Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మెంటల్‌ మదిలో

సినిమా రివ్యూ: మెంటల్‌ మదిలో

రివ్యూ: మెంటల్‌ మదిలో
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
తారాగణం: శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌, శివాజీరాజా, అనితా చౌదరి, రాజ్‌ మదిరాజు, కిరీటి తదితరులు
కూర్పు: విప్లవ్‌ నైషదం
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
ఛాయాగ్రహణం: వేదరామన్‌
నిర్మాత: రాజ్‌ కందుకూరి
రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ
విడుదల తేదీ: నవంబర్‌ 24, 2017

ఒకటికి మించి ఆప్షన్స్‌ వుంటే ఏది సెలక్ట్‌ చేసుకోవాలో తెలియని అయోమయానికి గురయ్యే హీరోకి జీవితంలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఎవరు బెస్ట్‌ అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ సమస్యని అధిగమించి రైట్‌ డెసిషన్‌ ఎలా తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు అనేది 'మెంటల్‌ మదిలో' కథ. ఇద్దరమ్మాయిల మధ్య చిక్కుకుని, ఇద్దరిలో తనకి ఎవరైతే కరక్ట్‌ అనేది తేల్చుకోలేని సందిగ్ధానికి గురయ్యే కథానాయకుల కథలు గతంలో చూసి వున్నాం. అయితే 'ఏది బెస్ట్‌?' అని తెలుసుకోలేని కన్‌ఫ్యూజన్‌తో క్యారెక్టర్‌ని పరిచయం చేసి, దానితోనే కథని నడపడం ఈ చిత్రం ప్రత్యేకత.

మల్టిపుల్‌ ఛాయిసెస్‌ వుంటే ఇబ్బంది పడిపోయే హీరో (శ్రీవిష్ణు) కనీసం బీరువాలోంచి తన చేతికి దొరికిన చొక్కా కూడా వేసుకోలేడు. ఈరోజు ఏ షర్ట్‌ వేసుకోవాలనేది తన తల్లి ముందే డిసైడ్‌ చేసి పెడితే తప్ప అతను కూల్‌గా చొక్కా తొడుక్కోలేడు. ఎక్కడ ఒకటి కంటే రెండు ఆప్షన్లు కనిపించినా కానీ టెన్షన్‌ పడిపోయి గందరగోళానికి గురయ్యే అతగాడికి అమ్మాయిలతో మాట్లాడాలన్నా భయమే.

ఈ కారణంగా ముప్పయ్యేళ్లు వస్తున్నా పెళ్లి కాకుండా వుండిపోతాడు. ఫైనల్‌గా తన ఇబ్బందిని గుర్తించి తన చుటూ కూల్‌ అట్మాస్ఫియర్‌ సెట్‌ చేసే అమ్మాయి (నివేద) రావడంతో అతని లైఫ్‌ మారిపోతుంది. కన్‌ఫ్యూజన్‌ నెమ్మదిగా తొలగి, అమ్మాయిలతో మాట్లాడడం కూడా అలవాటవుతుంది.

ఇంతలో తను ప్రేమించిన అమ్మాయికి దూరంగా వెళ్లాల్సిన సిట్యువేషన్‌ రావడంతో ఆమెని వదిలి వెళ్లిన అతడి జీవితంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. అసలు తనకి ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటి అమ్మాయి తారసపడేసరికి మళ్లీ కన్‌ఫ్యూజన్‌ స్టార్ట్‌ అవుతుంది. రెండు ఆప్షన్లు ఎదురయ్యే సరికి రెండిట్లో ఏది కరక్ట్‌ అని తేల్చుకోవడం కష్టమవుతుంది. ఇంతకాలం వేసుకునే చొక్కాల విషయంలో ఎదురైన కన్‌ఫ్యూజన్‌ ఇప్పుడు తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఎదురు పడే సరికి అతను కరక్ట్‌ డెసిషన్‌ ఎలా తీసుకుంటాడు?

హీరో క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్‌ చేయడంలో, అతని సమస్యని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్‌ చేయడంలో దర్శకుడు వివేక్‌ కంప్లీట్‌గా సక్సెస్‌ అయ్యాడు. ఆ క్యారెక్టర్‌ తాలూకు ఇబ్బందులతోనే హాస్యాన్ని పుట్టించాడు. చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడుతోన్న కొడుకుతో వేగిపోతున్న తండ్రి ఫ్రస్ట్రేషన్‌ని కూడా కామెడీకి ఎంచక్కా వాడుకున్నాడు.

