రాజా ది గ్రేట్ ఇటీవల వచ్చిన బ్లాక్ బస్టర్ గా హడావుడి జరిగిన సినిమా. అయితే ఈ సినిమా వల్ల పంపిణీ దారుగా దిల్ రాజుకు వచ్చిన లాభం గట్టిగా రెండు కోట్లు లేదని గుసగసులు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ సినిమాను దిల్ రాజు దగ్గర కొన్న బయ్యర్ల్లో చాల మంది నష్టాలే మూటకట్టుకున్నారని ఇండస్ట్రీ లెక్కల పండితులు చెబుతున్నారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు నాలుగు జిల్లాల బయ్యర్లకు లాభాలేమీ రాలేదని టాక్ వినిపిస్తోంది. నెల్లూరు మార్జిన్ లో సేఫ్ అయ్యారట. సీడెడ్ అయితే బయ్యర్ కు కాస్త భారీ నష్టమే అని తెలుస్తోంది.
విశాఖ, నైజాం ఏరియాలు నిర్మాత దిల్ రాజువే. అందువల్ల సమస్య ఏమీలేదు. అయితే నిర్మాతగా దిల్ రాజుకు ఈ సినిమా లాభమే. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్, హిందీ డిజిటల్ రైట్స్ రూపంలో కాస్త భారీగానే గిట్టుబాటు అయింది.
హీరోగా రవితేజ సినిమా రేంజ్ ముఫ్ఫై కోట్ల కలెక్షన్లు దాటడం కష్టం అయిపోతోంది. బెంగాల్ టైగర్ పరిస్థితి అదే. ఇప్పుడు రాజా ది గ్రేట్ పరిస్థితి అదే. కానీ సమస్య ఏమిటంటే, రాజా ది గ్రేట్ తరువాత రవితేజ తన రెమ్యూనిరేషన్ పెంచారని టాక్ వినిపిస్తోంది. 12కోట్ల రేంజ్ లో రవితేజ రెమ్యూనిరేషన్ అడుగుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రవితేజ చేస్తున్న టచ్ చేసి చూడు పూర్తయింది. దీని తరువాత కళ్యాణ్ కృష్ణ సినిమా వుండే అవకాశం వుంది. దానికి నిర్మాత ఇంకా ఫిక్స్ కాలేదు. టచ్ చేసి చూడు సినిమా తరువాత రవితేజ మార్కెట్ పై పూర్తి క్లారిటీ వస్తుందేమో?