పదండి ముందుకు. పదండి తోసుకు. అని శ్రీశ్రీ అన్నాడు అంటే, ఎక్కడికి అన్నది కూడా ఆయనే చెప్పాడు. పోదాం పోదాం పైపైకి అని. మరి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఏం అంటున్నాడు. ‘దారంతా చీకటి. ఎదరంతా అంధకారం. చేతిలో దీపం లేదు. కానీ గుండెల్లో ధైర్యం వుంది’ అంటున్నారు కదా? మరి ఈ పరిస్థితి ఎందువల్ల? అంత భయంకరమైన పాలన వుందా? ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ? 2014ఎన్నికల టైమ్ లోనూ ఇదే పలుకులు వల్లించారు.
మళ్లీ ఇప్పుడు ఇదే అంటున్నారు. అంటే 2014 నుంచి 2018 వరకు పరిస్థితి ఏమీ మారలేదని అనుకోవాలా? అంటే పవన్ మద్దతు ఇచ్చిన తెలుగుదేశం, భాజపా రెండూ పూర్తిగా విఫలమయ్యాయనేనా? మరి ఈ విషయం క్లారిటీగా ఎందుకు చెప్పడం లేదు?
‘’… ఓయూ విద్యార్థి మురళీ కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలిసి పరామర్శించేందుకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అందువల్ల ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా…’’
అంటే ఓ రాజకీయ నాయకుడిగా పవన్ పని ఇంతేనా? అసలు ఓ విద్యార్థి మరణిస్తే, అతని కుటుంబాన్ని పరామర్శించాల్సి వస్తే ఆంక్షల అడ్డంకులు ఏమిటి? ఉద్యమిస్తామంటే అడ్డంకులు వుండొచ్చు. కానీ పరామర్శకు అడ్డంకులు ఏమిటి? మరి ఈ విషయమై పవన్ కళ్యాణ్ ఓపెన్ గా తెలంగాణ ప్రభుత్వాన్ని ఫ్రశ్నించాలి కదా?
‘’… యువతలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆశలు రేకెత్తించి వాటిని అమలు చేయకపోతే వచ్చే దుష్పరిణామాలకు వెంకటేశ్, మురళీ ఆత్మహత్యలే నిదర్శనం. యువతలో నిర్వేదం, నిరాశ చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి. ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. యువత నిరాశకు గురికావొద్దని నా విజ్ఞప్తి. విలువైన ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చొద్దు. పోరాడండి. సాధించండి. నాతో పాటు జనసేన కూడా అండగా ఉంటుంది’ అన్నారు.,,’’
అంటే తెలుగుదేశం, తెరాస ప్రభుత్వాలు లేనిపోని హామీలు ఇచ్చాయని, వాటి అమలులో విఫలమయ్యాయని పవన్ లేదా ఆయన పార్టీ జనసేన అభిప్రాయ పడుతున్నాయా? ఒక పక్క హామీలు అన్నీ అమలు చేసామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఆంధ్ర అంతటా ఐటి రంగం భయంకరంగా విస్తరిస్తోందని, యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని యువ రాజకీయ కెరటం నారా లోకేష్ నాయుడు అంటున్నారు. మరి పవన్ ఇలా అంటున్నారు. ఏది నిజం?
‘’..మొదటి విడత పర్యటన అవగాహన, అధ్యయనం, పరిశీలన కోసం, రెండో విడతలో ప్రభుత్వాలకు బాధ్యత గుర్తు చేయడం, మూడో విడతలో అవసరం పడితే పోరాటం..’’ ఇదీ జనసేన కార్యక్రమం అని పవన్ ప్రకటించారు.
కేవలం విశాఖ వెళ్తున్నట్లు చెప్పారు ఒక్క పరామర్శ కోసం, పడవ బాధితులను పరామర్శిస్తా అన్నారు కానీ, వెళ్తున్నట్లు క్లారిటీ లేదు. ఇక ఉస్మానియాకు వెళ్డడమే లేదు. కేవలం ఒకటి రెండు ప్రాంతాలు ఇలా వెళ్లే వచ్చే అవగాహన, అధ్యయనం ఏమిటి? పైగా ప్రభుత్వాలకు బాధ్యత గుర్తు చేయడానికి రెండో విడత పర్యటన దేనికి? పర్యటనలో బాధ్యత గుర్తు చేయడం ఎందుకు? నేరుగా ప్రకటన ద్వారానో, ప్రెస్ మీట్ ద్వారానో చెప్పవచ్చు కదా? అంటే ఇప్పుడు వెళ్లడం, మళ్లీ చెప్పడానికి వెళ్లడం, అది కాకపోతే అప్పుడు పోరాటం?
