రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అయినా వెంటనే ధృవ సినిమాలో రకుల్ కు ఛాన్స్ ఇచ్చాడు చరణ్. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే చరణ్-బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది.
హీరోయిన్లకు వరుసపెట్టి ఛాన్స్ లు ఇవ్వడం చెర్రీకి కొత్తకాదు. గతంలో కాజల్ విషయంలో ఇదే జరిగింది. మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చరణ్, కాజల్ కలిసి పనిచేశారు. మగధీర తర్వాత ఓ సినిమా ఆగిపోయింది కానీ లేదంటే ఈ కౌంట్ ఇంకా పెరిగేది. కాజల్ తర్వాత ఇప్పుడు రకుల్ కు అలా వరుసపెట్టి అవకాశాలిస్తున్నాడు చరణ్.
అటు దర్శకుడు బోయపాటికి కూడా రకుల్ ఇష్టమే. బోయపాటి తీసిన సరైనోడు, జయ జానకి నాయక సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్. అలా చరణ్ తో పాటు ఇటు బోయపాటితో కూడా రకుల్ కు ఇది మూడో సినిమా కావడం విశేషం. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.