ఇలాంటి అయోమయ పాత్రకి అన్నిట్లో క్లారిటీ వున్న అమ్మాయి కనిపించడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ డెవలప్‌ అవడం అదంతా సాఫీగా, ఆహ్లాదంగా సాగిపోతుంది. ఈ సాఫీ కథలోకి వచ్చే కుదుపు ఏమిటనేది ఊహించగలిగేదే. కానీ ఆ కుదుపు తర్వాత మాత్రం ఈ కథ సాఫీగా ముందుకి కదల్లేదు.

అంతవరకు తను సృష్టించిన క్యారెక్టర్‌ డ్రైవ్‌ చేస్తుంటే తన కథని హ్యాపీగా డైరెక్ట్‌ చేసుకుంటూ పోయిన కథకుడు కమ్‌ దర్శకుడు, ఒక పాయింట్‌ తర్వాత తన క్యారెక్టర్‌ని డ్రైవ్‌ చేయడం స్టార్ట్‌ చేస్తాడు. తన లైఫ్‌నే మార్చేసిన అమ్మాయి నుంచి మరో అమ్మాయి వైపు అతని దృష్టి మరల్చడానికి తర్వాత పరిచయమైన అమ్మాయి ఒక అద్భుతంలా వుండాలి. కానీ ఇక్కడ పరిచయమయ్యే రెండో అమ్మాయి ఒక గందరగోళపు క్యారెక్టర్‌. ఒక పజిల్‌లా, రిడిల్‌లా కనిపిస్తుందే తప్ప ఆకర్షించదు.

ఆమె పట్ల ఆకర్షణ ఏర్పడడమనేది దానంతట అదిగా జరిగిపోవాలే తప్ప, రచయిత ఇక్కడ ఈ అమ్మాయిని ప్రేమించమని ఆదేశించాడు కనుక ఈమెని ప్రేమిస్తున్నట్టు అనిపించకూడదు. ఇంటర్వెల్‌/ఇంటర్‌మిషన్‌ వరకు హాయిగా సాగిపోయిన చిత్రం రెండో కథానాయిక ఎంటర్‌ అయిన దగ్గర్నుంచి భారంగా కదుల్తుంది. కథ ముంబయికి షిఫ్ట్‌ అయిన తర్వాత ఒక్కసారిగా 'మూడ్‌' కూడా మారిపోతుంది.

అంతవరకు వున్న లైటర్‌ టోన్‌ స్థానంలో ఒక విధమైన నిస్తేజం అలముకుని ముంబయి ఎపిసోడ్‌ సాంతం బోరింగ్‌గా గడుస్తుంది. ఈ కన్‌ఫ్యూజన్‌లో చివరకు హీరో ఎవరిని ఎంచుకుంటాడనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నేమీ కాదు. ఆ ముగింపు ఏమిటనేది ఈజీగానే ఊహించవచ్చు. అయితే కథని కంచికి చేర్చే విషయంలో దర్శకుడు అనుభవజ్ఞుడిలా ప్రతిభ చూపించాడు.

హీరో కన్‌ఫ్యూజన్‌ పోగొట్టడానికి అతని తండ్రి ఇచ్చే ఉదాహరణ టెర్రిఫిక్‌గా అనిపిస్తుంది. అలాగే తప్పేదో, రైట్‌ ఏదో తేల్చుకోలేని తన అయోమయం ఇద్దరు అమ్మాయిల్లో ఎవరి దగ్గర వుంటే పోతుందో, ఎవరైతే తనని సరిగ్గా గైడ్‌ చేస్తారో అనేది చిన్న ఫ్లవర్‌వేజ్‌ ఎగ్జాంపుల్‌తో చెప్పిన వైనం దర్శకుడి పరిపక్వతని తెలియజేస్తుంది.

సాఫీగా టేకాఫ్‌ అయి, స్టార్టింగ్‌లో ఎంటర్‌టైన్‌ చేసిన ఈ మెంటల్‌ మదిలో ట్రిప్‌ మధ్యలోకి వచ్చేసరికి పరమ బోరింగ్‌గా మారిపోయి, స్మూత్‌ ల్యాండింగ్‌తో ఎండ్‌ అవుతుంది. 'పెళ్లి చూపులు' సినిమాతో దీనిని పోల్చడం సబబు కాకపోయినా కానీ మార్కెటింగ్‌లో ఆ చిత్రం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది కనుక దాంతో పోల్చి చూస్తే మాత్రం ఇది తేలిపోతుందనే చెప్పాలి.

