బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ సంచలన తీర్పు చెప్పారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి కలిగిందని రమ్య తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సహకారం వల్లే నిందితుడికి త్వరగా శిక్ష పడిందని వారు చెప్పడం విశేషం. కేవలం తొమ్మిది నెలల్లోనే నిందితుడికి కఠిన శిక్ష పడడం ప్రశంసలు అందుకుంటోంది.
తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యను కత్తితో ఎనిమిదిసార్లు పొడిచి చంపాడు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేవలం ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి రాంగోపాల్ తీర్పు చెప్పే క్రమంలో ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉంటే, భవిష్యత్ తరాలకు కూడా నష్టమన్నారు. అందుకే కఠిన శిక్ష విధించాలని అన్నారు.
తీర్పుపై రమ్య తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని భావిస్తున్నామని తల్లిదండ్రులు అన్నారు. పోయిన తమ బిడ్డ తిరిగి రాదన్నారు. అయితే తాము ఆశించినట్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో న్యాయం జరిగిందన్నారు. తమ కూతురి ఆత్మకు శాంతి కలిగిందన్నారు.
తన బిడ్డకు పట్టిన గతి ఏ ఆడబిడ్డకు కలగకూడదని తల్లిదండ్రులు కోరుకున్నారు. ప్రభుత్వం, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తమను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుందని రమ్య తల్లిదండ్రులు తెలిపారు.