సినిమా రివ్యూ: మళ్ళీ రావా…

రివ్యూ: మళ్ళీ రావా… రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తారాగణం: సుమంత్‌, ఆకాంక్ష సింగ్‌, అన్నపూర్ణ, అభినవ్‌, మిర్చి కిరణ్‌, ప్రీతి ఆస్రాని తదితరులు సాహిత్యం: కృష్ణకాంత్‌ కూర్పు: సత్య గిదుటూరి సంగీతం:…

రివ్యూ: మళ్ళీ రావా…
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: సుమంత్‌, ఆకాంక్ష సింగ్‌, అన్నపూర్ణ, అభినవ్‌, మిర్చి కిరణ్‌, ప్రీతి ఆస్రాని తదితరులు
సాహిత్యం: కృష్ణకాంత్‌
కూర్పు: సత్య గిదుటూరి
సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌
ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల
నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా
రచన, దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి
విడుదల తేదీ: డిసెంబర్‌ 8, 2017

పధ్నాలుగేళ్ల వయసులో ప్రేమలో పడ్డ జంట, పరిస్థితుల కారణంగా విడిపోయి మళ్లీ పదమూడేళ్లకి కలుస్తారు. స్పర్ధలన్నీ తొలగిపోయి ఒక్కటవుతారు కానీ మళ్లీ ఇద్దరూ విడిపోతారు. అమ్మాయికి పెళ్లి కుదుర్తుంది. అబ్బాయి ఉద్యోగ రీత్యా విదేశాలకి బయల్దేరే పనుల్లో వుంటాడు. ఇద్దరూ మరోసారి తారసపడతారు. అప్పుడేం జరుగుతుంది? దర్శకుడు గౌతమ్‌ రాసుకున్న కథ స్ట్రెయిట్‌గా చెప్పుకుంటే ఇదే. కానీ ఇలా చెప్తే ఈ కథలో కొత్తదనం ఎక్కడుందనిపిస్తుంది? అందుకే ఈ మూడు టైమ్‌ ఫ్రేమ్స్‌ తీసుకుని 'బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌' స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో కథ అల్లాడు. ఈ టెక్నిక్‌ కూడా మనకి కొత్తేమీ కాదు. 'సఖి' చిత్రంలోనే మణిరత్నం ఈ పద్ధతిలో ఒక ప్రేమకథని చెప్పాడు. 

ఇలాంటి ప్రేమకథలు చెబుతున్నపుడు ఆ జంటతో ఎమోషనల్‌ కనక్ట్‌ ఏర్పడడం తప్పనిసరి. లేదంటే వారితో ట్రావెల్‌ చేయడం కష్టం. దర్శకుడు ఎంచుకున్న 'బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌' టెక్నిక్‌ ఆరంభంలో గాడి తప్పింది. మరీ తరచుగా టైమ్‌ ఫ్రేమ్స్‌ మారిపోతూ మూడు సందర్భాల్లో జరిగిన సంఘటనలు కలబోతగా ముందుకు సాగుతుంటాయి. 

మూడు కాల పరిణామాలని కలిపి కథనం నడిపించడమే కాస్త కన్‌ఫ్యూజన్‌తో కూడిన సంగతి అయితే, ఇద్దరు నెరేటర్స్‌కి ఆ కథని సమాంతరంగా చెప్పే పని అప్పగించాడు. హీరో కోణంలో మొదలయ్యే కథలోకి కాసేపటికి హీరోయిన్‌ నెరేషన్‌లోకి షిఫ్ట్‌ అవుతుంది. ఇటు హీరో, అటు హీరోయిన్‌ ఇద్దరూ కలిసి మూడు దశల్లోని తమ ప్రేమకథని, తమ అనుభూతులని, ఆలోచనలని ఏకరవు పెడుతుంటే 'ఫాలో' అవడం కాస్త కష్టమైన విషయమే.

ఈ ప్రేమజంటని ఇనీషియల్‌గా సీరియస్‌గా తీసుకునే వీల్లేకుండా తొమ్మిదో తరగతిలోనే సీరియస్‌గా లవ్‌లో పడతారు. ఆ ఏజ్‌ పిల్లల మధ్య అట్రాక్షన్‌ పేరెంట్స్‌తో పాటు పరిణితి వున్న ఏ ఒక్కరూ హర్షించరు. ఈ ఏజ్‌ గ్రూప్‌లోని అఫెక్షన్‌ని వీలయినంత కుదించి, మధ్యలో ఈ జంట మధ్య వున్న అనుబంధం మీద, వారు దూరం కావడం వెనుక కారణాల మీద ఎక్కువ ఫోకస్‌ వుంచాల్సింది. కానీ చిన్నతనంలోని వారిద్దరి అనుబంధంపై దర్శకుడు మరీ ఎక్కువ ప్రేమ చూపించాడు. ఆ ఎపిసోడ్‌ అవసరానికి మించి పొడిగించడం వల్ల ఇద్దరూ 'ప్రేమించుకునే' ఏజ్‌కి వచ్చిన తర్వాత కేటాయించడానికి సమయం సరిపోలేదు.

రెండు సార్లు బ్రేక్‌ అప్‌ అయిన ఈ జంట చివరకి కలుస్తుందా లేదా అనేదే ఇందులోని సస్పెన్స్‌ పాయింట్‌. అలాగే ఆ రెండుసార్లు బ్రేకప్‌ ఎందుకు జరిగిందనేది కూడా చెప్పకుండా దర్శకుడు తన కథన చాతుర్యంతో వెనక్కి హోల్డ్‌ చేసి పెట్టాడు. చిన్ననాటి బ్రేకప్‌ దేనికనేది ఊహించగలిగేదే కనుక తర్వాత ఇద్దరి మధ్య దూరం ఎందుకు వచ్చిందనేది కీ పాయింట్‌.