అక్కడ హీరో క్యారెక్టర్‌తో ప్రతి యూత్‌ రిలేట్‌ చేసుకుంటాడు. ఇక్కడి కన్‌ఫ్యూజన్‌ పాత్రతో రిలేట్‌ కాగలిగేది ఎందరు? అలాగే ఎప్పుడూ బోరింగ్‌ టోన్‌లోకి వెళ్లకుండా ఆద్యంతం ఫన్‌ మిస్‌ అవకుండా చూసుకున్నాడు ఆ దర్శకుడు. ఇక్కడ ప్రథమార్ధానికి, ద్వితీయార్ధానికి నడుమ రెండు సినిమాల అంతరం వుందంటే అతిశయోక్తి కాదు.

ఇక 'మెంటల్‌ మదిలో' చిత్రానికి హీరోగా శ్రీవిష్ణు తన నటనతో న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేసాడు. అయితే యాక్షన్‌ అనగానే పర్‌ఫార్మ్‌ చేయడమని కాకుండా, క్యారెక్టర్‌కి అదనంగా యాడ్‌ చేయగల సత్తా వున్న నటుడు ఇక్కడ అవసరం. శ్రీవిష్ణు ఈ పాత్రని బాగానే పోషించాడు కానీ అది గుర్తుండిపోయేలా, దానిని ఓన్‌ చేసుకునేలా చేయలేకపోయాడు. అలాంటి నటుల అవసరమున్న కథ కావడం వల్ల ఆ వెలితి కీ సీన్స్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నివేదా పేతురాజ్‌ ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌.

ఆమెకి గాత్రదానం చేసిన వీణా ఘంటసాలకి ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాలి. అమృత శ్రీనివాసన్‌ పాత్ర చిత్రణ అందరినీ ఆకట్టుకునేలా లేదు. నటిగా ఆమె ఆ పాత్రలో వేయగలిగిన ప్రత్యేకమైన ఇంప్రెషన్‌ కూడా లేదు. శివాజీరాజా, అనితా చౌదరి మాత్రం తమ పాత్రల్లో చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. ఇద్దరికీ కీ సీన్స్‌ ఇవ్వడంతో నటులుగా తమ సామర్ధ్యాన్ని చాటుకునే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. హీరో స్నేహితుడిగా కిరీటి తన ఉనికి చాటుకున్నాడు.

శేఖర్‌ కమ్ముల సినిమా తరహా ఆంబియన్స్‌ సృష్టించడంలో సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బాగా హెల్ప్‌ అయ్యారు. పాటలు గుర్తుంచుకునేలా లేవు కానీ సినిమాకి ఒక విధమైన క్లాస్‌ అప్పీల్‌ తేవడంలో దోహదపడ్డాయి. ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా బాగుంది. లో బడ్జెట్‌ సెటప్‌లో జరుగుతున్నా కానీ ప్రేమకథకి కావాల్సిన ఆ కలర్‌ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మిస్‌ అవలేదు.

హీరో క్యారెక్టర్‌తో పాటు అతనికి జోడీగా వుండే అమ్మాయి పాత్రని కూడా పర్‌ఫెక్ట్‌గా రాసుకున్న దర్శకుడు ఆమెని దాటి అతడి దృష్టి పక్కకి పోవడానికి తగ్గ మరో బలమైన పాత్రని సృష్టించలేకపోయాడు. ఈ బలహీనత సన్నివేశాలపై రిఫ్లెక్ట్‌ అయి మొత్తంగా ఆ ఎపిసోడే విసుగు, నిట్టూర్పులతో నిండిపోయింది. పెళ్లిచూపులు తరహా మ్యాజిక్‌ ఆల్‌మోస్ట్‌ రూల్డ్‌ అవుట్‌ కానీ, ఫస్ట్‌ హాఫ్‌లో వున్న ఆ సహజత్వం, వినోదం, చివర్లో కుదిరిన సాఫీ సుఖాంతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ని దాటేయడానికి సరిపోతాయా అనేది చూడాలి.

బాటమ్‌ లైన్‌: మది దోచుకునేదే, కానీ...!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?