటకు వచ్చారు. వచ్చి ఖాళీగా కూర్చోకుండా, వైకాపా నేత జగన్ పై ఆయనకు తోచని విమర్శలు చేసేసారు. పనిలో పనిగా అల్లు అరవింద్ పైన తనకు ఎప్పటి నుంచో లోపల వున్న కోపాన్ని కక్కేసారు.
ఎంత చెడ్డా, వైకాపా అనే పార్టీకి ఎంతో కొంత మంది అభిమానులు వుండకుండా పోరు. అలాగే అల్లు అరవింద్ కొడుకు బన్నీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే వుంది. బన్నీకి పవన్ ఫ్యాన్స్ కు ఎప్పటి నుంచో కుదిరి చావడం లేదు. ఇప్పుడు అది మరింత పెరిగింది. సో బన్నీ ఫ్యాన్స్ కూడా కాస్త అలిగారు. ఇక సినిమా అన్నాక ఏంటీ హీరోల ఫ్యాన్స్ తో సమస్య వుండనే వుంటుంది.
ఇప్పుడు ఇవన్నీ కలిసి అజ్ఞాతవాసి కలెక్షన్ల మీద ఫ్రభావం చూపిస్తాయేమో? అని బయ్యర్లు భయపడుతున్నారు. సినిమా బాగుంటే హీరోతో సంబంధం లేకుండా చూస్తారని చెప్పడం వరకు సులువే. కానీ బి, సి సెంటర్లలో ఇవ్వాళ పైరసీని అరికట్టడం అన్నది అంత సులువు కావడం లేదు. ప్రతి చేతి లోనూ స్మార్ట్ ఫోన్ నే.
రాజకీయంగా పవన్ అంటే వున్న వ్యతిరేకతతో థియేటర్లకు వెళ్లకుండా సీడీల కోసం వెదికితే ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడుతుంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఫరవాలేదు. లేదూ కాస్త టాక్ ఏమాత్రం తగ్గినా, ఈ ఏంటీ వ్యవహారం మరింత జోరు అందుకుంటుంది. ఇదంతా కలిపి కలెక్షన్లపై ఫ్రభావం చూపించే ప్రమాదం వుంది.
ఈ టైమ్ లో పవన్ బయటకు రాకుండా వుండాల్సిందని, సినిమా విడుదలయిపోయిన తరువాత ఎక్కడికి వచ్చినా, ఏం మాట్లాడినా ఫరవాలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
చూడాలి వచ్చేనెల 10తరువాత పరిస్థితి ఎలా వుంటుందో? ఒక్క అమెరికాలోనే అయిదు మిలియన్ల డాలర్లు వసూలు చేస్తే తప్ప గట్టెక్కినట్లు కాదని, విడుదలకు భారీగా థియేటర్లు వేయడం వల్ల మూడుకోట్ల వరకు ఖర్చులే అవుతాయని కూడా అంటున్నారు. ఈ పొలిటికల్ స్పీచ్ ల ప్రభావం ఓవర్ సీస్ లో కూడా గట్టిగా వుంటుందని టాక్ వినిపస్తోంది.