ఈ అంశాన్ని దర్శకుడు మరీ సింపుల్‌గా తేల్చేసాడు. తనని అతను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది గ్రహించిన తర్వాత కదిలిపోయిన ఆ అమ్మాయి తన మదిలో తల్లి లేవనెత్తే చిన్న ప్రశ్నకి బెదిరిపోయి అతడినుంచి విడిపోయి పారిపోవడం ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. తల్లి తీసుకునే క్లాస్‌ వల్ల మారిపోయినట్టు కాకుండా నిజంగానే అతనిలో తనకి భవిష్యత్తు కనిపించకో లేక భరోసా కుదరకో విడిపోయిందన్నట్టు చూపిస్తే నమ్మశక్యంగా వుండేది.

అయితే ఈ ప్రేమకథని హృద్యంగా ముగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. హీరో కూడా తన నాన్నలాంటోడే ఏమోనని భయపడ్డ హీరోయిన్‌కి ఆమె తండ్రి జ్ఞానోదయం కలిగించే సీన్‌, అక్కడి సంభాషణలు బ్రహ్మాండంగా వున్నాయి. అలాగే చిన్నతనం నుంచి హీరోని జులాయిగా చూసిన పెద్దావిడ (అన్నపూర్ణ) అతని ప్రేమని అర్థం చేసుకున్నానని చెప్పే సన్నివేశం, మళ్లీ ఎందుకొచ్చావ్‌ అంటూ హీరోయిన్‌ని నిలదీసే హీరో ప్రాణ స్నేహితుడు, అన్నిటికీ మించి పతాక సన్నివేశం కదిలించేలా తెరకెక్కాయి. ఈ సినిమా సోల్‌ మొత్తం ఆ చివరి ఇరవై నిమిషాల్లోనే వుంది. థియేటర్‌నుంచి బయటకి వచ్చేప్పుడు చెమర్చిన కళ్లతో, ఫీల్‌గుడ్‌ అనుభూతితో పంపించేంత స్టఫ్‌ వున్న చివరి ఘట్టం వున్న ఈ చిత్రానికి అంతకు ముందు వున్నదాంట్లో అంతటి డెప్త్‌ లేకపోవడం బలహీనతగా మారింది.

ఈ తరహా ప్రేమకథలు నిదానంగానే సాగుతుంటాయి కనుక స్లో పేస్‌ గురించి కంప్లయింట్స్‌ అనవసరం. కాకపోతే ఛైల్డ్‌హుడ్‌ ఎపిసోడ్‌ని అవసరానికి మించి సాగదీసి, తర్వాత కామెడీ పేరుతో ఆఫీస్‌ సన్నివేశాలు (ఇవి నవ్విస్తాయి) ఎక్కువగా నింపి, వారిద్దరి మధ్య ఏర్పడిన నిజమైన బంధానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడం మాత్రం అతి పెద్ద లోపం. చివర్లో అంత ఎమోషన్‌ పండించిన దర్శకుడు రెండో ఘట్టం మీద కూడా అంతే పట్టు చూపించినట్టయితే 'మళ్లీ రావా' మళ్లీ చూసే సినిమా అయి వుండేది.

సుమంత్‌ నటుడిగా ఎప్పటిలానే తన వంతు న్యాయం చేసాడు కానీ ఈ పాత్రకి అతను కాస్త 'ముదిరినట్టు' కనిపిస్తాడు. ముఖ్యంగా ఒకే ఏజ్‌ అయిన హీరోయిన్‌ పక్కన ఆ డిఫరెన్స్‌ మరీ తెలిసిపోతుంది. ఆకాంక్ష సింగ్‌ నటన బాగుంది. నటన తెలిసిన అతి కొద్ది మంది హీరోయిన్ల కోవలోకి ఈమె చేరుతుంది. హీరో స్నేహితుడి పాత్ర పోషించిన నటుడు, చిన్నప్పటి జంటగా చేసిన బాలనటులు, హీరో ఆఫీస్‌ మేనేజర్‌గా మిర్చి కిరణ్‌ల సపోర్ట్‌ బాగుంది.

సంగీత దర్శకుడు శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం శ్రవణానందం కలిగిస్తుంది. ఆహ్లాదభరిత సంగీతం ఈ చిత్రానికి ఆయువుగా నిలిచింది. మూడు దశల్లో సాగే ఈ కథని ఒక దారిన పెట్టడంలో ఎడిటర్‌ శ్రమ కనిపిస్తుంది. రాజోలు, హైదరాబాద్‌ రోడ్ల ఏరియల్‌ షాట్లతో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ మెప్పిస్తుంది. కామెడీతో పాటు ఎమోషన్స్‌ కూడా పండించగల దర్శకుడు గౌతమ్‌ రాసిన సంభాషణలు కూడా అలరిస్తాయి. కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయి. దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న సందర్భాలు ఇందులో చాలానే వున్నాయి. రొమాంటిక్‌ డ్రామాలు ఇష్టపడే వారిని మెప్పించే అంశాలున్నప్పటికీ మరీ లిమిటెడ్‌ ఆడియన్స్‌కి అప్పీల్‌ అయ్యే తరహా కథనం కావడం 'మళ్ళీ రావా' విజయావకాశాలని కూడా పరిమితం చేసేస్తుంది.

బాటమ్‌ లైన్‌: మళ్ళీ అదే ప్రేమ!

– గణేష్‌ రావూరి