సాధారణంగా చిన్న, మీడియం సినిమాలను వీలయినంత త్వరగా అమ్మేసుకోవాలని, లాభం సంగతి అలా వుంచితే పెట్టుబడి వెనక్కు రప్పించేసుకోవాలని తొందరపడుతుంటారు. కానీ కమెడియన్ సప్తగిరిని హీరోగా పెట్టి సినిమా తీసిన నిర్మాత కిరణ్ ఆలోచన డిఫరెంట్ గా వుంది. సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమాను దాదాపు స్వంతగా విడుదల చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినిమాను అమ్మకుండా, ఏరియాల వారీ, సినిమా రేంజ్ కు తగినట్లు అడ్వాన్స్ లు తీసుకుని, విడుదల చేస్తున్నారట. నిజానికి సప్తగిరి కామెడీకి బి సి సెంటర్లలో బాగానే ఆదరణ వుంది. ఆ మేరకు సప్తగిరి ఎల్‌ఎల్‌బికి ఆఫర్లు మంచిగానే వచ్చాయి. అయినా కూడా అమ్మకుండా, కేవలం అడ్వాన్స్ ల మీద వదలడం అంటే కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువగా వున్నట్లే.
సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమాకు పబ్లిసిటీ, విడుదల ఖర్చులు అన్నీ కలిపి ఏడుకోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఆ మేరకు అడ్వాన్స్ లు తీసుకుని సినిమాను వదుల్తునట్లు తెలుస్తోంది. శాటిలైట్ డీల్ కూడా ఇంకా పూర్తిగా కాలేదు. అలాంటి టైమ్ లో ఎవరన్నా సరే సినిమాను అమ్మేసుకోవాలనే అనుకంటారు. కానీ కంటెంట్ బాగా వచ్చిందని, సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నిర్మాత చెబుతున్నారట. అందుకే కొంటాం అన్నవారిని కూడా అడ్వాన్స్ లే ఇవ్వమని అడిగినట్లు తెలుస్తోంది.
హిందీలో పెద్ద హిట్ అయిన జాలీ ఎల్‌ఎల్‌బి ఆధారంగా సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమా రూపొందించారు.