అసలు ఈ పర్యటనకు రావడానికే పవన్ కు ఇంత కాలం పట్టింది. ఎందుకంటే ఆయన ఫుల్ టైమ్ రాజకీయ వేత్త కాదు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయాలి. ఇప్పుడు అజ్ఖాతవాసి తరువాత ఖాదీ దొరికింది కాబట్టి ఓ టూర్ వేస్తున్నారు. రేపు మరో సినిమా ప్రారంభమైతే, మళ్లీ రెండో విడత, అదే బాధ్యత గుర్తు చేయడం ఎప్పుడు? అదో ఆరు నెలల తరువాతనా? మళ్లీ పోరాటం ఎప్పుడు? మరో ఆరు నెలల తరువాతనా? ఇదెక్కడి పద్దతి. దీన్ని సీరియస్ రాజకీయం అని కానీ, సమస్యల పరిష్కారానికి సీరియస్ పోరాటం అని కానీ అనగలమా ?
ఫాతిమా విద్యార్థుల సమస్య పై ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా కథనాలు వచ్చాయి. ఇంకా దీనిపై పవన్ కు అవగాహన రాకపోవడం ఏమిటి? నేరుగా ఈ సమస్యను ఇన్నాళ్లలో పరిష్కరించండి అని ప్రభుత్వానికి పవన్ అల్టిమేటమ్ ఇవ్వవచ్చు కదా? అంతే కానీ ఈ ఇన్ స్టాల్ మెంట్ పోరాటం ఏమిటి?
ఇదంతా చూస్తుంటే 2019ఎన్నికల టైమ్ వరకు ఇలా నెట్టుకురావాలని పవన్ భావిస్తున్నట్లు అనిపిస్తోంది. తెలివిగా ప్రజలను మాటలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప వేరుకాదని క్లియర్ అవుతోంది.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో మీది తప్పు అని నేరుగా కేంద్రానికి ఎందకు చెప్పరు? కృష్ణా నది పడవప్రమాదానికి కారణం మీ ప్రభుత్వ విధానాలు అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? ఉస్మానియాలో ఆంక్షలు ఏమిటి? యువకుల బలిదానాలకు మీ వాగ్దానభంగం కాదా కారణం అని తెరాస ప్రభుత్వాన్ని నిలదీయరు. ఏదో చేసేస్తున్నట్లు ప్రకటనలు, వాటిలో కవిత్వాలు. తనో మేధావిని అనుకునేలా, గుంటూరు శేషేంద్ర పలుకులు పదేపదే వల్లించడం.
ప్రజలకు కావాల్సింది మాటలు కాదు. చేతలు. గతంలో విశాఖ బీచ్ కు వెళ్తానని చెప్పిన పవన్ వెళ్లలేదు. తరువాత వస్తానని ప్రకటించారు. కానీ ఆ మాటే విస్మరించారు. అవగాహన, అధ్యయనం అవసరం లేని సమస్యలు కొన్ని వుండనే వున్నాయి. ప్రత్యేకహోదా, రైల్వే జోన్ మీద ఇంకా అవగాహన చేసుకోవాలా? అధ్యయనం చేయాలా? అవసరం లేదుగా? ఎందుకంటే ప్యాకేజీ అంటే పాచిపోయిన లడ్లు అన్న అవగాహన అప్పట్లోనే పవన్ కు వచ్చేసిందిగా? మరి వాటిని అమలు చేయమనే అల్టిమేటమ్ కూడా అక్కరలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం దాటిపోయింది. మరి వీటి మీద పవన్ నేరుగా పోరాటానికి దిగవచ్చుకదా ?
యువకులపై ఈ దేశం యువతరంపై అంతటి ప్రేమ వున్న పవన్, నారాయణ, చైతన్య కళాశాల్లలో మగ్గిపోతున్న యువత గురించి ఎందుకు మాట్లాడరు? ఆ ఆత్మహత్యలపై ఎందుకు స్పందించరు?
పవన్ ప్రకటనలు భలే చిత్రంగా వుంటాయి. అసలు పాయింట్ తక్కువ, కొసరు మాటలు ఎక్కువ అన్నట్లు.
సమస్య ఇదీ. కారణం ఇదీ. పరిష్కారం ఇదీ.. పోరాటం ఇదీ. అని క్లియర్ గా మాట్లాడడం, ప్రకటించడం అన్నది పవన్ ఎప్పుడు నేర్చుకుంటారో? పవన్ అభిమానులకు ఆయన చేసినవి, ఆయన మాట్లాడినవి అన్నీ అద్భుతంగానే వుంటాయి. ఎందుకంటే వాళ్ల గుండెల నిండా ఆయన అంటే అభిమానం నిండిపోయింది. అందువల్ల వాళ్లకు అది తప్ప వేరే అక్కరలేదు. కానీ జనాలకు క్లారిటీ కావాలి. పవన్ క్లారిటీ ఇవ్వాలి.
-చాణక్య